logo

పర్యావరణ హితమే వ్యాపార సూత్రం

సమకాలీన సమస్యలే ఆమెను సొంతంగా పర్యావరణ హిత సంచుల తయారీ పరిశ్రమ ఏర్పాటు వైపు పురిగొల్పాయి. పెద్దపల్లి సుభాష్‌నగర్‌కు చెందిన ఠాకూర్‌ తారాబాయి ఎంఎస్సీ(జువాలజీ) పూర్తి చేశారు.

Updated : 26 May 2023 06:16 IST

పీపీ సంచుల తయారీతో మరికొందరికి ఉపాధి
వ్యాపార రంగంలో రాణిస్తున్న పెద్దపల్లి మహిళ
ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి

సిబ్బందితో కలిసి పీపీ సంచుల తయారీ పనుల్లో తారాబాయి

సమకాలీన సమస్యలే ఆమెను సొంతంగా పర్యావరణ హిత సంచుల తయారీ పరిశ్రమ ఏర్పాటు వైపు పురిగొల్పాయి. పెద్దపల్లి సుభాష్‌నగర్‌కు చెందిన ఠాకూర్‌ తారాబాయి ఎంఎస్సీ(జువాలజీ) పూర్తి చేశారు. ఆమె భర్త రాంచందర్‌షిండే వ్యాపారి కాగా ఆయన స్వస్థలం మహారాష్ట్ర. వీరు కొన్నేళ్లుగా సుభాష్‌నగర్‌లో ఉంటున్నారు. పాలీప్రొప్లీలియన్‌(పీపీ) సంచుల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసిన తారాబాయి తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు.

అంతర్జాలంలో శోధన

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, పర్యావరణహితంగా ఉండే మధ్యతరహా పరిశ్రమను ప్రారంభించాలని తారాబాయి భావించారు. ఈ క్రమంలోనే కూరగాయల మార్కెట్‌ నుంచి ఆధునిక షాపింగ్‌మాల్స్‌ వరకు చేతిసంచుల ప్రాముఖ్యాన్ని తెలుసుకున్నారు. ముందుగా సంచుల తయారీ తీరుపై ఆసక్తితో ప్లాస్టిక్‌ బ్యాగుల తయారీ సంస్థలో చేరారు. 2014లో నెలకు రూ.5 వేల వేతనంతో పని చేస్తూ వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నారు. దాదాపు 5 సంవత్సరాల వరకు అక్కడే విధులు నిర్వహించారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ప్రతి రోజూ పర్యావరణ హిత సంచులపై ఆసక్తితో ఆన్‌లైన్‌లో వెదికారు. ఈ క్రమంలో వచ్చిన ఆలోచనతోనే పాలీప్రొప్లీలియన్‌(పీపీ) సంచుల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు బాటలు పడ్డాయి.ఏమిటీ పీపీ బ్యాగులు!

పీపీ సంచుల ముడి పదార్థాన్ని పెట్రోలియం, సహజ వాయువుల ఉత్పత్తులతో తయారు చేస్తారు. దీనిని సింథటిక్‌ థెర్మోప్లాస్టిక్‌ పాలిమర్‌గా పిలుస్తారు. పాలిథీన్‌, ప్లాస్టిక్‌ సంచులతో పోలిస్తే ఇవి సురక్షితమైనవిగా ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(ఈపీఏ) ధ్రువీకరించింది. పాలిథీన్‌, ప్లాస్టిక్‌ కవర్లు భూమిలో కలిసిపోవు. పాలీప్రొప్లీలియన్‌ సంచులు మాత్రం కలిసిపోతాయి. ఈ సంచుల గరిష్ఠ మన్నిక కాలం 5 సంవత్సరాలు. తక్కువ ధరతో కూడిన వాటిని ఏడాదిలోపే భూమిలో కలిసిపోయేలా తయారు చేస్తారు. ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు కాల్చినపుడు వెలువడే పొగతో దీర్ఘకాలంలో క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదముంది. పీపీ బ్యాగులను కాల్చినా క్యాన్సర్‌ కారకాలు, అవశేషాలు లేవని నిర్ధారించారు. ప్లాస్టిక్‌ సంచులతో పోలిస్తే ధర, మన్నిక, పర్యావరణపరంగా మేలైన ఎంపికగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

నెలకు రూ.6 లక్షల టర్నోవర్‌

2019లో ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్‌ గ్యారెంటీ యోజన(పీఎంఈజీపీ) పథకం కింద రుణం కోసం తారాబాయి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. అత్యాధునిక పంచింగ్‌ మిషన్‌, సెమీ కటింగ్‌ మిషన్‌, రోలింగ్‌ థ్రెడ్డింగ్‌ మిషన్‌ల కొనుగోలు కోసం రూ.13 లక్షల రుణం తీసుకున్నారు. 35 శాతం రాయితీ లభించింది. అదే ఏడాది మొత్తం రూ.20 లక్షల పెట్టుబడితో సుభాష్‌నగర్‌లో మహాలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట యూనిట్‌ స్థాపించారు. రుణం మంజూరుకు ఎక్కువ సమయం పట్టగా కరోనా మహమ్మారితో కొంత ఆలస్యంగా తయారీ కేంద్రం ప్రారంభించారు. ఒడిదొడుకులు, వ్యాపారంలో నష్టాలు చవిచూశారు. మొదట్లో పీపీ బ్యాగులను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో స్థానికులకు ఉచితంగా అందించారు. ఉపయోగించాకే కొనుగోలు చేయాలంటూ వివిధ సంస్థల వద్దకు వెళ్లి మార్కెటింగ్‌ చేశారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. నెలకు రూ.6 లక్షల టర్నోవర్‌తో అన్ని ఖర్చులు పోను రూ.40 వేల వరకు సంపాదిస్తున్నారు. స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరో అయిదుగురు మహిళలకు పని కల్పిస్తున్నారు.

మహారాష్ట్రకు సరఫరా

* ఇక్కడి షాపింగ్‌మాల్స్‌లో ఎక్కువగా వస్త్ర సంచులతో పాటు జనపనార, పాలిథీన్‌ కవర్లు ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్రలో మాత్రం పూర్తిగా పీపీ సంచులనే వాడుతున్నారు. పూర్వీకులు అక్కడే ఉండటం, వ్యాపార సంబంధాలు ఉండటంతో తారాబాయి భర్త రాంచందర్‌ షిండే ఇక్కడ తయారు చేసిన సంచులను అక్కడి షాపింగ్‌మాల్స్‌, సూపర్‌ మార్కెట్లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే పెద్ద ఎత్తున తయారు చేయాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

* ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని బియ్యం మిల్లులు, సిమెంటు పరిశ్రమలు, ఎరువుల తయారీ సంస్థలు, సన్న ఇసుక తయారీ సంస్థలు, వాటర్‌ ప్లాంట్లు, తవుడు బస్తాలు, గోధుమ, ఇతర వ్యాపారులు తమ పీపీ సంచులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు చెప్పారు.

* ఆర్డరు ఇచ్చిన వారి నుంచి సంస్థ పేరు, కోరుకున్న పరిమాణం, డిజైన్లు, రంగులు తదితర వివరాలు తీసుకుంటారు. ఒక్కో సంచి కనిష్ఠంగా రూ.3.80కి, గరిష్ఠంగా రూ.50 వరకు(జీఎస్టీ అదనం) కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు తారాబాయి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు