logo

ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు

గతంలో ఎప్పుడూ లేని విధంగా.. పాతబస్తీలో ఆచూకీ లేని 60వేల మంది ఓటర్లను జీహెచ్‌ఎంసీ గుర్తించింది. మరిన్ని గుర్తింపు కార్డులను పరిశీలించాల్సి ఉండగా ఎన్నికల తేదీ దగ్గరపడటంతో అధికారులు పరిశీలన కార్యక్రమాన్ని ఆపేసినట్లు సమాచారం.

Updated : 30 Apr 2024 09:01 IST

ఆ వివరాలు ఏఎస్‌డీ జాబితాలో చేర్పు

ఈనాడు, హైదరాబాద్‌: గతంలో ఎప్పుడూ లేని విధంగా.. పాతబస్తీలో ఆచూకీ లేని 60వేల మంది ఓటర్లను జీహెచ్‌ఎంసీ గుర్తించింది. మరిన్ని గుర్తింపు కార్డులను పరిశీలించాల్సి ఉండగా ఎన్నికల తేదీ దగ్గరపడటంతో అధికారులు పరిశీలన కార్యక్రమాన్ని ఆపేసినట్లు సమాచారం. ఆచూకీ లేని ఓటర్ల వివరాలను ఇప్పటికప్పుడు రద్దు చేయడం కుదరదని, నిబంధనలను అనుసరించి ఏఎస్‌డీ (ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెత్‌) జాబితాలో చేర్చి సంబంధిత పోలింగ్‌ కేంద్రాలకు పంపించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

గుర్తింపు కార్డుతో వస్తేనే.. హైదరాబాద్‌ పార్లమెంటు పరిధిలో 22 లక్షల మంది ఓటర్లున్నారు. అందులో 6,72,404 బోగస్‌ ఓట్లు ఉన్నాయని గతంలో కాంగ్రెస్‌ నేత ఈసీకి ఫిర్యాదు చేశారు. అందులో నకిలీ చిరునామాలతో 2,88,956, ఇతరత్రా 1,74,990, చనిపోయిన ఓటర్లు 15,025, ఒకే ఇంటి నంబరు మీద 50కి మించి గుర్తింపుకార్డులున్న ఇళ్లలోని ఓటర్లు 53,991, నకిలీ ఇంటి నంబర్లలోని ఓటర్లు 23,045 మంది ఉన్నారని గుర్తింపుకార్డులనూ అధికారులకు అందజేశారు. దీనిపై బల్దియా విచారణ చేపట్టింది. చనిపోయినట్లు, చిరునామాలో లేకపోవడం, విచారణకు వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో.. అనుమానం ఉన్న 60వేల ఓట్లను ఏఎస్‌డీ జాబితాలో చేర్చామని.. వివరాలు సంబంధిత పోలింగ్‌ కేంద్రాల్లో ఉంచుతామని తెలిపారు. నిజమైన ఓటర్లు గుర్తింపుకార్డులతో పోలింగ్‌ కేంద్రానికి వస్తే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. పోలింగ్‌ ప్రక్రియ అనంతరం ఆచూకీ లేనివి రద్దవుతాయన్నారు.


రెండేళ్లలో 6.6 లక్షలు తొలగింపు

ఫిబ్రవరి 8, 2024న జారీ అయిన ఓటరు తుది జాబితా ప్రకారం.. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానాలతోపాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానంలో కలిపి 45,70,138 మంది ఓటర్లున్నారు. అప్పట్నుంచి ఇప్పటివరకు వరకు మరో 1.4 లక్షల మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వాటిని అధికారులు ఆమోదించారు. అదే సమయంలో 1.2 లక్షల ఓట్లను రద్దు చేశారు. దీంతో హైదరాబాద్‌ జిల్లా ఓటర్లు 20 వేలు పెరిగి 45,90,138 లక్షలకు చేరుకున్నారు. గడిచిన రెండేళ్లలో హైదరాబాద్‌ జిల్లాలో రద్దయిన 5.4 లక్షల ఓటర్లను, తాజాగా రద్దయిన 1.2 లక్షల ఓట్లను కలిపితే మొత్తం 6.6 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని