logo

New Year Celebrations: 31 రాత్రి తాగి నడిపితే ఊచలే.. డ్రైవర్లు రైడ్‌ నిరాకరిస్తే జరిమానా

నయాసాల్‌ వేడుకల్లో అతిగా మద్యం తాగి నడిపే వాహనదారులతోపాటు అందుకు కారణమైన పబ్బులు, బార్లు, క్లబ్బుల నిర్వాహకులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరించారు.

Updated : 28 Dec 2023 11:49 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: నయాసాల్‌ వేడుకల్లో (Year Ender 2023) అతిగా మద్యం తాగి నడిపే వాహనదారులతోపాటు అందుకు కారణమైన పబ్బులు, బార్లు, క్లబ్బుల నిర్వాహకులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ పోలీసులు హెచ్చరించారు. యాజమాన్యాలు తమ ప్రాంగణంలో మద్యం తాగేందుకు ప్రోత్సహించినందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అతివేగం, రాంగ్‌ రూట్‌, సిగ్నల్‌ అతిక్రమణ, నిర్లక్ష్య డ్రైవింగ్‌, శిరస్త్రాణం ధరించకపోతే గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఉల్లంఘనలు గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ డీవీవీ శ్రీనివాస్‌ బుధవారం ప్రత్యేక మార్గదర్శకాలు, సూచనలు జారీ చేశారు.

డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు

  • అన్ని రహదారుల్లో రాత్రి 8 గంటల నుంచి డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తారు. పట్టుబడితే మొదటిసారికి రూ.10 వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుంది. ఎక్కువసార్లు దొరికితే రూ.15 వేలు లేదా రెండేళ్ల జైలు శిక్ష. డ్రైవింగ్‌ లైసెన్సు సస్పెన్షన్‌కు సిఫారసు చేస్తారు.
  • ధ్రువపత్రాల్లేకుంటే వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోయినా, బాలలు వాహనాలు నడిపి పట్టుబడితే యజమాని సహా ఇద్దరిపైనా చర్యలుంటాయి.
  • అధిక శబ్దాలతో పాటలున్నా.. నంబరు ప్లేట్‌ లేకున్నా సీజ్‌ చేస్తారు.
  • కార్లల్లో కిక్కిరిసి, పైభాగంలో కూర్చుని ప్రయాణించకూడదు.
  • ఔటర్‌రింగ్‌రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయానికి వెళ్లేవి మినహా ఇతర వాహనాలకు అనుమతి లేదు.  
  • రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు శిల్పాలేవుట్‌, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షేక్‌పేట, మైండ్‌ స్పేస్‌, రోడ్‌ నం.45, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్జి, సైబర్‌ టవర్స్‌, ఫోరం మాల్‌, జేఎన్‌టీయూ, ఖైత్లాపూర్‌, బాలానగర్‌ బాబుజగ్జీవన్‌రామ్‌పైవంతెనలు మూసేస్తారు.

డ్రైవర్లు రైడ్‌ నిరాకరిస్తే జరిమానా

  • ట్యాక్సీ, క్యాబ్‌, ఆటో డ్రైవర్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ అనుచితంగా ప్రవర్తించకూడదు.
  • క్యాబ్‌ డ్రైవరు ఎట్టి పరిస్థితుల్లో రైడ్‌ నిరాకరించొద్దు. దీన్ని మోటారు వాహనాల చట్టం ఉల్లంఘన కింద రూ.500 జరిమానా విధిస్తాం.
  • రైడ్‌ రద్దు చేసినట్లు గుర్తిస్తే వాహనం నంబరు, సమయం, ప్రదేశం తదితర వివరాలతో 94906 17346కు ఫిర్యాదు చేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని