logo

Hyderabad: నగరంలో భూముల లెక్కలు.. ఇక పక్కా

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని భూముల లెక్కను మరింత పకడ్బందీగా చేయనున్నారు.

Updated : 05 Mar 2024 06:56 IST

ఏడు జిల్లాల్లో 10 వేల ఎకరాలకుపైగా గుర్తింపు
జియోట్యాగ్‌, జీపీఎస్‌ మ్యాపింగ్‌తో రక్షణకు చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని భూముల లెక్కను మరింత పకడ్బందీగా చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎస్టేట్‌ విభాగం అధికారులు ఏడు జిల్లాల పరిధిలోని ల్యాండ్‌ పార్శిళ్లపై ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు 10 వేల ఎకరాలపైనే హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ బ్యాంకులో ఉన్నట్లు తేలింది. ఇందులో 2031 ఎకరాల్లో కోర్టు కేసులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. హెచ్‌ఎండీఏ తరపున ఈ వివరాలను కోర్టుకు సమర్పించి... త్వరగా కేసులు తేలేలా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌, సంగారెడ్డి, భువనగిరి, సిద్ధిపేట జిల్లాల్లో హెచ్‌ఎండీఏకు రూ.కోట్ల విలువైన భూములు ఉన్నాయి. సరైన రక్షణ లేక ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రస్తుతం కోర్టు కేసులు నడుస్తున్నవాటిలో చాలా వరకు ఆక్రమణలకు సంబంధించినవే. ఇటీవలి శంషాబాద్‌లో ఓ వ్యక్తి 50 ఎకరాలను తప్పుడు పత్రాలతో సొంతం చేసుకున్నాడు. హైకోర్టు వరకు వ్యవహారం వెళ్లడం.. చివరికి కోర్టు జోక్యంతో తిరిగి హెచ్‌ఎండీఏ ఈ విలువైన భూములను దక్కించుకుంది. ఆక్రమణలను ముందే అడ్డుకుంటే పరిస్థితి అంతదాకా వచ్చేది కాదనేది బహిరంగ రహస్యం. జవహర్‌నగర్‌లో హెచ్‌ఎండీఏకు రెండువేల ఎకరాలకు పైనే భూములుండగా.. ఇందులో వెయ్యికి పైగా ఎకరాల్లో కోర్టు కేసులు నడుస్తున్నాయి. స్థానిక అధికార యంత్రాంగం అండదండలతోనే ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇకపై ఈ భూముల లెక్క తేల్చడంతో పాటు సాంకేతిక సహకారంతో ఆక్రమణలకు అడ్డుకట్ట వేయనున్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షణ

హెచ్‌ఎండీఏ పరిధిలోని భూముల రక్షణకు చర్యలు తీసుకునేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది. జీపీఎస్‌ మ్యాపింగ్‌ చేయడం, జియోట్యాగ్‌ లాంటి సాంకేతిక విధానంలో ప్రతి ఖాళీ స్థలంపై నిఘా ఉంచనున్నారు. కొన్నేళ్లుగా భూముల ధరలకు రెక్కలు రావడంతో చిన్న స్థలం కనిపించినా.. ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసి కూల్చేలోపు కోర్టునుంచి స్టేలు తీసుకొచ్చి నడిపిస్తున్నారు. జీపీఎస్‌, జియోట్యాగ్‌తో ఎప్పటికప్పుడు ఆయా భూముల్లో జరుగుతున్న ఆక్రమణలు ప్రధాన కార్యాలయం నుంచే ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉంది.    గత ప్రభుత్వ హయాంలో కొన్ని విలువైన భూములను ఆన్‌లైన్‌లో వేలం వేసి విక్రయించిన సంగతి తెలిసిందే. కోకాపేట, బుద్వేల్‌ లాంటి ప్రాంతాల్లో వందల కోట్లు ధరలు పలికాయి. విలువైన భూముల రక్షణతో ప్రభుత్వ అవసరాలు, పరిశ్రమలు, వివిధ సంస్థల స్థాపనకు ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో   ఆక్రమణలకు గురికాకుండా పకడ్బందీ కార్యచరణకు అధికారులు రూపకల్పన చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని