logo

ఓటమి వెనకే విజయం

ఇంటర్‌ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం.

Published : 26 Apr 2024 03:31 IST

సానుకూల దృక్పథం అవసరం
పరీక్షల్లో మార్కులే ప్రామాణికం కాదు
న్యూస్‌టుడే- మేడిపల్లి

ఇంటర్‌ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. తాము మార్కులు సాధించలేకపోయామనీ, ఫెయిల్‌ అయ్యామనీ చాలా మంది విద్యార్థులు కుంగిపోతున్నారు. ఇలాంటి సమయాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

పూజ్య తల్లిదండ్రులారా!

ఒకరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.. మరొకరు తక్కువ సాధించవచ్చు. కానీ పోలిక పెడార్థాలకు కారణమవుతోంది. విద్యార్థుల్లోని సంకల్పాన్ని దెబ్బతీస్తోంది. కార్పొరేట్‌ ప్రపంచంలో విద్యార్థులు ఎంత కుంగిపోతున్నారో ఆలోచించకుండా మార్కుల కోసమే వేచిచూస్తూ పిల్లలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. మీ బిడ్డ ఏదో కారణంతో పరీక్ష తప్పాడనుకోండి.. ఆయన ఓడిపోయినట్లు కాదు. గెలుపు ద్వారాలు తెరుచుకునే ఉన్నాయని భరోసా కల్పించండి. మార్కులే ప్రామాణికం కాదని, పరీక్ష పోయినంత మాత్రాన పరువుకేమీ నష్టం లేదని బోధించండి. విశ్వవ్యాప్తంగా విజేతలెందరో తొలి ఓటమి తర్వాతే ప్రపంచ పటంలో స్థానం సాధించారని వివరించండి. ‘నీ మార్కులతోనే మా ప్రేమ తగ్గిపోదు.. నువ్వంటేనే మాకు ప్రాణమ’ని చెప్పండి. పెనుసవాళ్లు ఎదురైనా మొక్కవోని సంకల్పమే విజేతగా నిలబెడుతుందని ప్రేమగా హితబోధ చేయండి.

ప్రతికూల సందర్భాల్లో...

  • మార్కులు ప్రాతిపదిక కాదు అనే విషయాన్ని తల్లిదండ్రులు విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలి.
  • పరీక్ష తప్పగానే జీవితంలో ఏదో కోల్పోయామనే భావన రాకుండా చూడాలి.
  • మళ్లీ చదివితే పాస్‌ కావడం, జీవితంలో స్థిరపడటం చాలా సులువు అని వివరించాలి.          
  • తక్కువ మార్కులు వచ్చిన వారిని, ఫెయిల్‌ అయిన వారిని ఏమీ అనకూడదు.

మచ్చుకు కొన్ని విజయగాథలు

  • కెనడా వేదికగా జరిగిన ఫిడే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత యువ సంచలనం గుకేశ్‌ టైటిల్‌ నెగ్గాడు. ఓటమి అనంతరం విజయతీరాలకు చేరిన గుకేశ్‌ స్పందిస్తూ... ‘నేను ఈ టోర్నీ ప్రారంభం నుంచి సానుకూలంగా సాగాను. కానీ ఏడో రౌండ్‌లో అలీరెజాపై ఓటమితో కలత చెందాను. ఆ పరాజయమే నాకు శక్తిని, ప్రేరణను ఇచ్చింది. ఓటమి తర్వాత సరైన మానసిక స్థితిలో ఉంటే విజయం సాధిస్తానని నాకు తెలుసు. సరైన ఆలోచనలతో చెస్‌ ఆడాను. విజేతగా నిలిచాను. ఈ క్షణాలు అద్భుతంగా ఉన్నాయి’ అని తెలిపారు.
  • మహారాష్ట్ర థానేకు చెందిన విశాల్‌ అశోక్‌ కరాద్‌ అనే పదో తరగతి విద్యార్థికి అన్ని పరీక్షల్లో 35 మార్కులే వచ్చాయి. అంతమాత్రాన తల్లిదండ్రులు బాధపడలేదు. ఎక్కువ మార్కులు వచ్చిన వారితో తమ కుమారుడిని పోల్చలేదు. పైగా కేకు తెప్పించారు. సెలబ్రేషన్స్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వారు షేర్‌ చేసిన వీడియో గత సంవత్సరం వైరల్‌గా మారింది.
  • కర్నూలుకు చెందిన అంజలి శర్వాణి ఇంటర్‌లో ఫెయిల్‌ అయినా కుంగిపోలేదు. ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి రైల్వేలో ఉద్యోగం సాధించారు. క్రికెట్‌పై తనకున్న మక్కువతో రాత్రింబవళ్లూ శ్రమించి భారత మహిళా క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించారు. ఇటీవల ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో యూపీ వారియర్స్‌ జట్టుకు ఆమెను ఎంపిక చేస్తూ యజమానులు రూ.55 లక్షలు చెల్లించడంతో వార్తల్లో నిలిచారు.
  • గుజరాత్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి తుషార్‌ సుమేరా రెండేళ్ల క్రితం తన పదో తరగతి మార్కులను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఆంగ్లంలో 35, గణితంలో 36, సైన్స్‌లో 38 మాత్రమే వచ్చాయనీ, అయినా తన లక్ష్యాన్ని తాను చేరుకున్నాననీ వివరించారు.
  • ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన పిట్ల దీపక్‌ 2017లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. తండ్రి టీవీ మెకానిక్‌గా పనిచేస్తూ కుమారుడిని చదువులో ప్రోత్సహించాడు. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే ఎస్‌.ఐ. ఉద్యోగానికి పరీక్ష రాశాడు. ఒకసారి గురి తప్పింది. రెండోసారీ లక్ష్యం నెరవేరలేదు. అయినా ఆయన కుంగిపోలేదు. మూడో ప్రయత్నంలో ఇటీవలే ఎస్సైగా ఎంపికయ్యాడు.
  • పెగడపల్లి మండలం ల్యాగలమర్రికి చెందిన పుప్పాల మమత కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగింది. డిగ్రీ లెక్చరర్‌, జూనియర్‌ లెక్చరర్‌, పీజీటీ, టీజీటీ, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించి ఔరా అనిపించారు.

నైపుణ్యాన్ని గుర్తించాల్సింది తల్లిదండ్రులే

ప్రతి మనిషికి 10 రకాల తెలివితేటలు ఉంటాయి. విద్యార్థులు ఎన్నిసార్లు చదివితే గుర్తుంటుందో బేరీజు వేసి చదివిస్తే కచ్చితంగా పాస్‌ అవుతారు. ఒకవేళ వరుసగా విఫలమైతే వారిని ఇతర మార్గాల వైపు మళ్లించాలి. విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే ఇతరుల కంటే ఉన్నతంగా ఎదుగుతారు. విద్యార్థులు కూడా పరీక్ష అనగానే ఓటమిలా భావించకుండా గెలుపునకు మెట్టుగా భావించాలి.

డాక్టర్‌ వీరేందర్‌, మనోవికాస నిపుణుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని