logo

మళ్లీ.. చలి కౌగిలి

చలి మళ్లీ గిలిగింత పెడుతోంది. ప్రజలపై పంజా విసురుతోంది. గడిచిన మూణ్నాలుగు రోజులతో పోలిస్తే గణనీయంగా చలి ప్రభావం పెరిగింది. గురువారం తెల్లవారు జామునుంచే బలమైన గాలులతోపాటు పొగమంచు

Published : 28 Jan 2022 03:33 IST

ఉన్నపళంగా ఉమ్మడి జిల్లాలో మార్పు
పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: చలి మళ్లీ గిలిగింత పెడుతోంది. ప్రజలపై పంజా విసురుతోంది. గడిచిన మూణ్నాలుగు రోజులతో పోలిస్తే గణనీయంగా చలి ప్రభావం పెరిగింది. గురువారం తెల్లవారు జామునుంచే బలమైన గాలులతోపాటు పొగమంచు నాలుగు జిల్లాల్లోని వాతావరణాన్ని మార్చేసింది. రాబోవు నాలుగైదు రోజులు కూడా గజగజ వణికే పరిస్థితులుంటాయని ఇప్పటికే రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా ప్రజలంతా మరింత అప్రమత్తమవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. ఇళ్లల్లో నుంచి బయటకు వస్తే ఒళ్లు జలధరించేలా ఇగం ఇంతకింతకు తన జోరుని పెంచుతోంది. ముఖ్యంగా జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో చలితీవ్రతకు మంట కాచుకునే పరిస్థితులు నెలకొన్నాయి.

అనూహ్యంగా మార్పు..

ఇప్పటికే వాతావరణంలోని మార్పుల వల్ల కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పలువురు చలి ప్రభావంతో జ్వరాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అవస్థల్ని ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళ రోడ్లు కనిపించని విధంగా మంచు పేరుకుపోతుండటంతో వాహనదారులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఈనెల 26వ తేదీన జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 11.7 డిగ్రీలుగా ఉండగా.. గురువారం రాత్రికల్లా నాలుగు జిల్లాల్లో 10 డిగ్రీలోపునకు ఉష్ణోగ్రతల స్థాయి పడిపోయింది. జనవరి మొదటి వారం నుంచి చలి తగ్గుముఖం పట్టి సాధారణ స్థితికి వచ్చింది. ఇటీవల నాలుగు రోజులుగా మాత్రం క్రమంగా ఇగం పెరిగింది. నేడు, రేపు కూడా ఇలాంటి విపరీత పరిస్థితినే ప్రజలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరంగా బయటకు వచ్చే వారు మాత్రం విధిగా తగు జాగ్రత్తల్ని రక్షణ పరంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్తమా సహా ఇతర ఇబ్బందులు పడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని