logo

అచ్చొచ్చిన చోటే ఆరంభం

గత ఎన్నికల్లో అచ్చొచ్చిన ప్రాంతం నుంచే భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.

Published : 27 Mar 2024 02:04 IST

తుక్కుగూడలో వచ్చే నెల 6 లేదా 7న కాంగ్రెస్‌ భారీ సభ
మేనిఫెస్టో విడుదల చేయనున్న అగ్రనేతలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

త ఎన్నికల్లో అచ్చొచ్చిన ప్రాంతం నుంచే భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు భారీ బహిరంగ సభను నిర్వహించి ఇక్కడే పార్టీ అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఈసారి కూడా ఇక్కడే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని పార్టీ అగ్రనేతలు యోచిస్తున్నారు. దీనికి అనుగుణంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలప్పుడు అక్కడి నుంచే..

మే నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మెజారీటీ స్థానాలు గెలుస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల  ప్రకటించారు. దీనికి అనుగుణంగా అభ్యర్థుల విజయం కోసం కార్యాచరణను పార్టీ రూపొందించింది. వచ్చే వారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని అగ్రనేతల చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించింది. నగరంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో సభ నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా కాంగ్రెస్‌ నేతలు ఆలోచన చేశారు. అయితే అచ్చొచ్చిన తుక్కుగూడలోనే సభ నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిందే తడువుగా ఏర్పాట్లు మొదలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చిన విధంగానే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే కొన్ని హామీలతో మేనిఫెస్టో రూపొందించారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు. ఈ సభకు దాదాపు రెండు లక్షలమందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 6 లేదా 7వ తేదీన సభను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బుధవారంలోగా పూర్తవుతుందని చెబుతున్నారు. దీని తరువాత ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో మొదలుపెడతామని నేతలు అంటున్నారు.


మహిళా ఓట్లపై దృష్టి..

తుక్కుగూడ సభకు  మహిళలను అధికంగా తరలించనున్నారు. ఎన్నికలకు ముందు మహిళా సభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ పది లక్షలమంది మహిళలతో సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో అది కుదరలేదు. తుక్కుగూడ సభకు లక్షలమంది డ్వాక్రా సంఘ సభ్యులను తరలించాలని యోచిస్తున్నారు. మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించి వారి ఓట్లను ఆకర్షించాలని పార్టీ నిర్ణయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని