logo

Hyderabad news : బల్దియా కళ్లలో మట్టి

గ్రేటర్‌లో ఏటా 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికను జీహెచ్‌ఎంసీ నాలాలు, మోరీల్లోంచి తొలగిస్తోంది. దశాబ్దంగా ఈ తతంగం నడుస్తోంది. అంటే.. 50 లక్షల క్యూబిక్‌ మీటర్లకుపైగా మట్టిని నాలాల్లోంచి తీసినట్లు. అందుకు ప్రతి సంవత్సరం

Updated : 08 Aug 2022 06:58 IST

ఏటా 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికతీతకు రూ.40 కోట్లు

ప్రైవేటు వ్యర్థాలతో మాయ చేస్తున్న ఇంజినీర్లు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో ఏటా 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికను జీహెచ్‌ఎంసీ నాలాలు, మోరీల్లోంచి తొలగిస్తోంది. దశాబ్దంగా ఈ తతంగం నడుస్తోంది. అంటే.. 50 లక్షల క్యూబిక్‌ మీటర్లకుపైగా మట్టిని నాలాల్లోంచి తీసినట్లు. అందుకు ప్రతి సంవత్సరం రూ.40 కోట్ల మేర బల్దియా బిల్లులు చెల్లిస్తోంది. నిధులు ఖర్చవుతున్నాయి.. కానీ నాలాల్లోకి చేరే పూడిక తగ్గట్లేదు. తొలగించిన మట్టి కుప్పలు ఎక్కడున్నాయో కనిపించట్లేదు. ఐదేళ్ల క్రితం అప్పటి బల్దియా కమిషనర్‌ దానకిశోర్‌ సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇందులోని అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు పలు నిబంధనలను అమల్లోకి తెచ్చారు. అయినా ఫలితం లేదు. అధికారి బదిలీపై వెళ్లడంతో.. అవకతవకలు రూపం మార్చుకున్నాయి.

అడ్డదారిలో చెల్లింపులు..

గ్రేటర్‌లో పూడికతీత అంటే.. నిధుల దోపిడీ అనే పేరుంది. కొందరు ఇంజినీర్లు, గుత్తేదారులు టెండర్ల సమయంలో జట్టుకడతారు. ఇంజినీర్లు పనులు ఇప్పించడం.. గుత్తేదారులు బిల్లుల్లో వాటాలు పంచడం జరుగుతోంది. సాధారణంగా బిల్లులు చెల్లించేటప్పుడు గుత్తేదారులు.. ఇంజినీర్లకు శాతాల లెక్కన లంచం ఇస్తారు. పూడికతీతలో మాత్రం.. వాటాలు ఉంటాయనే ఆరోపణలున్నాయి. ఆరేళ్ల క్రితం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాల వాహనాల నంబర్లను టిప్పర్ల నంబర్లుగా చూపించిన బిల్లులు ఖైరతాబాద్‌ జోన్‌లో వెలుగులోకి వచ్చాయి. ఆరు జోన్లు ఉండగా.. ఖైరతాబాద్‌లోనే రూ.2 కోట్ల అక్రమాలు బయటపడ్డాయి. ఆ ఘటనలో ఇంజినీర్లు, గుత్తేదారులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. మరుసటి ఏడాదే కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న ఎం.దానకిశోర్‌ పనులు చేపట్టే విధానంలో మార్పులు చేశారు. నాలాల నుంచి తొలగించిన మట్టిని జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులోని ఖాళీ స్థలంలో కుప్పగా పోయాలన్నారు. ఖర్చు చేస్తున్న నిధులకు తగ్గట్లుగా మట్టి కనిపించాలనే షరతు పెట్టారు. ఆ ఏడాది అవకతవకలు కొంత తగ్గాయి. ఆయన బదిలీ కావడంతో.. అవినీతి అధికారులు మళ్లీ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. పూడికను కుప్పగా చూపించాలనే షరతు ఉండటంతో.. ప్రైవేటు వ్యర్థాలను చూపించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ..నాలాల్లోంచి తొలగించిన మట్టిని గుత్తేదారులు నగరంలోని ఖాళీ స్థలాలు, చెత్తకుప్పలు, చెరువుల్లో పడేస్తుండగా.. ప్రైవేటు సంస్థల నుంచి సేకరించే పరిశ్రమ వ్యర్థాలు, ఇతర మట్టిని జవహర్‌నగర్‌లో నింపుతున్నారు. దానినే పూడికగా పేర్కొని, రూ.కోట్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఆయా వ్యర్థాలు జవహర్‌నగర్‌ చేరినట్లు, వాటి పరిమాణం ఆధారంగా బిల్లులు చెల్లిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని