logo

Hyderabad Metro Rail: చివరి ట్రిప్పులు..జనం తిప్పలు

మెట్రోరైలులో రాత్రి చివరి ట్రిప్పుల్లో తిరిగే ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. పలు స్టేషన్లలో ప్రవేశ మార్గాలను రాత్రిపూట ముందుగానే మూసేయడమే ఇందుకు కారణం. స్టేషన్‌కు ఇరువైపులా లిఫ్టులు, మెట్ల దారులున్నా ఒకవైపు మూసేస్తున్నారు.

Updated : 27 Feb 2023 07:39 IST

మెట్రో స్టేషన్లలో రాత్రి 11కే ప్రవేశ మార్గాలు బంద్‌
‘ఈనాడు’ పరిశీలనలో తేటతెల్లం

యూసుఫ్‌గూడలో శనివారం రాత్రి ముందే మూసేసిన మార్గం

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలులో రాత్రి చివరి ట్రిప్పుల్లో తిరిగే ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. పలు స్టేషన్లలో ప్రవేశ మార్గాలను రాత్రిపూట ముందుగానే మూసేయడమే ఇందుకు కారణం. స్టేషన్‌కు ఇరువైపులా లిఫ్టులు, మెట్ల దారులున్నా ఒకవైపు మూసేస్తున్నారు. దీంతో తరచూ సిబ్బందికి, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. నిత్యం ఉదయం 6 నుంచి మొదలై టర్మినల్‌ స్టేషన్లు అయిన ఎల్బీనగర్‌, మియాపూర్‌, నాగోల్‌, రాయదుర్గం, జేబీఎస్‌ స్టేషన్లకు ఆఖరి మెట్రో 12 గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. అప్పటివరకు స్టేషన్ల అన్ని ద్వారాలు తెరిచే ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

దిగేటప్పుడు ఇబ్బందులే.. నాలుగువైపుల ప్రయాణికులు వెళ్లేలా ఎంట్రీ, ఎగ్జిట్‌పాయింట్లు కొన్ని స్టేషన్లలో మినహా అన్నిస్టేషన్లలో ఉన్నాయి. రాత్రిపూట వెళితే అక్కడ ద్వారం మూసి ఉంటుంది. కనీసం ప్రయాణికులను చూసి స్టేషన్‌ సిబ్బంది తెరిచే ప్రయత్నం చేయడం లేదు. దీంతో గొడవలు జరుగుతున్నాయి. యువతకు పర్లేదు. వృద్ధులు, పిల్లలతో వచ్చే కుటుంబ సభ్యులు, సామాన్లతో వచ్చేవారి పరిస్థితి వర్ణనాతీతం. ఏమైనా అభ్యంతరాలుంటే కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు తప్ప ద్వారాలు తెరవడం లేదని వాపోయారు. శనివారం యూసుఫ్‌గూడ స్టేషన్‌లో రాత్రి 10.45 గంటలకే ప్రవేశ మార్గం మూసేశారు.

సైబర్‌టవర్స్‌ మెట్రో స్టేషన్‌ది మరో విడ్డూరం..

సైబర్‌టవర్స్‌.. అదే హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్‌కు ఆనుకుని ఈ-గలేరియా మాల్‌ ఉంది. ఇందులో వాహనదారుల పార్కింగ్‌కు సౌకర్యం ఉంది. ఇందులో వాహనాలను నిలిపి మెట్రోలో ప్రయాణిస్తారు. మెట్రో మాల్‌ నుంచే మెట్రోస్టేషన్‌కు నేరుగా దారి ఉంటుంది. ఇది రాత్రి 10 గంటల తర్వాత బంద్‌ అయిపోతుంది. అప్పుడు మెట్రోస్టేషన్లో కిందకు దిగి, రోడ్డు దాటి మాల్‌లోని సెల్లారుకు నడుచుకుంటూ వెళ్లి వాహనాలను తీసుకెళ్లాల్సి వస్తోంది.

రాయదుర్గంలో భారీ వరుసలు

కారిడార్‌-3లోని చివరి స్టేషన్‌ రాయదుర్గంలో ప్రయాణికుల కష్టాలు మరోలా ఉన్నాయి. ఇక్కడ కార్యాలయాలు వదిలిన వేళ ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా పెద్దఎత్తున వస్తున్నారు. ఇక్కడ ఒకవైపు నుంచే మెట్రోస్టేషన్‌లోకి వెళ్లే మార్గం ఉంది. దీంతో స్టేషన్‌ బయటివరకు ప్రయాణికులు బారులు తీరుతున్నారు. లోపలికి వెళ్లేందుకు, టికెట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఇక్కడ లెమన్‌ట్రీ వైపు రెండో ప్రవేశమార్గం సిద్ధం అవుతోంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఇబ్బందులు తప్పుతాయని మెట్రో వర్గాలు అంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని