logo

భాజపా పాలనపై ప్రజల్లో విసుగు

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌లు అన్నారు.

Published : 29 Mar 2024 04:50 IST

గోదావరిఖని, న్యూస్‌టుడే: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌లు అన్నారు. గోదావరిఖనిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో భాజపా పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు చేయలేకపోతోందన్నారు. రైతులకు సాగునీరందించలేని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని ఆరోపించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భారాసను గెలిపించాలన్నారు. భాజపా అధికారంలోకి వస్తే ప్రాథమిక హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారాసను లేకుండా చేయడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారన్నారు. వ్యవసాయమే దండగ అన్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శిష్యుడైన రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో రైతులు సాగునీరు లేకుండా ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  

రైతు సమస్యలపై 36 గంటల దీక్ష

రాష్ట్రంలో 600 మంది ఆబ్కారీ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన సీఎం ఇప్పటి వరకు వారికి ఉద్యోగాలు కల్పించలేదన్నారు. పెదపల్లి పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్‌ ప్రకటించిన అభ్యర్థి ఏ పోరాటం చేశారని టికెట్‌ ఇచ్చారని ప్రశ్నించారు. కోట్ల రూపాయల సంపద ఉన్న కుటుంబానికి దళితులు పోటీ పడే స్థానంలో అభ్యర్థిత్వం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో భారాస ప్రభుత్వం పనిచేసిన సమయంలో రైతులు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన సాగిందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై 36 గంటల నిరసన దీక్ష చేపడుతున్నామని, రైతులంతా ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, బాల్కసుమన్‌, భారాస నాయకులు మురళీధర్‌రావు, కౌశికహరి, పి.టి.స్వామి, పెంట రాజేశ్‌, గోపు ఐలయ్యయాదవ్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని