logo

చోరీ కేసు నిందితుడి అరెస్టు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు.

Published : 03 May 2024 03:12 IST

కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. జనవరి 31న అప్పారావుపేట గ్రామానికి చెందిన రొండ్ల ప్రమీల తీర్థయాత్రలకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి తాళం పగులగొట్టి 30 గ్రాముల బంగారు గొలుసు, పది గ్రాముల బంగారు బిస్కెట్‌, 160 గ్రాముల వెండి, 150 గ్రాముల వెండి పాదరక్షలు, డైమండ్‌ చెవి రింగులు, సుమారు రూ.10 వేల నగదు చోరీ చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు జగిత్యాల జిల్లాలోని దొంగలమర్రి చెక్‌పోస్టు వద్ద గురువారం ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా వెళ్తూ కనిపించగా ఎస్సై సందీప్‌ వెంబడించారు. ముగ్గురు వ్యక్తుల్లో ఒకరైన హనుమకొండ జిల్లా గోపాల్‌పూర్‌(నయీంనగర్‌)కు చెందిన పాశం పవన్‌ను పట్టుకోగా మిగతా ఇద్దరు మహబూబ్‌నగర్‌ జిల్లా రాజపేటకు చెందిన రథాస్వామి, మహబూబ్‌నగర్‌ పట్టణానికి చెందిన అంజి పరారైనట్లు తెలిపారు. ముగ్గురు కలిసి గతంలో పలు చోరీల్లో నిందితులుగా ఉన్నారని, పవన్‌ వద్ద ఒక జత వెండి పట్టా గొలుసులు, చరవాణి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు సీఐ వివరించారు.


భూకబ్జాకు యత్నం.. ఇద్దరిపై కేసు

చొప్పదండి, న్యూస్‌టుడే: తప్పుడు పత్రాలతో భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన ముద్దసాని కొమురయ్య, లంక శేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రుక్మాపూర్‌కు చెందిన ముద్దసాని రంగయ్య, వంగ నరేష్‌, చొప్పదండికి చెందిన గుర్రం రాజేందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి 2017లో లంక రాజయ్య 35 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. సదరు భూమి తనదంటూ ముద్దసాని రాజయ్య కోర్టును ఆశ్రయించగా నలుగురు లోక్‌అదాలత్‌లో రాజీ కుదుర్చుకున్నారు. అనంతరం సదరు భూమి అమ్ముకోవడానికి ఏమైనా అభ్యంతరాలుంటే సంప్రదించాలని పత్రిక ప్రకటన ఇచ్చారు. ఆ భూమిని రుక్మాపూర్‌కు చెందిన కొమురయ్య, శేఖర్‌ 2013లో రాజయ్య దగ్గర కొనుగోలు చేసినట్లు సాదాబైనామా కాగితాన్ని సృష్టించి.. భూమిపై తమకే హక్కు ఉందని పత్రిక ప్రకటన ఇచ్చారు. రంగయ్య ఫిర్యాదు మేరకు కొమురయ్య, శేఖర్‌లపై కేసు నమోదు చేసి.. కొమురయ్యను అరెస్టు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


పోలీసు కస్టడీకి నలుగురు  భూ ఆక్రమణ నిందితులు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నకిలీ పత్రాలు సృష్టించి భూ ఆక్రమణకు పాల్పడిన నలుగురిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని గురువారం విచారించినట్లు కరీంనగర్‌ రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. తన భూమిపై కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించమే కాకుండా, పలు విధాలుగా బెదిరింపులకు పాల్పడినట్లు బ్యాంక్‌కాలనీకి చెందిన దొమ్మటి యుగేందర్‌ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్‌ సుదగోని మాధవి, ఆమె భర్త కృష్ణగౌడ్‌, కొత్త జయపాల్‌రెడ్డి, మున్సిపల్‌ ఆర్‌ఐ జంకే శ్రీకాంత్‌, బిల్‌ కలెక్టర్‌ కొత్తపల్లి రాజుతో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో మహ్మద్‌ ఫిరోజ్‌ఖాన్‌, కాంపల్లి రామాంజనేయులు, జంకే శ్రీకాంత్‌, కొత్తపల్లి రాజులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైల్లో ఉన్న నలుగురిని గురువారం పోలీసులు కస్టడీకి తీసుకొని వారి ఇళ్లను సోదాలు చేశారు.


బుల్డోజర్‌ ముఠా సభ్యులు...

కరీంనగర్‌ నేరవార్తలు : నకిలీ ఇంటి పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుల ఇళ్లను కూల్చివేసి భయాందోళనకు గురి చేసిన బుల్డోజర్‌ ముఠా సభ్యులను కోర్టు అనుమతితో గురువారం కస్టడీలోకి తీసుకొని విచారించినట్లు కరీంనగర్‌ రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. కరీంనగర్‌ ఆదర్శనగర్‌కు చెందిన మహ్మద్‌ లతీఫ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలరాజు రత్నాకర్‌, చందా శంకర్‌రావు, బకిట్ సాయి, పిట్టల మధు, షాహిద్‌ ఖాన్‌లను అరెస్టు చేసి జైలుకు పంపించారు. గురువారం జైల్లో ఉన్న వారిని కస్టడీకి తీసుకొని విచారించినట్లు సీఐ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని