logo

ఓటరు స్లిప్పుల పంపిణీలో అలసత్వం

గ్రేటర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో ఒకవైపు డిజిటల్‌ ఫొటో ఓటర్‌ స్లిప్పులు పంపిణీని వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. స్థానిక సిబ్బంది నిర్లక్ష్యంతో ఇవి ఇంకా ఓటర్లకు చేరడం లేదు.

Published : 08 May 2024 03:56 IST

పలువురికి ఇంకా అందని వైనం
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో ఒకవైపు డిజిటల్‌ ఫొటో ఓటర్‌ స్లిప్పులు పంపిణీని వేగవంతం చేసినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. స్థానిక సిబ్బంది నిర్లక్ష్యంతో ఇవి ఇంకా ఓటర్లకు చేరడం లేదు. మరోవైపు ఈ నెల 13న జరగబోయే ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారికి ఈసారి ఎన్నికల గుర్తింపు కార్డులను అందజేయలేదు. ఆన్‌లైన్‌లో ఓటు వివరాలను తెలుసుకొని ఏదైనా గుర్తింపు కార్డుతో ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటరు స్లిప్పులు లేకపోతే ఓటుహక్కు లేదన్న భావనతో ఓటు వేయకపోవడం..లేదంటే పోలింగ్‌ స్టేషన్‌.. గుర్తింపు కార్డు నంబరు తెలుసుకోవడంలో అవగాహన లేకపోవడం వల్ల ఓటు వేసేందుకు ఆసక్తి చూపించరు. దీనివల్ల ప్రతి ఎన్నికల్లో భాగ్యనగరంలో ఓటింగ్‌ శాతం పెరగడం లేదు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో నగరంలో 45 శాతం పోలింగ్‌ దాటలేదు. సమాజంపై అవగాహన, అక్షరాస్యతలో ముందున్న వారు సైతం ఓటింగ్‌కు దూరంగా ఉండిపోవడం వల్ల సరైన అభ్యర్థులను చట్టసభలకు పంపే అవకాశాన్ని తామే చేజేతులారా కోల్పోతున్నారు.

ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నామని..

డిజిటల్‌ ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ ఇప్పటికే చాలావరకు పూర్తి చేసినట్లు ఓవైపు అధికారులు చెబుతుండగా తమకు ఇంకా అందలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళల ఓటు వేయాలంటే ఇబ్బందే. అయితే జాబితాలో పేరు ఉంటే ఓటు వేయవచ్చని అధికారులంటున్నారు. ఓటు వేయాలన్న ఆసక్తి ఉంటే రెండు రోజుల ముందే అన్నీ సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓటరు పేరు, తండ్రిపేరు, పుట్టిన తేదీ నమోదు చేసి క్లిక్‌ చేస్తే ఓటరు జాబితాలో పేరుతోపాటు గుర్తింపు కార్డు నంబరు, పోలింగ్‌ కేంద్రం చిరునామా తెలుసుకోవచ్చు. ఆ వివరాలను నమోదు చేసుకొని ఏదైనా గుర్తింపు కార్డుతో పోలింగ్‌ కేంద్రానికి వెళితే ఓటు వేసే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉందని అధికారులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు