logo

కలెక్టరేట్‌లో 24 గంటల సహాయ కేంద్రం

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 28 Mar 2024 03:00 IST

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు

మీడియా కేంద్రం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా సమస్యలున్న ఓటర్లకు తగిన సలహాలు, సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. వీరికి ఎన్నో రకాల సందేహాలుంటాయి. నేతలు నియమావళి ఉల్లంఘిస్తే ఎక్కడ ఫిర్యాదు చేయాలి. సందేహాల నివృత్తికి ఎక్కడ సంప్రదించాలి.. అని చూడకుండా ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఈనెల 20న ఓటరు సహాయ కేంద్రాన్ని కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రం 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

హెల్‌లైన్‌ 1950 నుంచి 8 రకాల సేవలు: ఓటరు హెల్ప్‌లైన్‌ నం 1950 ద్వారా 8 రకాల సేవల్ని అందిస్తున్నారు. పోలింగ్‌, ఎన్నికల క్రతువు సజావుగా సాగటానికి ఫిర్యాదులు, అభిప్రాయాల స్వీకరణ, ఎన్నికల అధికారికి సంబంధించిన వివరాలు, శాసన సభ నియోజక వర్గ సమాచారాన్ని ఓటర్లకు తెలియజేయడం, ఓటరు నమోదు, పోలింగ్‌ కేంద్రం చిరునామా, ఎన్నికల సమాచారం 24 గంటలు ఓటర్లకు అందించడం వంటి సేవలు చేస్తారు. ఫోన్‌ చేసిన వెంటనే కేంద్రంలో ఉన్న సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకుంటారు. ఒక వేళ సిబ్బంది తీసుకోనట్లయితే ఈ ఫోన్‌ వెంటనే కేంద్ర కార్యాలయానికి వెళుతుంది. ఈ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ కూడా చేయవచ్చు.

సీ-విజల్‌ యాప్‌: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడటం అభ్యర్థులు దుష్ప్రవర్తన, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే సీ-విజల్‌ యాప్‌ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు. అందిన 100 నిమిషాల్లో అధికారులు చర్యలు తీసుకుంటారు. ఆయా పార్టీలు పంచే నగదు, మద్యం, బహుమతులు, అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్లు వాడినా మతం, కులాల రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించినా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉన్నా ఫిర్యాదు చేయవచ్చు.

నిబంధనలు ఉల్లంఘిస్తే..

ఎన్నికల నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే అధికారుల దృష్టికి తీసుకు రావాలి. 1950 నంబర్‌కు  తెలియజేయాలి. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదును వెంటనే సంబంధిత అధికారికి పంపి అక్రమాల కట్టడికి చర్యలు తీసుకుంటారు.


ఓటరు జాబితాపైనే ఎక్కువ ఫిర్యాదులు

ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకారం ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ముందుకు సాగుతోంది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాకపోవడంతో సహాయ కేంద్రానికి ఎక్కువగా ఓటరు జాబితాకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయి. దరఖాస్తు చేసినా ఇంకా ఓటు హక్కు రాలేదని కొందరు, ఇప్పటికే జాబితాలో పేరున్నా ఈసారి పోలింగ్‌ కేంద్రం మారిందని ఇంకొందరు సహాయ కేంద్రానికి ఫోన్‌ చేస్తున్నారు. ఈ వివరాలను సంబంధిత అధికారులకు చేరవేస్తున్నారు. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసిన వారిలో జాబితాలో చోటు దక్కని వారి నుంచి ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించేలా చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని