logo
Published : 28 Jun 2022 05:38 IST

మృత్యువులోనూ వీడని స్నేహబంధం

ఇద్దరు యువకుల సజీవ దహనంతో విషాదం

సుమంత్‌ ఇంటి వద్ద బంధువులు

కోరుట్ల, మెట్‌పల్లిగ్రామీణం, న్యూస్‌టుడే: వాళ్లిద్దరు స్నేహితులు. అప్పటివరకు సరదాగా గడిపారు. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాద రూపంలో ఇద్దరు యువకులను బలి తీసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి ఇద్దరు అగ్నికి ఆహుతయ్యారు. ఈ విషాద సంఘటన రెండు కుటుంబాల్లో పుత్రశోకం మిగిల్చింది. మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన మండలోజు అనిల్‌(26), కోరుట్లకు చెందిన బెజ్జారపు సుమంత్‌(23) సమీప బంధువులవడంతో పాటు ఇద్దరు కలిసిమెలిసి స్నేహంగా తిరిగేవారు. ఆదివారం రాత్రి మెట్‌పల్లి నుంచి పని నిమిత్తం ఆర్మూర్‌ వైపు కారులో ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు నిజామాబాద్‌ జిల్లా వేల్పూరు క్రాస్‌ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. కారు పల్టీలు కొట్టడంతో మంటలు చెలరేగి ఇద్దరు కారులోనే సజీవ దహనమయ్యారు.

చేదోడు వాదోడుగా ఉంటాడనుకుంటే..

మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన మండలోజు లక్ష్మినర్సయ్య, విజయ దంపతులకు కుమారుడు అనిల్‌(26)తో పాటు ఇద్దరు కూతుళ్లు. తండ్రి స్థానికంగా చిన్నపాటి రైస్‌మిల్‌ నడుపుతుండగా, డిగ్రీ చదివిన అనిల్‌ మెట్‌పల్లిలో జువెల్లర్స్‌ నిర్వహిస్తున్నాడు. దుకాణం నిర్వహణతో అనిల్‌ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుండగా, కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు కడ చూపునకు కూడా నోచుకోకుండా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. జులై 1న అనిల్‌ పుట్టిన రోజు ఉండడంతో దాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.


రోదిస్తున్న అనిల్‌ తల్లి, బంధువులు

ఉన్నతంగా ఎదుగుతాడనుకుంటే..

కోరుట్ల పట్టణానికి చెందిన బెజ్జారపు శ్రీనివాస్‌, మాధురి దంపతులకు కుమారుడు సుమంత్‌(23), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సుమంత్‌ మహారాష్ట్రలోని నాసిక్‌లో బీఎస్సీ (డయాలసిస్‌ టెక్నాలజీ) కోర్సు చదువుతున్నాడు. ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని మెడినొవా ఆసుపత్రిలో శిక్షణ పొందుతున్నాడు. నెల రోజుల్లో శిక్షణ పూర్తి కానుంది. శిక్షణ అనంతరం ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా నిలబడతాడని అనుకున్నంతలోనే ప్రమాదంలో సుమంత్‌ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవల ఇంటికి వచ్చిన సుమంత్‌ స్నేహితుడితో సరదాగా గడిపేందుకు వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇరువురు స్వర్ణకారులు కావడంతో కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో స్వర్ణకార దుకాణాలను మూసివేశారు.

Read latest Karimnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts