logo

ఆధునికీకరణే అసలైన మందు

రాష్ట్రంలోని మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తుంది. ఎన్నికల కోడ్‌ ముగిసేలోగా వీటి విధి విధానాలు వెల్లడించనుంది.

Published : 23 May 2024 03:08 IST

మార్కెట్‌ పోటీని తట్టుకుంటేనే వస్త్ర పరిశ్రమ మనుగడ
ప్రభుత్వ నిర్ణయంతో నేతన్నల్లో ఆశలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల

మరమగ్గాలపై వస్త్రోత్పత్తులు

రాష్ట్రంలోని మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తుంది. ఎన్నికల కోడ్‌ ముగిసేలోగా వీటి విధి విధానాలు వెల్లడించనుంది. మరమగ్గాలపై వస్త్రోత్పత్తి రాష్ట్రం మొత్తం జిల్లాలోనే ఎక్కువ జరుగుతుంది. ప్రభుత్వం మరమగ్గాల ఆధునికీకరణ, మార్కెటింగ్, కార్మికుల ఉపాధి వంటి అంశాలతో ప్రణాళికలు రూపొందిస్తుంది. వాటి ద్వారా ప్రయోజనం పొందడంలో జిల్లా వస్త్ర పరిశ్రమ ముందుంటుంది. ఇక్కడి వస్త్రోత్పత్తులు యజమాని, ఆసామి, కార్మికులు అనే మూడంచెల వ్యవస్థలో నడుస్తున్నాయి. 30 వేలకు పైగా మరమగ్గాలు, వేలాది మంది కార్మికులు, నిత్యం లక్షలాది మీటర్ల కాటన్, పాలిస్టర్‌ వస్త్రాలు ఉత్పత్తి చేస్తున్నారు. వీరికి ప్రభుత్వ ఆర్డర్లు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి పీస్‌రేట్‌పై ఉత్పత్తి చేస్తుంటారు. వీటిలో చాలా వరకు ముతక రకం ఉత్పత్తులకే పరిమితమయ్యారు. దశాబ్దాలుగా పురాతన మరమగ్గాలతోనే కాలం వెళ్లదీస్తున్న జిల్లా పరిశ్రమలో ఆధునికీకరణ ప్రక్రియలేవీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు.

  • జిల్లాలోని వస్త్ర పరిశ్రమ ఆధునికీకరణ, కార్మికుల నైపుణ్యాలు పెంచేలా గత అయిదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పథకాలేవీ అమలుకు నోచుకోలేదు. 2019లో కేంద్ర ప్రభుత్వం పవర్‌టెక్స్‌ ఇండియాలో పదిహేను వేల మరమగ్గాల ఆధునికీకరణకు అధికారులు ప్రణాళికలు చేశారు. దానిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం చెల్లించి ఒక్కో కార్మికుడికి వందశాతం రాయితీతో నాలుగు మరమగ్గాల వరకు ఆధునికీరణకు ప్రణాళికలు రూపొందించారు. అప్పుడు దీనికోసం రూ.30 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటితో పది వేల మరమగ్గాలకు డాబీలు, ఆటోమేటిక్‌ నియంత్రణ యంత్రాలను అమర్చారు. అప్పటి నుంచి వస్త్ర పరిశ్రమలో ఆధునికీకరణ అన్న ఊసేలేదు.
  •  బతుకమ్మ చీరల ఉత్పత్తిలో డిజైన్ల కోసం 2021లో ఆటోమేటిక్, ఎలక్ట్రానిక్‌ జకార్డులు అమర్చుకోవాలని సూచించారు. అప్పటికప్పుడు పరిశ్రమ వర్గాలు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిశ్రమల్లో వాడిన వాటి పరికరాలను తెచ్చుకుని బిగించుకున్నారు. ఒక్కో పరికరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చుయింది. పాత పరికరాలు కావడంతో ప్రభుత్వం వీటి ఆధునికీకరణకు నిధులు ఇవ్వలేదు. పరోక్షంగా ఉత్పత్తి చేసిన చీరలపై ప్రోత్సాహకాల రూపంలో అందించింది.
  •  2022లో అప్పటి ప్రభుత్వం మరమగ్గాల ఆధునికీకరణకు ప్రభుత్వం టీ-ట్యాప్‌ (తెలంగాణ టెక్స్‌టైల్‌ అపరెల్‌ పాలసీ)ని తీసుకొచ్చింది. తొలుత టెక్స్‌టైల్‌ పార్కులోని పరిశ్రమలను చేసి తర్వాత విస్తరించాలనే ఆలోచన చేశారు. పరిశ్రమ వర్గాలకు అవగాహన కల్పించడం, ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. అందులో ప్రాసెసింగ్‌ యూనిట్, రాపియర్‌ మగ్గాల నుంచి ఎయిర్‌జెట్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవడం, ఆధునిక డైయింగ్‌ యూనిట్, గార్మెంటరీ ఉత్పత్తుల కోసం మొత్తం ఎనిమిది మంది ఔత్సాహికులు రూ.52 కోట్ల ప్రణాళికలతో ముందుకొచ్చారు. ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం ఇవన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
  •  మార్కెట్‌లో పోటీని తట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు తీసుకురావాలి. దానికి పరిశ్రమలో ఆధునికీకరణే అసలైన ఔషధం. ఇక్కడి పరిశ్రమలోని ప్రాధాన్యతలను గుర్తించాలి. పథకం అమలుకు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల కోసం జిల్లా నేతన్నలు ఎదురుచూస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని