logo

అసంక్రమిక వ్యాధులపై అవగాహనే కీలకం

అసంక్రమిక వ్యాధులు (నాన్‌ కమ్యూనికబుల్‌ డీసీజస్‌-ఎన్‌సీడీ)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Published : 03 Feb 2023 01:44 IST

 ఐఏపీఎస్‌ఎం సదస్సులో నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: అసంక్రమిక వ్యాధులు (నాన్‌ కమ్యూనికబుల్‌ డీసీజస్‌-ఎన్‌సీడీ)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 100 ఏళ్ల క్రితం ఇలాంటి వ్యాధులు కన్పించేవి కావని.. ఆహారపుటలవాట్లే కారణమని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అసంక్రమిక వ్యాధులైన అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్లు ఇతర వ్యాధులు పెరుగుతున్నాయని, అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి బాగా ముదిరిన తర్వాత ఆసుపత్రులకు వస్తున్నారన్నారు. మంచి ఆహారపు అలవాట్లుతో అసంక్రమిక వ్యాధులకు కళ్లెం వేయవచ్చునని సూచించారు. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) ఆధ్వర్యంలో ఇండియన్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌(ఐఏపీఎస్‌ఎం) జాతీయ సదస్సులో పాల్గొన్న పలువురితో ‘ఈనాడు’ ప్రత్యేకంగా మాట్లాడింది.


పరిశోధనలకు రూ.5 కోట్లతో యూనిట్‌

ప్రొఫెసర్‌ వికాస్‌ భాటియా, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఎయిమ్స్‌ బీబీనగర్‌

గతంతో పోల్చితే అసంక్రమిక వ్యాధులు పెద్దసంఖ్యలో పెరుగుతున్నాయి. ఆహారపుటలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం  ఇందుకు దోహదం చేస్తున్నాయి. కొందరికి బీపీ, షుగర్‌ అంటే కూడా తెలియడం లేదు. దీంతో చికిత్సలకు దూరంగా ఉంటున్నారు. అవి ముదిరిపోయి ఇతర అవయవాలను దెబ్బ తీస్తున్నాయి. ఎన్‌సీడీలతోపాటు ఇతర వ్యాధులపై పరిశోధనల కోసం ఎయిమ్స్‌లో రూ.5 కోట్లతో ప్రత్యేక యూనిట్‌ సిద్ధం చేస్తున్నాం.


సాంస్కృతిక వారసత్వం కొనసాగించాలి

డాక్టర్‌ హేమలత, డైరెక్టర్‌,  జాతీయ పోషకాహార సంస్థ

మనది గొప్ప సాంస్కృతిక వారసత్వం. సహజ వనరులైన నీరు, నేల, ప్రకృతిని కాపాడుతూ అదే వారసత్వం కొనసాగించడం వల్ల పర్యావరణ ఆరోగ్యమే కాదు.. మానవ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సహజ వనరులు ధ్వంసం పర్యావరణానికి నష్టమే కాకుండా  ఇంకా వైరస్‌లు ప్రబలే అవకాశం ఉంది.  మన ఆరోగ్యమే కాదు చుట్టూ చెట్టు చేమ, జంతువులు, పక్షుల ఆరోగ్యం కీలకమే.  


సంప్రదాయ ఆహార అలవాట్లు మేలు

డాక్టర్‌ గోవిందరావు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌,  బీబీనగర్‌ ఎయిమ్స్‌

మన సంప్రదాయ ఆహారపు అలవాట్లతో ఎన్నోరకాల అసంక్రమిక వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. తృణ ధాన్యాల్లో అన్నిరకాల పోషకాలు ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి కాపాడటంలో ఇవి కీలకం. అధిక బరువు, రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉంచడానికి  దోహదం చేస్తాయి. పిల్లలు,  యువత ఆరోగ్యంపై నివేదిక రూపొందిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని