logo

అగ్గి రాజేస్తున్నా.. మొద్దు నిద్ర

రాజధాని నగరంలో నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మించిన గోదాముల్లో అగ్నిప్రమాదాల వల్ల ఏటా అనేకమంది బలవుతున్నా సంబంధిత శాఖల అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు.

Published : 03 Feb 2023 01:44 IST

అక్రమ గోదాములపై చర్యల్లో తీవ్ర నిర్లక్ష్యం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

నగరంలో చిన్నా, పెద్దాఅక్రమ గోదాములు: 55 వేలు
పారిశ్రామిక వాడల్లో ఉన్నవి: 25 వేలు

ఆజామాబాద్‌ పారిశ్రామిక వాడలో అక్రమ షెడ్డు

రాజధాని నగరంలో నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మించిన గోదాముల్లో అగ్నిప్రమాదాల వల్ల ఏటా అనేకమంది బలవుతున్నా సంబంధిత శాఖల అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. కాలనీల మధ్యే ఈ గోదాము ఏర్పాటు చేసి ప్రమాదకర రసాయనాలు,  ఇతర వస్తువులను అక్రమంగా నిల్వ చేస్తున్నా చర్యలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. భారీ అగ్నిప్రమాదం జరిగినప్పుడల్లా గోదాములపై చర్యలు తీసుకుంటున్నామని ప్రకటన చేసి వదిలేస్తున్నారేగానీ.. క్షేత్రస్థాయిలో చర్యలు ఉండటం లేదు.  

బిక్కుబిక్కుమంటూ.. గోదాముల చుట్టూ..

గతేడాది మార్చి నెలలో బోయగూడ తుక్కు గోదాములో జరిగిన అగ్నిప్రమాదంలో 12 మంది చనిపోయారు. గత సెప్టెంబర్‌లో సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జికి నిప్పంటుకొని 8 మంది చనిపోయారు. మినిస్టర్‌ రోడ్డులో దక్కన్‌ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఈ మూడుచోట్ల నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.  తాజాగా గురువారం ఆజామాబాద్‌ ఇండ్రస్టియల్‌ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రమాద తీవ్రత తగ్గింది.  

ఆజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంతంలో ఏళ్ల కిందటే 50 కంపెనీలకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ కేవలం 12 పరిశ్రమలు మాత్రమే నడుస్తున్నాయి. మిగిలిన 38 చోట్ల కూడా ఏదో ఒక వ్యాపారం జరుగుతోంది. కొందరు కొన్నింటిలో అక్రమంగా గోదాములు నిర్మించారు. వాటిలో రసాయనాలు కూడా నిల్వ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల తొందరగా మండే వస్తువులతో గోదాములు నిండిపోతున్నాయి. ఈ ప్రాంతం మొత్తం పరిశ్రమల శాఖ ఆధీనంలో ఉంది. సంబంధిత అధికారులు అక్రమగోదాములు, నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.

జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలోని గంపలబస్తీ, సుభాష్‌నగర్‌, వెంకట్రాదినగర్‌, రాంరెడ్డినగర తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో అక్రమ నిల్వ కేంద్రాలున్నాయి. చాలాచోట్ల భూగర్భంలో రసాయనాలను నిల్వ చేస్తున్నారు. వీటిని ప్లాస్టిక్‌ డబ్బాల్లో ప్యాక్‌ చేసే సమయంలో ఒత్తిడికి అవి పేలిపోయి ఏడాదిలో ఇద్దరు చనిపోయారు.  

సికింద్రాబాద్‌ న్యూబోయగూడ తదితర ప్రాంతాల్లో పురాతన గోదాములున్నాయి. వీటిలో కొన్నింటిని కాగితం, ఇతర వస్తువులతో నింపేసి ఉంచారు. ఆయా గోదాముల్లో విద్యుత్తు వ్యవస్థ కూడా సరిగా లేదు. గతేడాది జరిగిన ఘటనలో 12 మంది చనిపోయినపుడు  అక్రమ గోదాములపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. తరువాత  పట్టించుకోవడం మానేశారు. కాటేదాన్‌ పారిశ్రామిక వాడలోనూ అక్రమ గోదాముల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటిపై అటు పరిశ్రమల శాఖ, ఇటు బల్దియా చర్యలు తీసుకోవాల్సి ఉంది.  


ఆజామాబాద్‌ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

మంటలార్పుతున్న సిబ్బంది

న్యూస్‌టుడే, రాంనగర్‌, బాగ్‌లింగంపల్లి: న్యూస్‌టుడే, రాంనగర్‌, బాగ్‌లింగంపల్లి: బాగ్‌లింగంపల్లి ఆజామాబాద్‌ పారిశ్రామికవాడలో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వీఎస్‌టీ కంపెనీ ఎదుట అలంకరణ సామగ్రి ఉంచిన గోదాం(ఎంఎస్‌ డెకరేషన్‌ వర్క్స్‌)లో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ పరికరాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ముషీరాబాద్‌ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దట్టమైన పొగలతో ఎగిసిపడుతున్న మంటలను.. ఐదుగంటల పాటు శ్రమించి అదుపులోకి తెచ్చారు. ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి  ఘటనాస్థలానికి చేరుకొని పర్యవేక్షించారు.  షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. సమీపంలోని మరో మూడు గోదాములు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.  నిబంధనలు పాటించని, ఎన్‌వోసీలు లేని గోదాములపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని స్పష్టం చేశారు. కాగా ఘటనపై విచారణ కొనసాగుతోందని, ఇక్కడి గోదాములకు అనుమతి ఉందా..? ఫైర్‌సేఫ్టీ నిబంధనలను పాటిస్తున్నారా? అనే కోణంలో విచారణ చేస్తున్నామని జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని