logo

విప్రహిత ప్రారంభం.. వరాల ప్రసంగం

గోపన్‌పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవానికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Updated : 01 Jun 2023 03:53 IST

విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌, చిత్రంలో స్వరూపానందేంద్ర స్వామి, మేయర్‌ విజయలక్ష్మి, సీఎస్‌ శాంతికుమారి, ఎంపీ రంజిత్‌రెడ్డి

రాయదుర్గం, న్యూస్‌టుడే: గోపన్‌పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవానికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

* ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 11.29 గంటలకు వేదికపైకి చేరుకున్నారు. పండితులు ఆయనకు వేదమంత్రాలతో ఘనస్వాగతం పలికారు. వేదికపై ఆసీనులైన పీఠాధిపతులను సీఎం ఘనంగా సత్కరించారు.

* సీఎం వరాల జల్లు కురిపించినప్పుడు కేరింతలతో చప్పట్లు కొట్టారు.

* చండీయాగం నిర్వహించగా.. యాగశాలను సీఎం సందర్శించారు. పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఛైర్మన్‌ కేవీ రమణాచారి ఉన్నారు.

* సదనంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు విష్ణు సహస్ర నామ పారాయణం చేశారు.

* విప్రో కూడలి నుంచి సదనం వరకు రోడ్డుకు ఇరువైపులా ముఖ్యమంత్రిని స్వాగతం పలికే కటౌట్లు, ఫ్లెక్సీలను భారాస నేతలు ఏర్పాటు చేశారు.

* ప్రారంభోత్సవం సందర్భంగా సదనం ప్రాంతం కోలాహలంగా కనిపించింది. నగరంతోపాటు వివిధ జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు.

సీఎం ఆకస్మిక రాకతో ఆనందం

సీఎం కేసీఆర్‌తో అర్చక బృందం

చందానగర్‌: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బుధవారం చందానగర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆకస్మాత్తుగా రావడంతో స్థానికులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం 3.40 ని.లకు వచ్చిన ఆయన గంటసేపు ఆలయంలో గడిపారు. ఆ సమయంలో ఆలయ రహదారి మంజీరా రోడ్డు పూర్తిగా మూసివేయడంతో సీఎం వచ్చారన్న వార్త స్థానికులకు తెలిసింది. ఆయన్ను చూడ్డానికి తరలివచ్చారు. ఉదయం గోపన్నపల్లిలో విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కలుసుకున్నారు. మళ్లీ మధ్యాహ్నమే ఇక్కడ వీరి భేటీ జరగడంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. స్వరూపానందేంద్ర సరస్వతి గోపన్నపల్లి కార్యక్రమం ముగించుకొని చందానగర్‌ వేంకటేశ్వర దేవాలయానికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం చేసి 2.45 గంటలకు విశాఖకు బయలుదేరాల్సి ఉంది. ఇంతలో సీఎం కేసీఆర్‌ నుంచి స్వరూపానందేంద్రకు ఫోన్‌ వచ్చింది. ‘మీరు చందానగర్‌లోనే ఉండండి.. నేను వచ్చి కలుస్తాను’ అని చెప్పినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని