logo

ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు యువకుల దుర్మరణం

ట్రాక్టర్‌ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని ముత్యంపేటలో మంగళవారం చోటుచేసుకుంది.

Published : 08 May 2024 04:48 IST

గొండ రాజేశ్‌, షేక్‌ హైమద్‌

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: ట్రాక్టర్‌ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని ముత్యంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యంపేట గ్రామశివారులోని చెరువు నుంచి వ్యవసాయ భూములకు ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నారు. డి-29 ఎస్సారెస్పీ కాలువ గట్టుపై నుంచి ట్రాక్టర్‌ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తాకొట్టింది. ఈ సంఘటనలో ముత్యంపేటకు చెందిన డ్రైవర్‌ గొండ రాజేశ్‌(25), హుస్సేన్‌నగర్‌కు చెందిన షేక్‌ హైమద్‌(18) ట్రాక్టర్‌ ఇంజిన్‌ కింది భాగంలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై కిరణ్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్‌ సాయంతో ట్రాక్టర్‌ను తొలగించి మృతదేహాలను బయటకు తీయించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

పెద్ద దిక్కు కోల్పోయి..

నిర్మల్‌ జిల్లా కడెం ప్రాంతానికి చెందిన ఆత్రం రాజేశ్‌ కుటుంబం 25 ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం ముత్యంపేట గ్రామానికి వచ్చింది. రాజేశ్‌ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి జంగు చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించగా తల్లి నాలుగేళ్లుగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైంది. రాజేశ్‌ కష్టమే కుటుంబానికి ఆధారం. కూలీ పనులతో వచ్చే ఆదాయం సరిపోవడం లేదని ట్రాక్టర్‌ డ్రైవింగ్‌ నేర్చుకుని నడుపుతున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ కాలువలోకి దూసుకెళ్లి మరణించగా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ప్రస్తుతం తల్లి సావిత్రి ఒంటరిగా మారింది. అందరితో కలివిడిగా ఉండే రాజేశ్‌ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.    

పది పాసైన వారం రోజులకే..

ట్రాక్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హైమద్‌ ఇటీవల వెల్లడైన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. వేసవి సెలవుల దృష్ట్యా ఇంటి వద్ద ఉంటూ మంగళవారం రాజేశ్‌తో కలిసి మట్టి తరలించేందుకు ట్రాక్టర్‌పై వెళ్లాడు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో హైమద్‌ మృతితో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి షేక్‌ అలీ, తల్లి హుస్సేన్‌బీ రాళ్లు కొట్టుకుని వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. హైమద్‌కు అన్న, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.


వడదెబ్బతో నేత కార్మికుడి మృతి

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గణేశ్‌నగర్‌కు చెందిన నేత కార్మికుడు బేతి కిష్టయ్య (70) వడదెబ్బతో మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కిష్టయ్య సాంచలు నడుపుతున్న సమయంలో రెండు రోజుల కిందట వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తెలిపారు. అతనికి భార్య రాజవ్వ, కూతురు మమత, కుమారుడు సంపత్‌ ఉన్నారు.


ఈతకు వెళ్లి వలస కూలీ...

తిమ్మాపూర్‌ : ఉపాధి కోసం వచ్చిన యువకుడు మానేరు వాగులో సరాదాగా ఈతకెళ్లి నీటమునిగి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ బాలనగర్‌లోని స్నేహపురి కాలనీకి చెందిన సింగారం రమేశ్‌ (28).. కొంతమంది యువకులతో కలిసి కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ నిమిత్తం ఫ్లెక్సీలు కట్టడానికి సోమవారం వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం ఫ్లెక్సీలు కట్టిన అనంతరం ఎండ ఎక్కువగా ఉందని యువకులంతా కలిసి ఎల్‌ఎండీ జలాశయంలోకి ఈతకు వెళ్లారు. రమేశ్‌ ఈత కొట్టుకుంటూ కొద్దిదూరం వెళ్లి స్నేహితులు చూస్తుండగానే నీటమునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ ఎస్సై చేరాలు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  


ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైతు ఆత్మహత్య

శంకరపట్నం: మండలంలోని అంబాల్‌పూర్‌ గ్రామానికి చెందిన రైతు గొల్లెన సమ్మయ్య (53) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. కేశవపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి కథనం ప్రకారం.. సమ్మయ్య వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. నిర్మాణానికి అప్పులు పెరిగిపోవడంతో ఆందోళన చెందిన సమ్మయ్య.. ఈ నెల 5న ఇంట్లో పురుగు మందు తాగారు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. ఈ మేరకు సమ్మయ్య కుమారుడు సురేందర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు