logo

ఇక్కడ చేరి.. అక్కడ చదివేయొచ్చు!

హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో చేరిన ఒక విద్యార్థి.. ఆస్ట్రేలియాలో బీటెక్‌లో పూర్తి చేసుకోవచ్చు. మూడున్నరేళ్లు ఇక్కడ చదివి.. మరో ఏడాదిన్నర అక్కడ చదివి పీజీ కూడా చేసేయొచ్చు.

Published : 10 Dec 2022 03:25 IST

నగర వర్సిటీలతో విదేశీ  విద్యాసంస్థల ఒప్పందాలు
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో చేరిన ఒక విద్యార్థి.. ఆస్ట్రేలియాలో బీటెక్‌లో పూర్తి చేసుకోవచ్చు. మూడున్నరేళ్లు ఇక్కడ చదివి.. మరో ఏడాదిన్నర అక్కడ చదివి పీజీ కూడా చేసేయొచ్చు. ఇందుకు ఫీజులో రాయితీ కూడా లభిస్తుంది. ఇటీవల ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్‌ సిడ్నీ విశ్వవిద్యాలయం తరలివచ్చి జేఎన్‌టీయూతో చేసుకున్న అవగాహన ఒప్పందంతో ఇది సాధ్యమైంది. అదే యూనివర్సిటీ ఓయూతోనూ ఎంవోయూ చేసుకుంది.  

విదేశాలకు వెళ్లి పీజీ, పీహెచ్‌డీ చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా అక్కడి వర్సిటీల స్థాయి, బోధనలో నాణ్యత, సీట్ల లభ్యతపై సమాచారం పెద్దగా అందుబాటులో ఉండదు. ఈ విషయంలో వర్సిటీలు చేసుకునే అవగాహన ఒప్పందాలు ఉపయుక్తంగా ఉంటున్నాయి.  ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, తైవాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, రష్యాకు చెందిన విశ్వవిద్యాలయాలు ఇక్కడి వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దీనివల్ల ఇబ్బందులు లేకుండా నేరుగా అక్కడ ఫీజు రాయితీతో పీహెచ్‌డీ, పీజీలు చేసే వీలు లభిస్తోంది. విద్యార్థులకు అదనపు క్రెడిట్లు, బదలాయింపునకు వీలవుతోంది. నారాయణమ్మ, సీబీఐటీ, వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి, బీవీఆర్‌ ఐటీ, మల్లారెడ్డి, అనురాగ్‌ వంటి విద్యాసంస్థలతోనూ విదేశీ వర్సిటీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.  సంబంధిత యూనివర్సిటీని సందర్శించి శిక్షణ కార్యక్రమాలు, సెమినార్లలో పాల్గొనడంతో మెలకువలు తెలుసుకునేందుకు వీలువుతోంది. గత విద్యా సంవత్సరం  ఉస్మానియా విశ్వవిద్యాలయం 11 జాతీయ, 2 అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకుంది. జేఎన్‌టీయూ 5 విదేశీ వర్సిటీలతో అవగాహన  కుదుర్చుకుంది.  

ర్యాంకింగ్‌..:

దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు క్యూఎస్‌, టైమ్స్‌, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకుల్లో సత్తా చాటడం ఎంతో కీలకం. ర్యాంకులకు ఎంవోయూలు ఊతమిస్తున్నాయి. విదేశీ విద్యార్థులను మన వర్సిటీలు ఆకర్షించడం ముఖ్యం.


పరస్పర బదలాయింపు ఉండాలి

విదేశీ వర్సిటీలతో మన విద్యా సంస్థలు ఒప్పందాలు చేసుకునే విషయంలో పరస్పర సహకారం ఉండేలా చూసుకోవాలి. మన విద్యార్థులు, ఆచార్యులు ఆయా దేశాలకు వెళ్లడమే కాకుండా అక్కడి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా నిబంధన పెట్టుకోవాలి. విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తే మన విద్యాసంస్థలకు మంచి పేరు వస్తుంది.  

ప్రొ.పొదిలె అప్పారావు, హెచ్‌సీయూ మాజీ ఉపకులపతి


ఫీజుల్లో రాయితీ ఇస్తున్నాయి

ఒప్పందాలతో మన విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు వీలు కలుగుతోంది. కోర్సులో కొంతభాగం ఇక్కడ చదివాక ఒప్పందం ఉన్న వర్సిటీకి వెళ్లి చదువుకోవచ్చు. విద్యార్థులకు ఫీజుల్లో 25-30 శాతం రాయితీ లభిస్తోంది. ఆచార్యుల ఎక్స్చేంజి ప్రోగ్రామ్‌ కింద శిక్షణ నిర్వహించడం, సంయుక్తంగా ప్రాజెక్టులు, పరిశోధనలు చేసే అవకాశం లభిస్తోంది. 

ప్రొ.డి.రవీందర్‌, ఓయూ ఉపకులపతి

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని