logo

సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధిత జిల్లా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 24 నుంచి 31 తేదీ వరకు జిల్లాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు.

Published : 23 May 2024 03:17 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం

ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (పాత చిత్రం)

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధిత జిల్లా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 24 నుంచి 31 తేదీ వరకు జిల్లాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా కొంత మెరుగైన ఫలితాలనే సాధించినా పలు ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు కొంత నిరాశపర్చాయి. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలో ప్రథమ సంవత్సరంలో 15,058 విద్యార్థులు పరీక్షలు రాయగా 9,548 మంది ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్రంలో జిల్లా 5వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 13,407 మందికిగాను 9,974 మంది ఉత్తీర్ణులవగా, ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది. అనుత్తీర్ణత సాధించిన విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించేలా జిల్లాలోని పలు ప్రభుత్వ కళాశాలలు సెలవుల్లో కూడా విద్యార్థుల సందేహాలు తీరుస్తూ వారిని ప్రోత్సహించాయి.

31 పరీక్ష కేంద్రాలు

జిల్లాలో జరిగే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష కోసం జిల్లాలో 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరంలో 10,073 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,907 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేలా జిల్లా యంత్రాంగం వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసింది. పరీక్షల నిర్వహణ కోసం 31 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, 31 మంది డిపార్టుమెంటల్‌ అధికారులు, మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షల సామగ్రిని కూడా కేంద్రాలకు అధికారులు పంపిణీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యాన్లు వంటి పలు సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు

సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న జిల్లాలోని విద్యార్థులు వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in నుంచి  కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడు చేసుకొని పరీక్షలకు హాజరుకావచ్చని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. వాటిపై కళాశాలల ప్రిన్సిపల్స్‌ సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తారని పేర్కొన్నారు. పరీక్షకు గంట ముందు విద్యార్థులు కేంద్రాలకు చేరుకుంటే ప్రయోజనం.

ప్రశాంతంగా నిర్వహణ

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం. 31 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురవకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలి. పరీక్ష కేంద్రాలకు గంట ముందు విద్యార్థులు చేరుకోవాలి. ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న అనంతరం సమాధానాలు రాయడంపై విద్యార్థులు దృష్టి సారిస్తే ఆశించిన ఫలితాన్ని పొందుతారు.

 జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా ఇంటర్‌  విద్యాధికారి, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు