logo

Hyderabad: ఆ వ్యథ.. మనకొద్దు

బెంగళూరులో తీవ్ర నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 60శాతం మంది ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నీటిని వృథా చేస్తే రూ.5000 జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలోనూ 2019లో అదే పరిస్థితి.

Updated : 10 Mar 2024 14:49 IST

భాగ్యనగరంలో భారీగా నీటి వృథా
మేల్కొనకపోతే బెంగళూరు పరిస్థితి తప్పదు
ఈనాడు, హైదరాబాద్‌

బెంగళూరులో తీవ్ర నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 60శాతం మంది ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. నీటిని వృథా చేస్తే రూ.5000 జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలోనూ 2019లో అదే పరిస్థితి. చివరికి రైల్వే వ్యాగన్ల ద్వారా తాగునీటిని తరలించారు. ఈ మహానగరాలతో పోల్చితే హైదరాబాద్‌ శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటికే జనాభా కోటి దాటింది. 2050 నాటికి 2 కోట్లు దాటనుంది. అప్పటి అవసరాలకు తగ్గట్టు తాగునీటి సరఫరా పెను సవాలే. ఇప్పటినుంచే ప్రణాళికలతోపాటు నీటి వినియోగంలో వృథా తగ్గించి పొదుపు పాటించడం అవసరమని.. రీసైక్లింగ్‌ విధానంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. సరఫరా చేస్తున్న నీటిలో 20శాతం వరకు లీకేజీలు.. వాడకంలో వృథా అవుతోందని జలమండలి గతంలో లెక్క వేసింది. 1985లో తీవ్ర వర్షాభావం వల్ల తాగునీటికి నగరంలో కటకట ఏర్పడింది. విజయవాడ నుంచి 15 వ్యాగన్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. దీంతో పాలకులు తర్వాత కాలంలో సింగూరు రెండు, మూడు దశలు చేపట్టి అదనపు జలాలు తరలించారు. అనంతరం కృష్ణా నాలుగు దశలు, గోదావరి నుంచి నీటిని తరలిస్తున్నారు.

వృథా ఇలా..: నాగార్జునసాగర్‌, ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా దాదాపు 160-180 కిలోమీటర్ల నుంచి నగరానికి నీటిని తీసుకొస్తున్నారు. ఇందుకోసం విద్యుత్తు ఛార్జీలకే నెలకు రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. ఇంత విలువైన నీటిలో చాలా వరకు వృథాగా పోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

గ్రేటర్‌ వ్యాప్తంగా రోజు విడిచి రోజు 2,547 మిలియన్‌ లీటర్ల నీటిని అందిస్తున్నారు. ఇందులో 20శాతం అంటే 509 మిలియన్‌ లీటర్ల వరకు వృథా అవుతున్నట్లు అంచనా.

పాత పైపులైన్ల వ్యవస్థ, లీకేజీలు, సర్వీసు రిజర్వాయర్ల ఓవర్‌ ఫ్లో, ఇంటి ముందు రహదారులు పైపులు పెట్టి కడగటం, పబ్లిక్‌ నల్లాలకు ట్యాప్‌లు లేకపోవడం తదితర కారణాలతో ఎక్కువ వృథాగా పోతోంది.

మహానగరంలో నీటి సరఫరా ఇలా..

సర్వీసు ఏరియా 1451.91 చదరపు కిలోమీటర్లు (ఓఆర్‌ఆర్‌ వరకు)
మొత్తం పైపులైన్ల వ్యవస్థ 10 వేల కిలోమీటర్లు
శుద్ధి చేసిన నీటిని తరలించే పైపులు 1300 కిలోమీటర్లు
మొత్తం నల్లాలు 13 లక్షలు
రోజు విడిచి రోజు వ్యక్తికి ఇచ్చే నీళ్లు 150 లీటర్లు


రీసైక్లింగ్‌ ఎక్కువ చేయాలి

ప్రతి అవసరానికి తాగునీటినే వాడేస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇతర అవసరాలకు రీసైక్లింగ్‌ వాటర్‌ వినియోగించాలి. మినీ ఎస్టీపీలు నిర్మించు కోవాలి.  ప్రతిఇంట్లో వర్షపు నీరు  ఇంకేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. చెరువుల కబ్జాతో వరద నీరు నిల్వ ఉండటం లేదు. పిల్లల్లో అవగాహన కల్పించాలి. ప్రభుత్వం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి.

పద్మనాభరెడ్డి, ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని