logo

బడి మొదలైనా.. దుస్తులు రావాయే..!

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏటా పంపిణీ చేసే ఏకరూప దుస్తుల కార్యక్రమం ఆలస్యం జరగనుంది. పాఠశాల విద్యాశాఖ టెస్కో నుంచి సేకరించి విద్యార్ధులకు అందించాలి. రాష్ట్రవ్యాప్తంగా 26.79 లక్షల మందికి ఏకరూప దుస్తులు అవసరమని గతేడాది పాఠశాల

Published : 24 Jun 2022 04:25 IST

విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన

‘ఈ చిత్రం.. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోని పదోతరగతి ఏ-సెక్షన్‌లోని విద్యార్థులు. ఇందులో 51 మంది విద్యార్థులున్నారు. వీరిలో నలుగురు విద్యార్థులు మినహా ఎవరికి ఏకరూప దుస్తులు లేవు. ఈ పాఠశాలలో పదోతరగతిలో 160 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది కొత్తగా చేరిన ముగ్గురు విద్యార్థులు మినహా అంతా పూర్వ విద్యార్థులే ఉన్నారు.’

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏటా పంపిణీ చేసే ఏకరూప దుస్తుల కార్యక్రమం ఆలస్యం జరగనుంది. పాఠశాల విద్యాశాఖ టెస్కో నుంచి సేకరించి విద్యార్ధులకు అందించాలి. రాష్ట్రవ్యాప్తంగా 26.79 లక్షల మందికి ఏకరూప దుస్తులు అవసరమని గతేడాది పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అందులో ఉమ్మడి జిల్లాలో 2.26 లక్షల మంది ఉన్నారు.  పదిరోజుల  కిందటే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యాలయాలకు చాలా మంది సాధారణ దుస్తుల్లోనే వస్తున్నారు. రెండేళ్లుగా ప్రైవేటు పాఠశాల నుంచి వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వారం రోజుల బడిబాటలో 7వేల పైచిలుకు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. ఈ నెలాఖరులోగా వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నిరుపేద కుటుంబాల వారు ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇస్తారని ఆశపడి తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది.

కరోనా వ్యాప్తితో విద్యాసంవత్సరం రెండేళ్లుగా గాడితప్పింది. పరోక్ష తరగతులతో కాలం వెళ్లదీశారు. 2020-21 విద్యా సంవత్సరానికి అంతకు ముందే సేకరించిన వస్త్రాన్ని పంపిణీ చేశారు. ఏటా విద్యా సంవత్సరం ముగిసే నాటికే వస్త్రాన్ని సేకరించేందుకు (టెస్కో) తెలంగాణ చేనేత సహకార సంస్థకు ఆర్డర్‌ ఇస్తుంది. 2021-22లోనూ పరోక్ష తరగతులు కొనసాగుతుండటంతో ఏకరూప దుస్తులు అవసరం లేదని విద్యాశాఖ భావించినట్లుంది. అందుకే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇచ్చిన ఆర్డర్లను ఉత్పత్తి ప్రారంభంలోనే నిలిపివేయాలని ఉత్తర్వులిచ్చింది. ప్రతి ఏటా జూన్‌లోపు వస్త్రాన్ని సేకరిస్తారు. మండలాల వారీగా పంపిణీచేస్తారు. అక్కడి ఏజెన్సీలతో కుట్టించి బడులు తెరిచేనాటికి సిద్ధం చేస్తారు. ఈ ఏడాది ఏకరూప దుస్తుల పంపిణీపై జిల్లా విద్యాశాఖ నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖలు పంపారు. దీనిపై స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ జిల్లాలవారీగా దుస్తుల పంపిణీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు జతల దుస్తులు అందించాల్సిన విద్యార్థులకు తొలుత ఒక జత ఇవ్వనున్నారు. కానీ పాఠశాలలకు ఇంకా వస్త్రం చేరలేదు. ఒకవేళ ఇప్పుడు వస్త్రం వచ్చినా వాటిని కుట్టించి అందజేసే సరికి మరింత సమయం పడుతుంది.  పూర్తిస్థాయిలో దుస్తులు అందటానికి ఈ విద్యాసంవత్సరం సగం పూర్తయ్యేలా ఉంది.

వీర్నపల్లి ప్రాథమిక పాఠశాలలోని ఏకరూప

దుస్తులులేని నాల్గవ తరగతి విద్యార్థులు 

ఆర్డర్లు తీసుకోవడంలో జాప్యం

నూలు ధరలు పెరగడం.. టెస్కో పాత ధరలకు సేకరిస్తే వస్త్రం ఉత్పత్తి గిట్టుబాటు కాదని సిరిసిల్లలోని పరిశ్రమ వర్గాలు ఆర్డర్లు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నాయి. ఏప్రిల్‌లో 1.02 కోట్ల మీటర్ల వస్త్రం ఆర్డర్లు వచ్చాయి. ధరల విషయంలో పరిశ్రమ వర్గాలు, అధికారులు పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఉత్పత్తి చేసిన వస్త్రం టెస్కోకు అప్పగించే సమయంలో నూలు కొనుగోలు చేసిన బిల్లును సమర్పించాలి. దాని ప్రకారం వస్త్రం ధర చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో వారం రోజులుగా ఆర్డర్లు తీసుకునేందుకు పరిశ్రమ వర్గాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికీ 70శాతం ఆర్డర్లను 73 మాక్స్, 63 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లు తీసుకున్నాయి. నూలు కొనుగోలులో జాప్యం జరుగుతోంది. పాఠశాల వస్త్రం ఉత్పత్తికి 67శాతం పాలిస్టర్, 33 శాతం కాటన్‌ నూలును వినియోగించాలి. గతేడాదితో పోల్చితే నూలు ధరలు సగటున 30-40 శాతం పెరిగాయి. టెస్కో సేకరణ ధరలు కొలతలను బట్టి షూటింగ్‌ మీటరుకు రూ.62.50, రూ.82, షర్టింగ్‌ రూ.42, ఓనీ రూ.37.40గా ఉంది. ఈ విషయమై చేనేత, జౌళీశాఖ ఏడీ సాగర్‌ ‘ఈనాడు’తో మాట్లాడారు. గతేడాది ఉత్పత్తి చేసిన 40 లక్షల మీటర్లు టెస్కోకు అప్పగించాం. ఉత్పత్తి జరుగుతున్నదాన్ని బట్టి ఏరోజుకారోజు సేకరిస్తున్నాం. మొత్తం లక్ష్యాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేసేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని