logo

Hyderabad : సౌరపలక.. అవినీతి మరక

విద్యుత్తు సంస్థల్లో అవినీతి కంపు సౌర విద్యుత్తుకు పాకింది. ఇళ్లపై సౌర విద్యుత్తు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు,  నెట్‌మీటర్‌ జారీ చేసేందుకు సొమ్ములు డిమాండ్‌ చేస్తున్నారు.  అడిగినంత ఇవ్వకపోతే రోజులు, వారాల తరబడి వినియోగదారులను

Updated : 07 Jul 2022 07:24 IST

సౌర విద్యుత్తునూ వదిలిపెట్టని   అక్రమార్కులు

నివేదిక ఇవ్వాలన్నా.. నెట్‌మీటర్‌ తీసుకోవాలన్నా ముట్టజెప్పాల్సిందే

ఈనాడు, హైదరాబాద్‌

విద్యుత్తు సంస్థల్లో అవినీతి కంపు సౌర విద్యుత్తుకు పాకింది. ఇళ్లపై సౌర విద్యుత్తు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు,  నెట్‌మీటర్‌ జారీ చేసేందుకు సొమ్ములు డిమాండ్‌ చేస్తున్నారు.  అడిగినంత ఇవ్వకపోతే రోజులు, వారాల తరబడి వినియోగదారులను తిప్పించుకుంటున్నారు. ఏసీబీ అధికారులు విద్యుత్తు సంస్థలోని అవినీతి ఇంజినీర్లు, సిబ్బందిని ప్రతినెలా ఇద్దరు ముగ్గుర్ని రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకుంటున్నా జంకడం లేదు. ఇళ్లపై సౌర విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం ఒకింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ భారం తగ్గించేందుకు ప్రభుత్వాలు కొంత సబ్సిడీని ఇస్తున్నాయి. అయినా సరే కిలోవాట్‌ సౌర పలకల ఏర్పాటుకు రూ.37,330 వరకు అవుతుంది. మూడు కిలోవాట్ల సామర్థ్యం కల్గిన యూనిట్లకు లక్ష దాటుతుంది.  

ప్రతిదానికో రేటు..
ఇళ్లపై సౌర విద్యుత్తు ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే మిగిలిన సౌరవిద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేయాలంటే మాత్రం డివిజినల్‌ సబ్‌ ఇంజినీర్లు పరిశీలించి (ఫిజిబిలిటీ రిపోర్ట్‌) నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సరూర్‌నగర్‌ సర్కిల్‌లోని ప్రధాన రహదారి ప్రాంతంలో గతంలో పనిచేసిన ఏడీఈ, సబ్‌ ఇంజినీర్‌ డబ్బులు ఇస్తేనే చేతికి నివేదిక ఇచ్చేవారు.  వీరు బదిలీ కావడంతో అక్కడి వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలోని సీఎస్‌ఈలోని ఒక ఇంజినీరు వసూళ్లు మొదలెట్టారు. ఏకంగా అవినీతికి కౌంటరే తెరిచారు. డబ్బులు ఇస్తే తప్ప నెట్‌మీటర్‌ జారీ చేయడం లేదు. పరిశోధన సంస్థలకు సమీపంలోని ఒక సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఇంజినీరు ఒకరు ఒక నెట్‌మీటర్‌కైతే రూ.2500,  ఎక్కువ ఉంటే ప్రతి మీటర్‌కు రూ.1500 ఇవ్వాల్సిందే అంటున్నారు.  ఇక లైన్‌మెన్లు అయితే సింగిల్‌ ఫేజ్‌కు రూ.500, త్రి ఫేజ్‌కు వెయ్యి వసూలు చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడుతుంటే హెచ్చరించాల్సిన సబ్‌ డివిజన్‌, డివిజన్‌ ఇన్‌ఛార్జిలు కొందరు సిబ్బందికంటే ముందే వసూళ్లకు పాల్పడుతున్నారు.


* గత నెల జూన్‌లో సనత్‌నగర్‌లో ఏఈ అవినాష్‌, లైన్‌ఇన్‌స్పెక్టర్‌ కృపానందారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

* మార్చిలో మాదాపూర్‌లో మీటర్‌ బిగింపునకు లంచం తీసుకుంటూ లైన్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకరరావు, లైన్‌మెన్‌ సతీష్‌ ఏసీబీకి దొరికారు.

* నవంబరులో ఇబ్రహీంబాగ్‌ ఏడీఈగా పనిచేస్తున్న చరణ్‌సింగ్‌ రూ.30వేల లంచం తీసుకుంటూ అవినీతి  నిరోధక శాఖకు దొరికిపోయారు.

* అక్టోబరులో నాగోల్‌లో ఏఈ మధుకర్‌ ఏసీబీకి చిక్కాడు. పని పూర్తయ్యిందనే నివేదిక ఇచ్చేందుకు గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.


ఎవరి స్థాయిలో వాళ్లు..
డిస్కంలో కింది నుంచి పైస్థాయి వరకు ఎక్కువ మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎవరైనా వినియోగదారుడు పైఅధికారికి ఫిర్యాదు చేసినా చర్యలు ఉండటం లేదు. చర్యలు తీసుకుంటే తమ అవినీతి బండారం ఎక్కడ బయటపెడుతారేమోనని అధికారులు భయపడుతున్నారు. కొందరైతే మీ దిక్కున్న చోట చెప్పుకోండని వినియోగదారులనే బెదిరిస్తున్నారు. ‘కొత్తగా చేరిన ఇంజినీర్లు ఎక్కువగా సబ్జెక్ట్‌ నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే బాధేస్తుంది. పని అంటే పైసలు వచ్చేదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని ఒక సీనియర్‌ ఇంజినీర్‌ వాపోయారు. చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో వినియోగదారులు, గుత్తేదార్లు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. సోమవారం ఘట్‌కేసర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌, స్తంభాల బిల్లు మంజూరుకు గుత్తేదారు నుంచి లంచం డిమాండ్‌ చేసి ఏఈ రాజా నర్సింగరావు, సబ్‌ఇంజినీర్‌ అశోక్‌ అడ్డంగా దొరికిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని