ఘరానా చోరుడు.. జల్సారాయుడు

అతనో ఘరానా దొంగ. కన్నుపడితే ఎంతటి భద్రత ఉన్న ఇల్లయినా గుల్లయినట్టే. గ్రేటర్‌లోనే 90కి పైగా చోరీలు చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా కేసులున్నాయి. ఎన్నిసార్లు జైలుకెళ్లినా బుద్ధి మారడంలేదు. 4 నెలల క్రితం సైబరాబాద్‌ పోలీసులు జైలుకు పంపారు.

Updated : 24 Sep 2022 05:36 IST

మహిళల వీడియోలు తీసి బెదిరించి వసూళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: అతనో ఘరానా దొంగ. కన్నుపడితే ఎంతటి భద్రత ఉన్న ఇల్లయినా గుల్లయినట్టే. గ్రేటర్‌లోనే 90కి పైగా చోరీలు చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా కేసులున్నాయి. ఎన్నిసార్లు జైలుకెళ్లినా బుద్ధి మారడంలేదు. 4 నెలల క్రితం సైబరాబాద్‌ పోలీసులు జైలుకు పంపారు. ఇటీవల నగరం, శివారుల్లోని కల్లు దుకాణాలు, మార్కెట్లు, తోపుడు బండ్ల వద్ద ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయి. ఇతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినపుడు విస్మయం కలిగించే విషయాలు వెలుగు చూసినట్టు సమాచారం.

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నేరస్థుడు(30) మారు పేర్లతో తిరుగుతుంటాడు. ఆచూకీ తెలుస్తుందని ఆధార్‌కార్డు తీసుకోలేదు. కొద్దికాలం యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో ఉన్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక మొదటి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత ఐడీఏ బొల్లారానికి వచ్చి, ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. 2017లో నగర పోలీసులు ఇతన్ని అరెస్ట్‌ చేసి రూ.50 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కకుండా ఎత్తులు వేయటంలో తెలివిగా వ్యవహరిస్తాడంటూ సైబరాబాద్‌కు చెందిన ఓ పోలీసు అధికారి తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో ఖరీదైన ఇళ్లు, ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తాడు. అర్ధరాత్రి దాటాక స్క్రూడ్రైవర్‌, ఇనుప రాడ్‌ సాయంతో ఇంట్లోకి ప్రవేశించి చోరీలు చేసి జారుకుంటాడు.

చోరీల్లో మరో రూటు
ఆభరణాలు కొట్టేసేందుకు కల్లు, మద్యం దుకాణాలు, తోపుడుబండ్లు, కాలిబాట మార్గాల్లో చిరువ్యాపారాలు నిర్వహించే మహిళలను గుర్తిస్తాడు. 30-40 ఏళ్లలోపు మహిళలను ఎంపిక చేసుకొని కొనుగోలు చేసేందుకు వెళ్లినట్టుగా మాట కలుపుతాడు. మద్యం అలవాటున్న వారికి తాగించి నిర్మానుష్య ప్రదేశానికి కొందరిని, మరి కొందరిని హోటల్‌ గదులకు తీసుకెళతాడు. ఆ మహిళల నగ్న చిత్రాలు, వీడియోలు తన చరవాణితో చిత్రీకరిస్తాడు. అవి చూపి బెదిరించి నగలు, నగదు డిమాండ్‌ చేస్తాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుటుంబంలో కలతలు వస్తాయని అతను అడిగినంత ఇచ్చేస్తున్నారని, ఫిర్యాదులకు వెనుకంజ వేస్తున్నారంటూ ఓ సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని