logo

వరుస ట్రాఫిక్‌ జాంలు.. నగరవాసులకు ఇక్కట్లు

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ముందస్తు సందడి.. జగన్నాథుడి రథయాత్రలు.. వేల సంఖ్యలో వాహనాల రాకపోకలతో నగరంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ నలుమూలలా ట్రాఫిక్‌జాంలు ఉత్పన్నమవడంతో వాహనదారులు, ప్రజలు

Published : 02 Jul 2022 02:04 IST

బంజారాహిల్స్‌లో స్తంభించిన వాహనాలు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ముందస్తు సందడి.. జగన్నాథుడి రథయాత్రలు.. వేల సంఖ్యలో వాహనాల రాకపోకలతో నగరంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ నలుమూలలా ట్రాఫిక్‌జాంలు ఉత్పన్నమవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు, ఇందిరాపార్క్‌ నుంచి ఖైరతాబాద్‌ వరకు జగన్నాథుడి రథయాత్రలు, ప్రధాని మోదీ కాన్వాయ్‌ రిహార్సల్‌ జరగడంతో ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు వాహనాలతో ఒక్కసారిగా బయటకు రావడంతో రోడ్లపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, ఇందిరాపార్క్‌ల వద్ద నుంచి వేర్వేరుగా జరిగిన జగన్నాథ రథయాత్రల్లో వందలమంది భక్తులు పాల్గొన్నారు. దీంతో కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఇందిరా పార్క్‌ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు సికింద్రాబాద్‌ నుంచి హెచ్‌ఐసీసీ మధ్య కేంద్ర మంత్రులు, వీవీఐపీలు రాకపోకలు కొనసాగించడంతో వారిని వేగంగా గమ్యస్థానాలను చేర్చేందుకు కొన్ని చోట్ల పోలీసులు వాహనాల రాకపోకలను నిలిపేశారు. పంజాగుట్ట, బంజారాహిల్స్‌లపై ఈ ప్రభావం పడడంతో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌45, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 12, మాసాబ్‌ట్యాంక్‌ లక్డీకాపూల్‌, రాజ్‌భవన్‌, బేగంపేట ప్రాంతాల్లో వాహనాలు ఆగిపోయాయి. రాజ్‌భవన్‌ నుంచి పరేడ్‌ మైదానం వరకూ ప్రధాని మోదీ కాన్వాయ్‌ రిహార్సల్‌ను పోలీసులు సాయంత్రం నిర్వహించడంతో ట్రాఫిక్‌జాంలలో ఇరుక్కుని రాత్రి 9గంటలకు వాహనదారులు గమ్యస్థానాలకు చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని