logo

తనిఖీల్లో పట్టుకున్న డబ్బుల అప్పగింత

లోక్‌సభ ఎన్నికల పోరు ముగిసింది. ఎన్నికల సమయంలో జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువులేవీ  తరలించకుండా, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలించకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Published : 23 May 2024 03:03 IST

న్యూస్‌టుడే, సిరిసిల్ల కలెక్టరేట్‌

చెక్‌పోస్టులో తనిఖీ చేస్తున్న పోలీసులు, అధికారులు (పాతచిత్రం)

లోక్‌సభ ఎన్నికల పోరు ముగిసింది. ఎన్నికల సమయంలో జిల్లాలో ఓటర్లను ప్రలోభపెట్టే వస్తువులేవీ  తరలించకుండా, రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలించకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 6 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులతో పాటు పోలీసు తనిఖీల్లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలిస్తుండటంతో పట్టుకుని సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన డబ్బులకు సరైన ఆధారాలు చూపించిన 55 మందికి రూ.64,43,260 తిరిగి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్‌పోస్టులు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ఎక్స్‌రోడ్డు, ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుపల్లి, గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజి, రుద్రంగి మండలం కలికోట, వేములవాడ గ్రామీణ మండలం ఫాజుల్‌నగర్, బోయినపల్లి మండలం కొదురుపాక ఎక్స్‌రోడ్డులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అమర్చారు. వీటిని కలెక్టరేట్‌లోని ఫిర్యాదుల కేంద్రానికి అనుసంధానం చేసి 24 గంటలూ పర్యవేక్షించారు. జిల్లాలోకి వచ్చిపోయే వాహనాలను చెక్‌పోస్టుల వద్ద ఉన్న అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో రూ.82 లక్షల వరకు నగదు సీజ్‌ చేసి 57 కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో పట్టుకున్న డబ్బులను జిల్లా గ్రీవెన్స్‌ సెల్‌లో జమ చేశారు. డబ్బులను తిరిగి అప్పగించడానికి సరైన ఆధారాలు చూపించడానికి జిల్లాలో త్రీమెన్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఛైర్మన్‌గా డీఆర్డీవో శేషాద్రి, సభ్యులుగా డీటీవో నీరజ, ఎస్‌టీవో రవీందర్‌లను నియమించారు. నగదుకు సంబంధించిన సరైన ఆధారాలను పరిశీలించిన అనంతరం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఇప్పుడు ఆ పత్రాన్ని తీసుకొని డబ్బులు స్వాధీనం చేసుకున్న వ్యక్తులు ఏ నియోజకవర్గంలో ఉన్నారో అక్కడి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో పత్రాన్ని అందిస్తే వారి డబ్బులను తిరిగి ఇచ్చారు.

సరైన ఆధారాలు చూపించాలి

రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తరలిస్తున్న వ్యక్తులు తనిఖీల్లో పట్టుబడినప్పుడు సరైన ఆధారాలు చూపించి డబ్బులను తీసుకెళ్లారు. పట్టుబడిన సమయంలో అక్కడి అధికారులు ఇచ్చిన నోటీసుతోపాటు డబ్బులను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారో దానికి సంబంధించి ఆధారం జిల్లా కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌సెల్‌లో చూపిస్తే త్రీమెన్‌ కమిటీ పరిశీలించి ధ్రువీకరణ పత్రం అందజేయడం జరిగింది.  దానిని తీసుకొని సంబంధిత రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో సంప్రదించిన వారికి డబ్బులు అందజేస్తున్నాం. మిగిలిన వారు కూడా సరైన ఆధారాలు తీసుకు వచ్చి డబ్బులు తీసుకోవాలి.

 శేషాద్రి, డీఆర్డీవో, గ్రీవెన్స్‌సెల్‌ ఛైర్మన్‌
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని