logo

ఒక్క ఛాన్స్‌ ఇప్పిస్తామంటూ రొంపిలోకి

వెండితెరపై ‘ఒక్క ఛాన్స్‌’ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోడళ్లు, యువతులకు అవకాశాల ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించుతున్న ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కారు.

Updated : 05 Feb 2023 04:56 IST

ఇద్దరు నిందితుల అరెస్టు

సురేశ్‌, అఖిల్‌

ఈనాడు - హైదరాబాద్‌: వెండితెరపై ‘ఒక్క ఛాన్స్‌’ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోడళ్లు, యువతులకు అవకాశాల ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించుతున్న ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కారు. అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసులో సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా విభాగం అధికారులు తాజాగా ఈ ఇద్దర్నీ అరెస్టు చేశారు. నిందితులిద్దరూ హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తలు, సంపన్నుల కోసం ముంబయికి చెందిన మోడళ్లు, నటులను దిల్లీ, కోల్‌కత్తా నగరాలకు చెందిన యువతుల్ని సరఫరా చేస్తున్నారు. వీరిద్దరూ సినిమా పరిశ్రమకు చెందినవారు. ఇందులో ఒకరు ప్రముఖ తెలుగు దర్శకుడి వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. వీరి నుంచి 5 చరవాణులు, పాస్‌పోర్టు, ఆధార్‌, పాన్‌కార్డులు, 10 డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, మానవ అక్రమ రవాణా విభాగం డీసీపీ కవిత ధార ఈ వివరాలు మీడియాకు తెలిపారు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అలియాస్‌ నిర్వాహకుడు

నెల్లూరు జిల్లా కావలికి చెందిన బోయిన సురేశ్‌(32) అలియాస్‌ కుమార్‌శెట్టి అలియాస్‌ కరణ్‌ అలియాస్‌ సురేశ్‌ సిద్ధార్థ్‌కు 2017లో నందు పరిచయమయ్యాడు. వ్యభిచారం నిర్వహణలో తేలిగ్గా డబ్బు సంపాదించొచ్చని నందు ద్వారా తెలుసుకున్న సురేశ్‌.. ఇల్లు అద్దెకు తీసుకొని వ్యాపారం ప్రారంభించాడు. మోడళ్లు, విటుల మధ్య అనుసంధానం కోసం బంజారాహిల్స్‌లో కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశాడు. 500 మందిని ఈ కూపంలోకి దింపాడు. గోవాలోనూ వ్యాపారం ప్రారంభించాడు.  

ఖర్చుల కోసం చీకటి వ్యాపారం

ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మేకల అఖిల్‌కుమార్‌(37) అలియాస్‌ జేమ్స్‌ అలియాస్‌ క్రాంతి అలియాస్‌ అఖిల్‌రెడ్డి అలియాస్‌ అశ్విన్‌ ఉప్పల్‌ చిలుకానగర్‌లో ఉంటున్నాడు. 2019లో గచ్చిబౌలిలో పబ్‌లో రోమీ అలియాస్‌ దీపక్‌రాయ్‌ని కలిశాడు. మాదాపూర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార నిర్వహణ ప్రారంభించాడు. 500 మంది యువతుల్ని రొంపిలోకి దింపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని