logo
Published : 24 May 2022 03:09 IST

70 శాతం తరగతిలో 30 శాతం ఆన్‌లైన్‌లో

 ఒకేసారి రెండు ఇంజినీరింగ్‌ డిగ్రీలు చదవొచ్చు.. బోధనలోనూ మార్పులు
 ‘ఈనాడు’తో జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి
ఈనాడు, హైదరాబాద్‌

ఇక నుంచి ఇంజినీరింగ్‌ విద్యా బోధన ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ మిళిత(బ్లెండెడ్‌) పద్ధతిలో ఉంటుందని జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొ.కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. 70 శాతం సిలబస్‌ తరగతి గదిలో, మరో 30 శాతం ఆన్‌లైన్‌లో బోధిస్తారన్నారు. వారానికి ఐదు రోజులే తరగతులుంటాయని; శనివారం దేశ, విదేశాల్లోని ప్రొఫెసర్లు ఆన్‌లైన్‌లో బోధిస్తారని తెలిపారు. వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ఈనాడు’ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.
* ఈనాడు: ఏడాది వ్యవధిలో వర్సిటీ అభివృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారు.?
వీసీ: స్వయం ప్రతిపత్తి కళాశాలల వ్యవస్థలో మార్పులు తెచ్చి క్రమబద్ధం చేశా. ఇంజినీరింగ్‌లో మైనర్‌, హానర్స్‌ డిగ్రీలు ప్రవేశపెట్టాం. పాలనలో ప్రీ ఆడిట్‌ విధానం, బాలికల హాస్టళ్లలో మినీ లైబ్రరీలు, స్టడీ హాళ్లు తీసుకొచ్చాం. వీసీల సదస్సు నిర్వహించాం.
* ఈనాడు:  2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న జాతీయ విద్యా విధానంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరనుంది?
వీసీ: విద్యార్థి కేంద్రంగా అభ్యసన సామర్థ్యాలు పెంచేలా పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ఇంటర్నల్స్‌ 40 శాతం, ఎక్స్‌టర్నల్స్‌కు 60 శాతం మార్కులు ఇవ్వనున్నాం. రెండు, నాలుగు ఏడాదుల్లో పరిశోధన ఆధారిత ప్రాజెక్టులు ప్రవేశపెట్టాం. బీటెక్‌ రెండో ఏడాది పూర్తయ్యాక ఎగ్జిట్‌ అవ్వొచ్చు. విద్యార్థులకు డ్యూయల్‌ డిగ్రీ చేసే అవకాశం కల్పిస్తున్నాం. ఇంజినీరింగ్‌ చదువుతూనే  మూడేళ్ల బీబీఏ కోర్సు చేయొచ్చు. పైథాన్‌ ప్రోగ్రాం తప్పనిసరి చేశాం. జేఎన్‌టీయూతో పాటు అటానమస్‌ కళాశాలల్లోనూ ఒకే తరహా సిలబస్‌ తీసుకొస్తున్నాం.
* ఈనాడు:   అఫిలియేటెడ్‌ కళాశాలల అనుమతులపై విమర్శలను ఎలా పరిష్కరించనున్నారు.?
వీసీ: ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకుల నియామకానికి ఇకపై వర్సిటీ తరఫున జాతీయ స్థాయి పరీక్ష నిర్వహించి మెరిట్‌ జాబితా ప్రకటిస్తాం. వారిని కళాశాలలు ఎంచుకోవాలి. రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నాం.
* ఈనాడు:  ఎన్‌ఈపీపై రాష్ట్ర ప్రభుత్వం భిన్నాభిప్రాయంతో ఉంది. ఈ పరిస్థితుల్లో అమలు సాధ్యమేనా?
వీసీ: డ్యూయల్‌ డిగ్రీ, ఎగ్జిట్‌ ఆప్షన్లు.. ఎన్‌ఈపీలో ఉన్నాయనే అమలు చేయడం లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్నారు. ప్రభుత్వం ప్రధానంగా పాఠశాల విద్య విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
* ఈనాడు:  ఈసారి ఏమైనా కొత్త కోర్సులు తీసుకొస్తున్నారా.?
వీసీ: ప్రస్తుతం వర్సిటీలో 25 యూజీ, 41 పీజీ కోర్సులున్నాయి. గతేడాది 15 కోర్సులు ప్రవేశపెట్టాం. ఈసారి నాలుగైదు కోర్సులు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం.
* ఈనాడు:  ఇంటర్నల్స్‌ పెంచితే నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది కదా?
వీసీ: ఇందులో నాలుగు రకాల భిన్న కాంపొనెంట్స్‌ తీసుకొచ్చాం. పోస్టర్‌ ప్రజంటేషన్‌పై ముగ్గురు ఎగ్జామినర్ల పరిశీలన ఉంటుంది. అంశాల వారీగా పరీక్షలు, బృంద చర్చలు ఉంటాయి. ఇలా నిరంతరం అభ్యసన, మూల్యాంకనం జరుగుతాయి. సబ్జెక్టుపై పట్టు సాధిస్తేనే మంచి మార్కులు తెచ్చుకోగలరు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts