logo

కమిటీలు.. కాగితపు పులులు

పరిశ్రమల స్థాపనకు అనుమతులు, వాటి పనితీరు పరిశీలించేందుకు కాలుష్య నియంత్రణ మండలిలో ఏర్పాటు చేసిన కన్‌సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌, కన్‌సెంట్‌ ఫర్‌ ఆపరేషన్స్‌ కమిటీల పనితీరు ‘నామ్‌ కే వాస్తే’గా తయారైంది.

Published : 01 Apr 2023 03:01 IST

నామ్‌కే వాస్తేగా కాలుష్య నియంత్రణ
ఈనాడు, హైదరాబాద్‌

పరిశ్రమల స్థాపనకు అనుమతులు, వాటి పనితీరు పరిశీలించేందుకు కాలుష్య నియంత్రణ మండలిలో ఏర్పాటు చేసిన కన్‌సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌, కన్‌సెంట్‌ ఫర్‌ ఆపరేషన్స్‌ కమిటీల పనితీరు ‘నామ్‌ కే వాస్తే’గా తయారైంది. ప్రశ్నించేవారు లేక పరిశ్రమలు కాలుష్య ఉద్గారాలను యథేచ్చగా కాలువల్లోకి వదిలేస్తున్నాయి. కమిటీల పనితీరు బాగుందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పారిశ్రామికవాడల నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణకు కామన్‌ ఎఫ్లూయెంట్స్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలనే నిబంధన ఉంది. దీనికి రూ.లక్షల్లో ఖర్చవుతుండడంతో కొందరు నిర్వాహకులు మాఫియాతో చేతులు కలిపి తక్కువ ఖర్చుతో వ్యర్థాలను జలవనరుల్లో డంప్‌ చేయిస్తున్నారు.

ఇవీ ఉదంతాలు..

* శంషాబాద్‌ నుంచి పరిగి వెళ్లే మార్గంలో ఓ పరిశ్రమ నిర్వాహకులు స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమ నెలకొల్పారు. ఒక్కొక్కటిగా నాలుగు యూనిట్లు ఏర్పాటు చేశారు. వ్యర్థాలు చెరువుల్లోకి వదలడంతో అవి కలుషితమయ్యాయి. ఆ నీటిని తాగిన పశువులు మృత్యవాత పడ్డాయి. తాజాగా మరో యూనిట్‌ను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కొందరు కోర్టును ఆశ్రయించారు.
* మేడ్చల్‌ పారిశ్రామికవాడలో కాలుష్య వ్యర్థాలు చెరువులోకి వెళ్లడంతో ఆ నీటిని తాగిన ఓ గేదె మరణించింది.

పరిశీలన ఎక్కడ...?

ఆరు నెలలకోసారి  కమిటీలు వాటిని పరిశీలించాలి. ఐఐసీటీ, ఉస్మానియా యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థల నుంచి ఆచార్యులు, నిపుణులు, సాంకేతికత నిపుణులను ఇందులో భాగస్వాముల్ని చేయాలి. ఇవేమీ జరగడం లేదు. నగరంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌, వైట్‌  శ్రేణుల్లో 5,300 పరిశ్రమలుండగా కాలుష్య తీవ్రత అధికంగా ఉండే రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరీల్లో 1,750 పరిశ్రమలున్నాయి. బల్క్‌డ్రగ్‌, ఫార్మా సంస్థల నుంచి వెలువడే వ్యర్థాలు మూసీలో కలుస్తున్నాయి.

పోలీసుల జోక్యం

కాలుష్య పరిశ్రమలపై స్థానికుల నుంచి ఆందోళనలు వ్యక్తమైనప్పుడు కమిటీలు  నేరుగా మాట్లాడి ఫిర్యాదులు తీసుకొని, చర్యలు చేపట్టాలి. వాటితో ఇబ్బంది ఉండని పరిస్థితుల్లో వారికి స్థానిక భాషల్లో కరపత్రాలు ముద్రించి పంచిపెట్టాలని నిపుణులు చెబుతున్నారు. కానీ ఉద్రిక్తతలు జరిగితే కొన్నిచోట్ల పోలీసులు జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని