logo

కొవిడ్‌బాధితులకేదీ భరోసా ?

కడప నగరంలోని సరోజినినగర్‌కు చెందిన సువర్ణ (32) కరోనాతో గతేడాది మే 26న మృతిచెందారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటనతో బాధిత కుటుంబానికి కాస్త ఊరట కలిగింది. మూడు నెలల కింద దరఖాస్తు చేసుకుని నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిహారం అందలేదని, పిల్లల

Published : 23 Jan 2022 02:32 IST

కేంద్రం సాయానికి ఎదురు చూపులు

జిల్లా నుంచి 2,620 దరఖాస్తుల రాక

- ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, జిల్లా సచివాలయం

రాయచోటిలో కొవిడ్‌ రోగి మృతదేహాన్ని తరలిస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు (దాచిన చిత్రం)

కడప నగరంలోని సరోజినినగర్‌కు చెందిన సువర్ణ (32) కరోనాతో గతేడాది మే 26న మృతిచెందారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటనతో బాధిత కుటుంబానికి కాస్త ఊరట కలిగింది. మూడు నెలల కింద దరఖాస్తు చేసుకుని నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిహారం అందలేదని, పిల్లల పోషణ కష్టంగా మారిందని మృతురాలి భర్త శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

రైల్వేకోడూరుకు చెందిన నరసింహులు (35) కరోనాతో గతేడాది జూన్‌లో మరణించారు. కుటుంబ పోషణ జరగక భార్య, ఇద్దరు పిల్లలు అష్టకష్టాలు పడుతున్నారు. కేంద్రం అందించే ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకుని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదే పట్టణానికి చెందిన జయరాం (38) కొవిడ్‌తో కన్నుమూయగా ఆయన కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొవిడ్‌ బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లింపునకు మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిధి నుంచి బాధిత కుటుంబసభ్యులకు రూ.50 వేలు చొప్పున దరఖాస్తు చేసుకున్న నెల రోజుల వ్యవధిలోపు చెల్లించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు ఆదేశాలు అమలు కాకపోవడంతో మూడు రోజుల కిందట సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సమన్లు జారీ చేయడంతో యంత్రాంగం స్పందించింది. మూడు రోజుల్లో పరిహారం చెల్లింపులు పూర్తి చేస్తామని న్యాయస్థానానికి తెలిపింది. అధికార లెక్కల ప్రకారం జిల్లాలో కరోనా మరణాలు 644 కాగా, అనధికారికంగా ఎన్నో రెట్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,620 దరఖాస్తులు బాధిత కుటుంబాల నుంచి అందగా, వీటిలో 1,736 వరకు అర్హత ఉన్నట్లు జిల్లా నిర్ధారణ కమిటీ తేల్చింది. మిగిలిన 497 దరఖాస్తులు తిరస్కరించినప్పటికీ మరోసారి పరిశీలించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.

సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి జాప్యం

బాధితుల నుంచి దరఖాస్తులు అందిన అనంతరం దశల వారీగా చెల్లింపులకు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)కు పంపుతున్నా నెలల తరబడి చెల్లింపులు జరగడంలేదు. అధికార యంత్రాంగం మాత్రం చెల్లింపులకు నివేదించామంటున్నా పరిహారం అందనంత వరకు బాధితులకు న్యాయం జరగనట్లే. అధికారులు మాత్రం సీఎఫ్‌ఎంఎస్‌కు నివేదించడంతో తమ పని అయిపోయినట్లు భావిస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలో చెల్లింపులు జరగాల్సి ఉంది. తాజాగా జిల్లా నుంచి చెల్లింపు నివేదనలు జరిగినా పరిహారం అందే వరకు సమస్య పరిష్కారం కానట్లే.

చెల్లింపులకు నివేదించాం

జిల్లాలో కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యుల నుంచి 2,620 దరఖాస్తులు అందాయి. వీటిని ప్రత్యేక కమిటీ పరిశీలించి అర్హత ఉన్నవాటికి పరిహారం చెల్లింపునకు శుక్రవారం రాత్రి నివేదించాం. అనర్హమైనవిగా గుర్తించిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని నిర్ణయించాం. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - మాలోల, డీఆర్వో, కడప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని