logo

కరెంటు బిల్లు ఎక్కువ వస్తోందా? ఇలా చేయండి మరి!

ఇంట్లో పెద్దగా గృహోపకరణాలు కూడా లేవు. అయినా కరెంట్‌ వినియోగం మాత్రం అధికంగా ఉంటోంది. 200 యూనిట్లకు అటు ఇటుగా ఉండాల్సిన వినియోగం కాస్త 350 యూనిట్లుగా చూపుతోంది.

Published : 13 Jun 2023 02:01 IST

లైసెన్స్డ్‌ ఎలక్ట్రీషియన్‌తో తనిఖీ చేయించుకోవాలని సూచిస్తున్న విద్యుత్తు అధికారులు
ఈనాడు, హైదరాబాద్‌  

ఇంట్లో పెద్దగా గృహోపకరణాలు కూడా లేవు. అయినా కరెంట్‌ వినియోగం మాత్రం అధికంగా ఉంటోంది. 200 యూనిట్లకు అటు ఇటుగా ఉండాల్సిన వినియోగం కాస్త 350 యూనిట్లుగా చూపుతోంది. ఎండాకాలంలోనే కాదు చలికాలంలోనూ ఇదే తీరు. ఇలాంటి పరిస్థితుల్లో మొదటగా ఎవరికైనా మీటర్‌ మీదనే సందేహం వస్తుంది.  విద్యుత్తు సంస్థకు నిర్ణీత రుసుం చెల్లించి మీటర్‌ను తనిఖీ చేయిస్తే లోపాలుంటే పాత మీటర్‌ స్థానంలో కొత్తవి బిగిస్తారు. మరి మీటర్‌ బాగానే ఉందని టెస్టింగ్‌లో తేలితే?  మీటర్లలో లోపాలే కాదు.. ఇంట్లో వాడే గృహోపకరణాలు ఎప్పటివి? ఎర్తింగ్‌, కరెంట్‌ సరఫరా వ్యవస్థలోని లోపాలు కూడా కారణం అవుతుంటాయని ఇంజినీర్లు చెబుతున్నారు. వైరింగ్‌లో లోపాలు ఉన్నప్పుడు అసలు వినియోగించకుండా కరెంట్‌ వృథాగా పోయే అవకాశం ఉందని బిల్లు పెరగడానికి అది ఓ కారణంగా చెబుతున్నారు.

పాత వాటితోనే మోత..

ప్రతి నెలా ఎక్కువ యూనిట్లు కాలుస్తున్నట్లు బిల్లులో చూస్తే వాస్తవంగా అంత వినియోగిస్తున్నామా? లేదా బేరీజు వేసుకోవాలి. బిల్లులో రికార్డెడ్‌ మాగ్జిమమ్‌ డిమాండ్‌ (ఆర్‌ఎండీ)ను పరిశీలిస్తే ఎంత వాడుతున్నారో తెలుస్తుంది.

ఇంట్లో ఉన్న ఉపకరణాలు, వాటికి వినియోగానికి అయ్యే కరెంట్‌ ఎంత? అనేది అవగాహన ఉంటే బిల్లు చూడగానే ఎక్కువ వచ్చిందా? తక్కువ వచ్చిందా అనేది తెలిసిపోతుంది.

ఉపకరణాలు తక్కువగా ఉన్నా ఎక్కువ బిల్లు వస్తుందంటే.. గృహోపకరణాలను ఎంతకాలం నుంచి వాడుతున్నారనేది పరిశీలించాలి. రిఫ్రిజిరేటర్లు పాతవి కావడంతో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. నెలంతా 50 యూనిట్లతో పనిచేయాల్సిన రిఫ్రిజిరేటర్లు 150దాకా కాలుస్తుంటాయి. వీటి స్థానంలో  కొత్తవి కొనడం మేలు. విద్యుత్తు ఆదా చేసే స్టార్‌ రేటింగ్‌వి తీసుకోవాలి.

సరైన నాణ్యతా ప్రమాణాలు లేని ఫ్యాన్లు, గీజర్లు, ఇతర గృహోపకరణాల వాడకంతోనూ మీటర్‌ గిరాగిరా తిరుగుతుంది. వీటి స్థానంలో నాణ్యమైనవి ఏర్పాటు చేసుకోవాలి.


లీకేజీలు అరికడితే..

ఇంట్లో అన్ని ఉపకరణాలు కొత్తవే. పైగా నాణ్యత ప్రమాణాలు కలిగినవే.. అయినా ఎక్కువ కరెంట్‌ ఎందుకు కాలుతుందో అర్థం కావడం లేదంటారా? ఇంట్లో కరెంట్‌ లీకేజీ కారణంగా కూడా వినియోగం పెరుగుతుందని.. ఇవన్నీ మీటర్‌లో రికార్డు అవుతుంటాయని విద్యుత్తు ఇంజినీర్లు చెబుతున్నారు.

మొదట ఇంట్లోకి కరెంట్‌ సరఫరా అయ్యే మెయిన్‌బ్రేకర్‌ ఆపేయాలి. దీంతో మీటర్‌ ఆగిపోతుంది. అప్పటికీ మీటర్‌ తిరుగుతుందంటే లీకేజీ ఉన్నట్లు. ఎలక్ట్రీషియన్‌ను సంప్రదిస్తే లీకేజీ కరెంట్‌ క్లాంప్‌ మీటర్‌తో లోపాన్ని గుర్తిస్తాడు. దాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది. ్య మీటర్‌ దగ్గర్నుంచి ఎర్త్‌ పాయింట్‌ వరకు.. స్విచ్‌బోర్డులు, సాకెట్ల దాకా లైసెన్స్డ్‌  ఎలక్ట్రీషియన్‌తో తనిఖీ చేయించాలి. ప్రతి పాయింట్‌ పరిశీలిస్తే ఎక్కడ నుంచి కరెంట్‌ లీక్‌ అవుతుందో తెలుస్తుంది.

ఇళ్లలో తప్పుడు వైరింగ్‌ కారణంగానే బిల్లులు మారిపోతుంటాయి. ఒక ఫ్లాట్‌ తీగను మరో ఫ్లాట్‌ మీటర్‌లో కలపడం, కామన్‌ మోటారును ఎవరో ఒక పోర్షన్‌లో ఉండే వారికి కలపడం వంటివి చేస్తుంటారు.  ఇలాంటివి సరి చేసుకుంటే    వాస్తవిక బిల్లునే చేతికొస్తుంది.


లైసెన్స్డ్‌ ఎలక్ట్రీషియన్‌ అంటే..

చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ (సీఈఐజీ), ఎలక్ట్రికల్‌ లైసెన్సింగ్‌ బోర్డు ద్వారా వైర్‌మెన్‌ పర్మిట్‌ గానీ సూపర్‌వైజర్‌ పర్మిట్‌గానీ ఉన్నవారు. ఇలాంటి వారు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని