విపత్కర సమయంలో ఉత్తమ సేవలు
సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ
పూర్వ జేడీ లక్ష్మీనారాయణను సన్మానిస్తున్న నిర్వాహకులు
బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: కరోనా వంటి విపత్కర సమయాల్లో ప్రాణాలకు తెగించి సేవలందించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆదర్శప్రాయులని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ అభినందించారు. శనివారం కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో జ్ఞాన సరస్వతి ఛారిటబుల్ ట్రస్ట్ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ సేవలందించిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... సేవల ద్వారానే మానవ సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇలాంటి వారిని సత్కరించడం ద్వారా జ్ఞాన సరస్వతి ట్రస్టు మానవత్వానికి ఊపిరిలూదుతోందని ప్రశంసించారు. ట్రస్టు ఛైర్మన్ యనమల శ్రీనివాస్‌యాదవ్, తితిదే పాలక మండలి మాజీ సభ్యుడు చిప్పగిరి ప్రసాద్, జిల్లా సర్వశిక్ష అభియాన్ పీవో ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. తన తండ్రి వెంకట సుబ్బయ్య పేరిట ఛారిటబుల్ ట్రస్టు స్థాపించి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు నగదు, నెలవారీ సరకులను తన వార్డులోని ప్రజలకు అందిస్తున్నామని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెప్పారు. అనంతరం కరోనా సమయంలో సేవలందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ నూర్ పర్వీన్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, ట్రస్టు సభ్యులు, పాల్గొన్నారు.