logo

మంథని నేతలు.. మరో చోట ఎమ్మెల్యేలు

మంథని నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఈ ప్రాంత ఉనికిని చాటారు.

Published : 09 Nov 2023 05:03 IST

న్యూస్‌టుడే, మంథని

మంథని నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికై ఈ ప్రాంత ఉనికిని చాటారు. 1957లో ప్రస్తుతం మంథని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గంగాపురికి చెందిన గడిపల్లి రాములు హుజూరాబాద్‌ ద్విసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 1962లో రాములు కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాలెం మల్లేశం మేడారం నుంచి 1985లో స్వతంత్ర అభ్యర్థిగా, 1994లో తెదేపా నుంచి ఎన్నికయ్యారు. మంథని మండలం ఉప్పట్లకు చెందిన కాసిపేట లింగయ్య 2004లో నేరెళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంథని పట్టణానికి చెందిన సోమారపు సత్యనారాయణ 2009లో రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో భారాస అభ్యర్థిగా విజయం సాధించారు. గడిపల్లి రాములు, మాలెం మల్లేశం, కాసిపేట లింగయ్య ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో మంథనిలో పోటీ చేసే అవకాశం లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి సత్తా చాటారు. సోమారపు సత్యనారాయణ 2004లో మంథని నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించకపోవడంతో రామగుండం వెళ్లి బరిలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని