logo

జాతీయ శిబిరం.. భవితకు వరం

సమాజ సేవే పరమార్థంగా.. ఉన్నత అవకాశాలే లక్ష్యంగా యువ సైనిక దళంలో విద్యార్థినులు భాగస్వాములవుతున్నారు. కేవలం చదువులకే పరిమితం కాకుండా తమ సత్తా ఏమిటో నేటి ప్రపంచానికి చాటి చెబుతామని అంటున్నారు.

Published : 23 May 2024 02:50 IST

న్యూస్‌టుడే, మార్కండేయకాలనీ(ఎన్టీపీసీ)

కాలినడకన కొండ ప్రాంతం నుంచి వస్తున్న ఎన్‌సీసీ క్యాడెట్లు

సమాజ సేవే పరమార్థంగా.. ఉన్నత అవకాశాలే లక్ష్యంగా యువ సైనిక దళంలో విద్యార్థినులు భాగస్వాములవుతున్నారు. కేవలం చదువులకే పరిమితం కాకుండా తమ సత్తా ఏమిటో నేటి ప్రపంచానికి చాటి చెబుతామని అంటున్నారు. ఎన్‌సీసీలో చేరి నిర్దేశించుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ 9వ బెటాలియన్‌ నిజామాబాద్‌ గ్రూపు తరఫున ఎన్టీపీసీలోని సచ్‌దేవా స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఎన్‌సీసీ క్యాడెట్లు వారం రోజుల పాటు తమిళనాడులో నిర్వహించిన జాతీయ ట్రెక్కింగ్‌ శిబిరంలో పాల్గొన్నారు. ఇందులో 16 రాష్ట్రాలకు చెందిన 525 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు  ఊటి, కెట్టిలోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో సుమారు 35 కిలో మీటర్లు కాలినడకన వెళ్లి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు. ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ నుంచి 16 మంది ఎన్‌సీసీ క్యాడెట్లను ఎంపిక చేయగా ఎన్టీపీసీ సచ్‌దేవా స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ గోదావరిఖని నుంచి ఆరుగురు విద్యార్థినులు పాల్గొని సత్తా చాటారు.

పలు అంశాలపై అవగాహన

ప్రతి క్యాడెట్‌కు సామాజిక సేవ, దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానంపై అవగాహన కల్పిస్తారు. శిబిరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉండటంతో అందరితో స్నేహపూర్వక భావనతో మెలిగేలా చూస్తారు. ఎత్తైన గుట్టలు, అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న వారి స్థితిగతులను వివరిస్తారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్‌సీసీ కేడెట్లను వారి భాష, పరిజ్ఞానం ఆధారంగా బృందాలుగా విభజించి వివిధ రకాల పోటీలు నిర్వహిస్తారు. విపత్కర పరిస్థితుల్లో సైన్యాన్ని అడవిలో వదిలేస్తే ఎవరికి వారే ఆహారం ఎలా సంపాదించుకొని తినాలి, ఎలాంటి దాడులు జరుగుతాయి, వాటిని ఎలా తిప్పికొట్టాలి, సాహసోపేత చర్యలకు ఎలా సిద్ధం కావాలన్న విషయాలను ప్రయోగాత్మకంగా వివరిస్తారు. కొండ ప్రాంతాలను ఎక్కడం, దిగడం, నదులను దాటడం వంటి అంశాలపై ఈ శిబిరంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

ఎంతో ఆనందంగా ఉంది

ఎన్‌సీసీలో చేరి ఒక సంవత్సరం అవుతోంది. క్రమశిక్షణ, నడవడికను గుర్తించిన శిక్షకులు జాతీయ స్థాయి ట్రెక్కింగ్‌ శిబిరానికి ఎంపిక చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ ఎన్‌సీసీ క్యాడెట్లతో కాలినడకన దూరప్రాంతాలకు వెళ్లాం. వారి సంప్రదాయాలు, సంస్కృతిని తెలుసుకోవడంతో పాటు తెలంగాణ ఖ్యాతిని వివరించా. శిబిరం నిర్వహించే సమయంలో వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ ఆత్మసైర్థ్యంతో ముందుకు వెళ్లాం. సీనియర్ల సూచనల మేరకు పలు ప్రాంతాల్లో తిరుగుతూ విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నా.

గాదర్ల సహస్ర

పోలీసుశాఖలో ఉద్యోగం సాధించాలని

పోలీసుశాఖలో ఉద్యోగం సాధించాలన్నదే నా లక్ష్యం. సచ్‌దేవా స్కూల్‌లో ఎన్‌సీసీ క్యాడెట్గా చేరి జాతీయ స్థాయి ట్రెక్కింగ్‌ శిబిరంలో పాల్గొన్నా. ఊటి, కెట్టి ప్రాంతాల్లో నడక ఎంతో ఆనందాన్నిచ్చింది. పలు గార్డెన్‌లను పరిశీలించాం. పచ్చని గడ్డితో తయారు చేసిన పలు ఆకృతులను, ఒకేచోట వేలాది రంగుల పూలు, వాటి ప్రత్యేక పేర్లను తెలుసుకున్నాం. ఎన్‌సీసీ ద్వారా క్రమశిక్షణ, సమాజసేవ, విషయ పరిజ్ఞానం, ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

పిట్ల అపూర్వ

ఆత్మసైర్థ్యం పెరిగింది

మా పాఠశాలలో ఎన్‌సీసీ బృందంలో చురుగ్గా ఉన్నానని జాతీయ స్థాయి ట్రెక్కింగ్‌ శిబిరానికి ఎంపిక చేశారు. కోయంబత్తూర్‌ నుంచి కెట్టి వరకు నడుచుకుంటూ వెళ్లాం. అన్ని రాష్ట్రాలకు చెందిన వారితో కలిసి శిబిరంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇటువంటి శిబిరాలకు వెళ్లడం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారితో ఒకేచోట కలిసి ఉండవచ్చు. ఆయా ప్రాంతాల విశేషతలను తెలుసుకోవచ్చు.

అక్షయ

దేశ సేవకు సిద్ధంగా ఉండాలి

ఎన్‌సీసీ క్యాడెట్లు దేశ సేవకు సిద్ధంగా ఉండాలి. శిక్షణ శిబిరంలో క్రమశిక్షణ, మంచి నడవడిక, నాయకత్వ లక్షణాలు నేర్పిస్తారు. తెలంగాణ 9వ బెటాలియన్‌ జేసీవో దృకుమార్‌ చేపట్టిన రూట్మ్యాప్‌ ఆధారంగా ఎన్‌సీసీ కేడెట్లతో నడక ప్రయాణం సాగించాం. ప్రతి విద్యార్థి ఎన్‌సీసీలో చేరి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. శిక్షణ ద్వారా సామాజిక సేవ, గౌరవ భావం, దేశభక్తి, స్వీయరక్షణ పెంపొందుతాయి. పై చదువు, రక్షణ రంగ ఉద్యోగాల్లో ఎన్‌సీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

సరిత, ఎన్‌సీసీ అధికారిణి, ఎన్టీపీసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని