logo

నిద్రపోతున్న నిఘా.. చోరుల హల్‌చల్‌

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఉన్నతాధికారులు తరచూ సమావేశాల్లో చెబుతుంటారు. నేరాల అదుపులో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైనది.

Published : 23 May 2024 03:11 IST

న్యూస్‌టుడే, రాయికల్‌ పట్టణం

నేల చూపులు చూస్తున్న సీసీ కెమెరా

ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఉన్నతాధికారులు తరచూ సమావేశాల్లో చెబుతుంటారు. నేరాల అదుపులో సీసీ కెమెరాల పాత్ర ప్రధానమైనది. కానీ నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారుతున్నాయి. రాయికల్‌ పట్టణంలో సుమారు 40 తులాల బంగారం, లక్ష రూపాయలు నగదు చోరీ ఘటన కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో పట్టణంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సుమారు 30 సీసీ కెమెరాల పనితీరుపై, పురపాలక సంఘం ఆధ్వర్యంలో సీసీ కెమెరాల కోసం రూ.20 లక్షలు ఖర్చు చేసిన వైనంపై జోరుగా చర్చ జరుగుతోంది. 

2017లో మండల కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు కాగా దాతలు, విరాళాలతో పట్టణంలో సుమారు 30 సీసీ కెమెరాలు కొనుగోలు చేసి ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర కిందట టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో నిఘా నేత్రాల పటిష్ఠత కోసం రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అన్న అంశంపై స్పష్టత కరవైంది. దాతల సహాయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ కరవై తీగలు తెగడం, గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో పట్టణంలో జరిగే చోరీలు, అక్రమ రవాణాను గుర్తించడంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం ఠాణాలకు భారంగానే పరిణమిస్తోంది. కెమెరాల ఏర్పాటులో దాతల సహకారం తీసుకున్నా నిర్వహణకు మళ్లీ వారిని సంప్రదించడం ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వం ముందుకు వచ్చి నిర్వహణ బాధ్యత తీసుకుంటేనే నిఘా నేత్రాల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది. శివాజీ చౌరస్తా, అంగడిబజార్, ఇటిక్యాల క్రాస్‌రోడ్డు, గాంధీ చౌరస్తా భరతమాత చౌరస్తా, సర్దార్‌ పటేల్‌ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం, వారసంత, పోలీస్‌ ఠాణా ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు కోరుట్ల క్రాస్‌ రోడ్డు, అల్లూరి సీతారామరాజు విగ్రహం, కొండ బాపూజీ చౌరస్తా, విద్యా సంస్థల ఏరియాలతోపాటు ప్రధాన దేవాలయాలు, మజీద్, చర్చీల వద్ద అవకాశాన్ని బట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

ఉన్నతాధికారులకు నివేదించాం

పట్టణంలో దాతల సహకారంతో గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. రాయికల్‌ ఎస్సైగా విధుల్లో చేరకముందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా వివరాల కోసం నిజామాబాద్‌కు చెందిన గుత్తేదారుకు ఫోన్‌ చేస్తే స్పందించడం లేదు. సీసీ కెమెరాల సమస్యపై ఉన్నతాధికారులకు నివేదించాం.

 అజయ్, ఎస్సై, రాయికల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని