logo

చిన్న పంచాయతీలకు చిక్కులు!

కొత్త పంచాయతీల ఏర్పాటుతో పల్లె ప్రగతి మరింత పరుగుగెడుతుందని ప్రజలు భావించినా.. అవాంతరాలు తప్పడం లేదు. జిల్లాలో 369 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగా ఏర్పాటయినవి 197. ప్రధానంగా చిన్న పంచాయతీలు నిధులు లేక ఇబ్బంది పడుతున్నాయి.

Published : 05 Oct 2022 03:10 IST

కార్యాలయాలకు సొంత భవనాలు కరవు
నెలనెలా ట్రాక్టర్‌ వాయిదాలు చెల్లించలేని పరిస్థితి


వాహనంలో చెత్త వేస్తూ..

న్యూస్‌టుడే, వికారాబాద్‌: కొత్త పంచాయతీల ఏర్పాటుతో పల్లె ప్రగతి మరింత పరుగుగెడుతుందని ప్రజలు భావించినా.. అవాంతరాలు తప్పడం లేదు. జిల్లాలో 369 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగా ఏర్పాటయినవి 197. ప్రధానంగా చిన్న పంచాయతీలు నిధులు లేక ఇబ్బంది పడుతున్నాయి. మూడేళ్ల కిందట నూతనంగా ఏర్పడిన వాటికి సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇంకొన్ని చోట్ల బడులు, ఇతర ప్రభుత్వ భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. గ్రామ సభలు, సమావేశాలు, రచ్చబండ తదితర కార్యక్రమాలను వరండాలు, చెట్ల కిందనే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కథనం.

తప్పని ఎదురుచూపు: కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి మంజూరీ చేసే నీతి ఆయోగ్‌ నిధులు ఇప్పట్లో వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. ఆరు నెలల కిందట ప్రత్యేక ఖాతాలు తెరిచి సర్పంచులు నిధుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.

30 శాతం ట్రాక్టర్ల నిర్వహణకే..

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా చేపట్టేందుకు ఏడాది కిందట ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, నీటి ట్యాంకర్‌ అందించింది. ఇందుకు నెలనెలా వాయిదాలు చెల్లించేలా పలు బ్యాంకుల నుంచి రుణ సదుపాయాన్ని కల్పించింది. ఇదంతా బాగానే ఉన్నా.. వాటి నిర్వహణ, వాయిదాల చెల్లింపులు పంచాయతీలకు భారంగా మారాయి. తండా పంచాయతీలు, చిన్న గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధుల్లో 30 శాతం ట్రాక్టర్ల నిర్వహణకే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచులు వాపోతున్నారు. కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నిధులూ.. సక్రమంగా రావడం లేదని చెబుతున్నారు.


పల్లె ప్రగతి నిధులు మంజూరు చేయాలి
- ప్రవీణ్‌కుమార్‌, సర్పంచి, యాబాజిగూడ, పరిగి

పంచాయతీ నూతనంగా ఏర్పాటైంది. సొంత భవనం లేక ఓ ఇరుకు గది నుంచే పాలన కొనసాగిస్తున్నాం. పల్లె ప్రగతి కింద గ్రామానికి నెలకు వచ్చే రూ.88 వేలు ట్రాక్టర్‌ నిర్వహణ, కార్మికుల వేతనాలకు కూడా సరిపోవడం లేదు. ఇతర గ్రాంటు కింద మంజూరు చేసిన రూ.2 లక్షల నిధులతో ట్రాక్టర్‌ నిర్వహణ, సిబ్బంది వేతనాలు, రుణాలను చెల్లిస్తున్నాం.


దశల వారీగా సమస్యల పరిష్కారం
- మల్లారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

నూతనంగా ఏర్పాటైన పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తాం. నూతన పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. జనాభా ప్రాతిపదికన పల్లె ప్రగతి నిధులు నిధులు మంజూరు అవుతున్నాయి. వీటితో పారిశుద్ధ్యం, ట్రాక్టర్ల నిర్వహణ, వాయిదాలు, సిబ్బంది వేతనాల చెల్లింపులు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని