logo

రియల్‌ ఎస్టేట్‌ పేరిట రూ.20 కోట్లకు బురిడీ

రియల్‌ ఎస్టేట్‌ పేరిట పలువురిని మోసం చేసి భారీఎత్తున సొమ్ము చేసుకున్న ఓ వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 26 Jan 2023 04:23 IST

శ్రీనివాస్‌

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: రియల్‌ ఎస్టేట్‌ పేరిట పలువురిని మోసం చేసి భారీఎత్తున సొమ్ము చేసుకున్న ఓ వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్‌ గురువారం ఎస్‌హెచ్‌వో కిషన్‌కుమార్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. హైదర్‌నగర్‌ పీఎన్‌ఆర్‌ హైట్స్‌లో ఉంటున్న కాకర్ల శ్రీనివాస్‌ (44) రియల్‌ ఉస్టేట్‌ వ్యాపారి. 2016లో కేపీహెచ్‌బీ పరిధి సాయినగర్‌, 2018లో హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌ హోటల్‌ ముందు జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (జయ గ్రూప్‌) పేరిట రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయం నడిపాడు. 2020లో కేపీహెచ్‌బీ ఆరోఫేజ్‌కి కార్యాలయాన్ని మార్చాడు. వ్యాపారం తొలినాళ్లలో ఓపెన్‌ ప్లాట్స్‌ తీసుకొని ఇళ్లు కట్టి విక్రయించేవాడు. జేఎన్‌టీయూ మెట్రోస్టేషన్‌కు చెందిన దుకాణాలు అద్దెకు ఇచ్చేందుకు సబ్‌ లీజ్‌కు తీసుకున్నాడు. అక్కడ నష్టం వచ్చింది. ఓపెన్‌ ప్లాట్స్‌, పొలాలు, అపార్ట్‌మెంట్‌లు కావాలని వచ్చిన వారి నుంచి భారీఎత్తున నగదు వసూలు చేసి పలు ప్రాంతాల్లో ఆస్తులు తీసుకునే క్రమంలో వాటికి బయానా ఇచ్చాడు. ఇలా తన వద్దకు వచ్చినవారి నుంచి దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతనిపై ఇప్పటికి కేపీహెచ్‌బీలోనే 8 కేసులు నమోదయ్యాయి. నిందితుడిని కస్టడీకి తీసుకుని ఈ వ్యాపారంలో ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది, బాధితుల వివరాలు, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడో తెలుసుకుంటామని ఏసీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని