logo

ఇసుక మాఫియాకు అడ్డేదీ..?

రోజురోజుకు మెట్‌పల్లిలో ఇసుక అక్రమ రవాణా అడ్డుగోలుగా సాగుతుంది. అధికారులు అనుమతులు లేకుండా రవాణా లేకపోవడంతో ఇసుక దొరక్క ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. దీన్ని ఆసరా చేసుకున్న ఇసుక మాఫియా వారి

Published : 09 Dec 2021 05:24 IST

మెట్‌పల్లి పట్టణం, న్యూస్‌టుడే

వెనకాల నంబర్‌ ప్లేట్‌ లేకుండా ఉన్న ట్రాక్టర్‌

రోజురోజుకు మెట్‌పల్లిలో ఇసుక అక్రమ రవాణా అడ్డుగోలుగా సాగుతుంది. అధికారులు అనుమతులు లేకుండా రవాణా లేకపోవడంతో ఇసుక దొరక్క ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. దీన్ని ఆసరా చేసుకున్న ఇసుక మాఫియా వారి ఇష్టానుసారంగా అక్రమంగా తరలిస్తూ అధిక డబ్బులు సొమ్ము చేసుకుంటోంది. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు వాగులు, కాల్వలలో ఇసుక ఎక్కువగా ఉండడంతో వాటిపై దృష్టి పెట్టిన మాఫియా గుట్టుచప్పుడు కాకుండా అనుకున్న గమ్యానికి చేర్చుతూ జేబులు నింపుకుంటున్నారు. పోలీసులు విధులు నిర్వహిస్తున్న సమయంలో రెండు రోజుల క్రితం అయిదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

నెంబర్లు ఉండవు

ఇసుకను తరలించే ట్రాక్టర్లకు చాలా వాహనాలకు వెనకాల ఉండే నెంబర్లు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ప్రధాన రహదారిపై వస్తే అధికారులు పట్టుకుంటున్నారని తెలుసుకున్న మాఫియా వారి మార్గాన్ని మార్చుకుని ప్రస్తుతం ఎవరు గుర్తుపట్టని వీధుల నుంచి ఇసుకను తరలిస్తూ వారి పనిని కానిస్తున్నారు. పోలీసులు కాని అధికారులు కాని ఎప్పుడైనా ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుంటే వారం రోజుల పాటు ఆ సాకును చూపుతూ మాఫియా ఇసుక ట్రాక్టర్‌ ధరను అమాంతం పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు.

పట్టణంలో చాలా చోట్ల డంపులు

అందరు పడుకునే సమయంలో ఇసుకను వివిధ చోట్ల నుంచి తీసుకువచ్చి పట్టణంలో అక్కడక్కడ ఖాళీ స్థలాలను ఎంచుకుని ఇసుకను పోసి డంపులుగా నిల్వ చేస్తున్నారు. అవసరమున్న వారికి ట్రాక్టర్లలో ఇసుకను నింపుకొని డంపు నుంచి తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు చూసీ చూడనట్లు ఉండడంతోనే ఇసుక మాఫియాకు హద్దు లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని దృష్టి సారించి అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ అనుమతి అవసరం

అధికారులు పట్టించుకుని ఇసుకపై పలు చోట్ల అధికారికంగా అనుమతులు ఇస్తే ప్రజలను ఆదుకున్న వారవుతారు. అధిక ధరలు లేకుండా ప్రభుత్వం నిర్ణయించే ధరకు న్యాయపరంగా తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తే గృహ నిర్మాణాలకు ఆటంకం లేకుండా ప్రజలకు అండగా నిలిచిన వారవుతారు.

తెల్లవారుజామున వీధుల్లో నుంచి తరలుతున్న ట్రాక్టర్‌

మోటారుసైకిల్‌పై ముందు ఓ వ్యక్తి

ఇసుక రవాణాలో మాఫియా ట్రాక్టర్‌ వెంట ఉండి రవాణా చేస్తున్నారు. ఇసుకతో ట్రాక్టర్‌ వస్తున్న సమయంలో కొంతదూరంలో ట్రాక్టర్‌ యజమాని ముందుగా తన మోటారు సైకిల్‌పై వెళ్లి ఎవరైనా అధికారులు, పోలీసులు ఉన్నారా అని తెలుసుకుంటాడు. ఎవరైనా తనిఖీలు చేస్తుంటే విషయాన్ని గమనించి ముందుగానే ట్రాక్టర్‌ డ్రైవర్‌కు సమాచారం అందిస్తాడు. దీంతో ఆ డ్రైవర్‌ వెంటనే ట్రాక్టర్‌ను వెనక్కు తీసుకుపోయి జాగ్రత్తలు వహిస్తాడు. ఇలా ఈ తంతు ప్రతి రోజు జరుగుతున్న పట్టించుకునే వారు కరవయ్యారు. వాగులు, గోదావరి పరిసర గ్రామాల నుంచి ఇసుకను ట్రాక్టర్లలో లోడు చేసుకుని ఎవరు లేని సమయాన్ని ఎంచుకుని రవాణా చేస్తున్నారు. అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున ట్రాక్టర్ల మోతతో ఇంట్లో పడుకున్న వారికి ఇబ్బందులకు గురయ్యే విధంగా రవాణా చేస్తుండడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని