logo

అక్రమంగా మట్టి తరలింపు!

ఎస్సారెస్పీ వరద కాలువ మట్టితో అక్రమార్కులకు కాసుల పంట పండుతోంది. రామడుగు మండలంలోని కాలువను ఆనుకొని ఉన్న గ్రామాల నుంచి నిత్యం మట్టి తరలిస్తున్నారు.

Published : 27 Mar 2023 04:55 IST

ప్రభుత్వ ఖజానాకు చిల్లు
న్యూస్‌టుడే, రామడుగు(కరీంనగర్‌ జిల్లా)

షానగర్‌లో మట్టిని తరలిస్తున్న వాహనాలు

స్సారెస్పీ వరద కాలువ మట్టితో అక్రమార్కులకు కాసుల పంట పండుతోంది. రామడుగు మండలంలోని కాలువను ఆనుకొని ఉన్న గ్రామాల నుంచి నిత్యం మట్టి తరలిస్తున్నారు. 2005లో తవ్విన కాలువకు ఇరువైపులా భారీ స్థాయిలో మట్టి నిలువ చేశారు. సుమారు 15 ఏళ్లుగా ఆ నిల్వలు అలాగే ఉన్నాయి. కానీ రెండేళ్లుగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. కరీంనగర్‌లోని ఇళ్లు, వ్యాపార నిర్మాణాలకు డిమాండ్‌ ఉండటంతో ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. ముందుగా గ్రావిటీ కాలువకు ఒక వైపు మట్టి దిబ్బలను మొత్తంగా ఖాళీ చేశారు. ఇప్పుడు కాలువ మట్టిని తరలిస్తుండగా దిబ్బలు ఖాళీ అయ్యాయి.

ఓ వైపు నిల్వ.. మరో వైపు ఖాళీ..

ఇటీవల మూడో టీఎంసీ కాలువ తవ్వి తిరిగి అదే ప్రదేశంలో మట్టి నిల్వ చేస్తున్నారు. మట్టి దిబ్బలు మళ్లీ పేరుకుపోతుండడంతో అక్రమ తరలింపునకు ఆధారం లేకుండా పోతుంది. నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు తరలి వెళ్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదు. షానగర్‌, రామడుగు, శ్రీరాములపల్లి గ్రామాల గుండా టిప్పర్లు నడుస్తుండటంతో దుమ్ము వ్యాపించి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. దీన్ని అదుపు చేయాలని గ్రామస్థులు గతంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నీటి పారుదల శాఖ అధికారులు, గనుల శాఖల మధ్య సమన్వయం లేదనే కారణంతో చర్యలు తీసుకోలేదు. స్థానికుల నిరసనలు పెరగడంతో దుమ్ము వ్యాపించకుండా మట్టి అక్రమ రవాణాదారులు గ్రామాల్లో ట్యాంకర్లతో రహదారులపై ఉదయం, సాయంత్రం నీటిని చల్లించారు. రామడుగు మోతె వాగు శిథిలం కావడంతో తాత్కాలికంగా మట్టి నింపి రహదారిని పునరుద్ధరించారు. నిబంధన మేరకు కొంత డబ్బులు చలానా రూపంలో చెల్లించి ఇంటి అవసరాలకు అనుమతి పొంది మట్టిని తరలించాల్సి ఉంటుంది. కానీ లోపాయికారి మద్దతుతో వందలాది టిప్పులు అక్రమంగా తరలిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతోందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని