logo

భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి

తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్‌ పటేల్‌ అన్నారు.

Published : 26 Apr 2024 03:29 IST

గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్‌ పటేల్‌

ఎన్నికలయ్యే వరకు విశ్రమించబోమని కిషన్‌రెడ్డికి మాట ఇవ్వాలని కార్యకర్తలను కోరుతున్న సంజయ్‌

కరీంనగర్‌ పట్టణం, తెలంగాణచౌక్‌, న్యూస్‌టుడే : తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్‌ పటేల్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్‌ పటేల్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నామపత్రాలు సమర్పించారు. అంతకుముందు ఎస్సారార్‌ కళాశాల వద్ద భాజపా ర్యాలీలో గుజరాత్‌ సీఎం మాట్లాడుతూ.. సంజయ్‌కి ఉన్న ప్రజాదరణ చూస్తే ఆయన గెలుపు ఖాయమైందన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్‌ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, భారాస, భాజపా అభ్యర్థుల్లో ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో గుర్తించి గెలిపించాలన్నారు.

విజయం సాధించే వరకు విశ్రమించొద్దు..

మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు పార్టీ శ్రేణులు, అభిమానులు విశ్రమించొద్దని ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. గెలుపే లక్ష్యంగా పని చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడికి మాట ఇవ్వాలని శ్రేణులను కోరారు. కాంగ్రెస్‌, భారాస అభ్యర్థులు ఏనాడూ ప్రజల గురించి పట్టించుకోలేదన్నారు. భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ స్మార్ట్‌సిటీ నిధులు పక్కదారి పట్టినా పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గురించి ఆ పార్టీ కార్యకర్తలే ఆందోళనలో ఉన్నారని, వందల కోట్లు ఖర్చు పెట్టి పార్టీ టికెట్‌ తెచ్చుకున్న ఆ వ్యక్తి ప్రజల కోసం పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని చేతులెత్తి మొక్కుతున్నానని అన్నారు.

ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, జనం

తల్లి ఆశీర్వాదం తీసుకొని..

నామినేషన్‌ వేయడానికి వెళ్లే ముందు బండి సంజయ్‌ తన తల్లి శకుంతలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. చైతన్యపురి మహాశక్తి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయంత్రం కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో మండలాధ్యక్షులు, ఇన్‌ఛార్జులు, ఆపై స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అంతకుముందు అతిథులకు పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, భాజపా జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని