logo

అడ్డొస్తే అంతుచూస్తాం..

నగరంలోని పారిశ్రామికవాడల్లో వ్యర్థ రసాయనాల మాఫియా బరితెగిస్తోంది... నగరం, శివారు ప్రాంతాల్లో మందులు.. రసాయనాలు... రంగులు... విద్యుత్‌ బ్యాటరీలు... యంత్రాలు..

Published : 05 Dec 2022 04:58 IST

ఇష్టారాజ్యంగా వ్యర్థ రసాయనాల పారబోత
నిలువరించిన అధికారులకు బెదిరింపులు

జీడిమెట్లలో పీసీబీ అధికారులపై దాడి జరిగిన ప్రాంతం

ఈనాడు,హైదరాబాద్‌, న్యూస్‌టుడే, జీడిమెట్ల: నగరంలోని పారిశ్రామికవాడల్లో వ్యర్థ రసాయనాల మాఫియా బరితెగిస్తోంది... నగరం, శివారు ప్రాంతాల్లో మందులు.. రసాయనాలు... రంగులు... విద్యుత్‌ బ్యాటరీలు... యంత్రాలు.. పరికరాలు తయారు చేస్తున్న పరిశ్రమలు వాటి ద్వారా విడుదలయ్యే వ్యర్థ రసాయనాలను అక్కడికక్కడే వదిలేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. రోజూ రాత్రి వేళల్లో ట్యాంకర్ల ద్వారా ప్రమాదకర రసాయనాలను నాలాలు, బోర్లలో వదిలేస్తోంది. అడ్డుకునేందుకు యత్నిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులపైనే దాడులకు దిగుతోంది. పరిశ్రమల ద్వారా విడుదలయ్యే వ్యర్థ రసాయనాలను శుద్ధి చేసి సుదూర ప్రాంతాలకు తరలించి చెరువులు, నిరుపయోగమైన భూముల్లో వదిలేయాలి. ఇందుకు భిన్నంగా జీడిమెట్ల, పాశమైలారం, ఐడీఎ బొల్లారం పారిశ్రామికవాడల్లోని కొన్ని ఫార్మా కంపెనీలు, రసాయనాల పరిశ్రమలు అక్కడే ఉన్న నాలాలు, భూగర్భంలోకి నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాయి. దీంతో ఫార్మా కంపెనీలు, పరిశ్రమల పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

ముందు పైలెట్‌ వాహనం.. వెనుక ట్రక్కులు

జీడిమెట్ల, పాశమైలారం, ఐడీఎ బొల్లారం పారిశ్రామికవాడల్లోని కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు రసాయన వ్యర్థాలను వదిలించుకునేందుకు స్థానికంగా ఉన్న రౌడీషీటర్లు, నేరస్థులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. యాజమాన్యాల ప్రతినిధులు రౌడీషీటర్లు, నేరస్థులతో మాట్లాడుకుని ఎప్పుడు, ఎక్కడ రసాయనాలు పారబోయాలన్నది వివరిస్తారు. పరిశ్రమకు చెందిన ట్రక్కులు, జీపులు వారే సమకూరుస్తారు. ఒక ట్రక్కు రసాయన వర్థ్యాలను డిస్పోజ్‌ చేసేందుకు  రూ.50వేల నుంచి రూ.75వేలు ఇస్తున్నారు. వ్యర్థ రసాయనాలను డ్రమ్ముల్లో నింపి ట్రక్కుల్లోకి ఎక్కించాక రౌడీషీటర్ల అనుచరులు, నేరస్థులు వాటిని పరిశ్రమల నుంచి బయటకు తీసుకువచ్చి సమీపంలోని నాలాలు, బోర్లలో వదిలేస్తారు. ట్రక్కు బయటకు వెళ్లినప్పటి నుంచి మళ్లీ పరిశ్రమకు వచ్చేవరకూ ఒక జీపు ట్రక్కు ముందు పైలెట్‌ వాహనంలా వెళ్తుంటుంది. మరీ ప్రమాదకర రసాయనాలుంటే జాతీయ రహదారులు, సంగారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌, నల్గొండ ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడున్న గుంతల్లో, చెరువుల్లో పారబోసి వస్తున్నారు.

సిబ్బంది ఆవేదన

రసాయన వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబి) అధికారులు కొద్దినెలల నుంచి ప్రత్యేక నిఘా ఉంచారు. రాత్రివేళల్లో రసాయన వ్యర్థాలు తీసుకెళ్లే ట్రక్కులను అడ్డుకునేందుకు గస్తీ బృందాల తరహాలో రాత్రివేళల్లో ఇద్దరు సిబ్బందితో బృందాలను నియమించారు. ఈ బృందాలు రాజేంద్రనగర్‌, కాటేదాన్‌, పాశమైలారం, ఐడీఏ బొల్లారం, జీడిమెట్ల పారిశ్రామికవాడల్లో గస్తీ తిరుగుతుంటాయి. జీడిమెట్లలో మూడు రోజుల క్రితం ఇద్దరు పీసీబీ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా... అర్ధరాత్రి దాటాక వ్యర్థ రసాయనాలతో వెళ్తున్న ట్యాంకర్‌ను అడ్డుకున్నారు. అందులో ఉన్న దుండగులు వారిపై దాడి చేశారు. చంపేస్తామంటూ బెదిరించి ట్యాంకర్‌తో వెళ్లిపోయారు. జరిగిన సంఘటనపై పీసీబీ అధికారులు, సిబ్బంది ఆత్మరక్షణలో పడిపోయారు. నేరస్థుల వద్ద ఆయుధాలున్నాయని, వారి నుంచి తమకు ఎలాంటి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు తమకు రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని