logo

చెత్త కనిపిస్తే.. ఇంటికే!

స్వచ్ఛ హైదరాబాద్‌ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్‌ బి.సంతోశ్‌, మరో ఏడుగురు ఉన్నతాధికారులతో ఆకస్మిక తనిఖీలకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

Published : 25 Nov 2022 03:03 IST

ఆకస్మిక తనిఖీలకు ప్రత్యేక బృందాలు


తనిఖీల్లో ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ పద్మజ

ఈనాడు, హైదరాబాద్‌: స్వచ్ఛ హైదరాబాద్‌ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్‌ బి.సంతోశ్‌, మరో ఏడుగురు ఉన్నతాధికారులతో ఆకస్మిక తనిఖీలకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. వారం రోజులుగా వీరు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. వారి తనిఖీల్లో అనేక అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్లపై చెత్త కుప్పలను తొలగించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. వ్యర్థాల సేకరణ ఆటోలు, పారిశుద్ధ్య కార్మికుల విధులు, స్వచ్ఛ ఆటోల పని తీరు తదితర అంశాల్లో లోపాలను గుర్తించారు. చెత్త కుప్పలను తొలగించినట్లు రోజూ ఉదయం 9 గంటల్లోపు క్షేత్రస్థాయి ఫొటోలను అధికారులకు సమర్పించాల్సి ఉండగా.. సిబ్బంది పాత ఫొటోలు పంపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. సహాయ వైద్యాధికారులు లేదా పారిశుద్ధ్య విభాగం ఇంజినీర్లే అలా చేయిస్తున్నట్లు వెల్లడైంది. ఎప్పటికప్పుడు జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో చర్చిస్తూ.. నిర్లక్ష్యంగా వహించే సిబ్బందిని తొలగిస్తామనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఎనిమిది మందితో..

రోజూ నగరంలో 6,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దాన్ని 4,450 స్వచ్ఛ ఆటోలు, పలు ట్రక్కులు నిత్యం సేకరిస్తుంటాయి. క్షేత్ర స్థాయిలో దాదాపు 30శాతం ఆటోలు రోజూ విధుల్లో పాల్గొనట్లేదు. ఫలితంగా గృహస్థులు ఇంటి వ్యర్థాలను రోడ్డుపై పడేస్తున్నారు. విధానపరమైన లోపాలు, వ్యక్తుల నిర్లక్ష్యం సమస్యకు కారణమవుతున్నాయి. పౌరులు, కార్పొరేటర్లు ఆ విషయమై చాలా కాలంగా జీహెచ్‌ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్‌ డి.ఎస్‌.లోకేశ్‌కుమార్‌ 8 మంది అధికారులతో కమిటీ వేశారు. అదనపు కమిషనర్‌,  ప్రాజెక్టు అధికారి(పీవో), గ్రేటర్‌ ముఖ్య వైద్యాధికారి (సీఎంఓహెచ్‌), ముగ్గురు జాయింట్‌ కమిషనర్లు (జేసీ), సూపరింటెండెంట్‌ ఇంజినీరు (ఎస్‌ఈ), కార్యనిర్వాహక ఇంజినీరు (ఈఈ) తదితరులు బృందంలో ఉన్నారు. రోజూ క్షేత్ర స్థాయిలో పరిశీలించి అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ ఆదేశాలిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని