logo

నిబంధన ఎగ్గొట్టి.. రసాయనంతో మగ్గబెట్టి

మధురఫలంగా పేరుగాంచిన మామిడి పండుపైన రసాయనక మరక పడుతోంది. ఇష్టానుసారం కార్బైడ్‌, ఇథలిన్‌ రసాయనాలు విచ్చలవిడిగా వినియోగించి మగ్గబెట్టేస్తున్నారు. ఇటీవల టాస్క్‌ఫోర్సు పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేసి రూ.12లక్షల విలువైన మామిడికాయలను పట్టుకున్నారు.

Published : 29 Mar 2024 03:43 IST

దాడులు జరుగుతున్నా ఫలితం శూన్యం

బాటసింగారం మార్కెట్‌లో అధికారుల పరిశీలన..

ఈనాడు- హైదరాబాద్‌: మధురఫలంగా పేరుగాంచిన మామిడి పండుపైన రసాయనక మరక పడుతోంది. ఇష్టానుసారం కార్బైడ్‌, ఇథలిన్‌ రసాయనాలు విచ్చలవిడిగా వినియోగించి మగ్గబెట్టేస్తున్నారు. ఇటీవల టాస్క్‌ఫోర్సు పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేసి రూ.12లక్షల విలువైన మామిడికాయలను పట్టుకున్నారు.

బాట సింగారం మార్కెట్‌లో మామిడి సీజన్‌ పుంజుకుంది. ఇదే అదనుగా దళారీలు, వ్యాపారులు కుమ్మకై పండ్లపైనే రసాయన ప్యాకెట్లను వేసేసి రవాణా చేస్తున్నారు. మంగళవారం బాటసింగారంలోనూ తనిఖీలు చేపట్టి వ్యాపారులపై చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో మామిడికాయలను ఎలా మగ్గబెట్టాలో అవగాహన కల్పించారు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం.. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మామిడికాయలతో మరికొన్ని పండ్లను మగ్గబెట్టేందుకు కొన్ని నిబంధనలను పెట్టింది. ఇథఫాన్‌ పౌడర్‌ ప్యాకెట్‌లతో పాటు ఇథలిన్‌ గ్యాస్‌ వినియోగానికి లైసెన్సులు విధించడంతోపాటే పండ్లు అయ్యేందుకు అనుసరించాల్సిన శాస్త్రీయ పద్ధతులను పేర్కొంది. ఉదాహరణకు మామిడికాయలనే తీసుకుంటే.. ఒక అట్టపెట్టెలో అడుగున దళసర పేపర్‌ వేసి ఇథలిన్‌ ప్యాకెట్‌ను నీటిలో తడిపి వేయాలి. తర్వాత రంద్రాలు చేసిన పేపర్‌ను, గడ్డి వేసి మామిడి కాయలను వేయాలి. ఇలా మూడు పొరలు వేసి మామిడిని మగ్గపెట్టాలని ఆహార పరిరక్షణ అధికారులు చెబుతున్నారు. ఈ పద్ధతిని పాటిస్తే రసాయనాలు నేరుగా పండ్లకు తగలవు.

శరీరంపై ప్రభావం..

మామిడి కాయలపై ఇథలిన్‌ పౌడర్‌ ప్యాకెట్లను నేరుగా వేయడంతో ఆ ప్రభావం పండ్లపై పడి విషతుల్యమవుతున్నాయి. ఇలా కృత్రిమంగా మగ్గబెట్టిన పండ్లను తింటే శరీరంలో మంట, శరీరంపై దురదలతో పాటు గొంతులో మంట, నరాలబలహీనత వంటి వ్యాధులు వస్తున్నాయి. శరీరంలో తేమ శాతం తగ్గించడంతోపాటు మామిడిలో ఉండే విటమిన్‌-సి సైతం మాయమవుతోందని ఆహార భద్రతాధికారులు చెబుతున్నారు. మామిడిపై నల్లటి మరకలు ఏర్పడి రంధ్రాలు పడినట్టుఉంటే అంతవరకూ తొలగించి తినాలని హెచ్చరిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని