logo

ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ నిఘా

సార్వత్రిక ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది.

Published : 10 May 2024 01:12 IST

కొలిక్కి వచ్చిన సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల జాబితా

సుల్తానాబాద్‌ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: సార్వత్రిక ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఎలాంటి ఘర్షణలు, అసాంఘిక శక్తులకు తావులేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టింది. లోక్‌సభ పరిధిలో సమస్యాత్మక, తీవ్రవాద ప్రాబల్య పోలింగ్‌ కేంద్రాల జాబితా కొలిక్కి వచ్చింది. గత సంఘటనలను పరిగణనలోకి తీసుకుని పోలీసుల సహకారంతో జాబితాపై ఆమోద ముద్ర వేశారు. ఆయా పోలింగ్‌ కేంద్రాలపై పోలీసులు డేగ కన్ను వేయనున్నారు. అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నారు. అల్లర్లు, ఘర్షణలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేసేందుకు సమాయత్తమవుతున్నారు.

ఆరా తీసి.. జాబితా సిద్ధం చేసి

ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఓటు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తోంది. ఘర్షణలు, అల్లరిమూకల ప్రభావం, వర్గాల మధ్య దాడులు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్యాత్మక, తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలుగా నిర్ధారించారు. క్షేత్ర స్థాయిలో పోలింగ్‌ కేంద్రాలను అధికారులు పరిశీలించి రూపొందించిన జాబితాను ఎన్నికల సంఘానికి నివేదించారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో 1,850 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా వీటిలో 251 సమస్యాత్మకం, 38 తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలు కలుపుకొని 289 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు.

భద్రత కట్టుదిట్టం

లోక్‌సభ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్‌భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల మండలాలున్నాయి. జయశంకర్‌భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అడవులు ఎక్కువగా ఉండటంతో తీవ్రవాద ప్రాబల్య జాబితాలో చేర్చారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లో అదనపు పోలీసు బలగాల పహారా కొనసాగనుంది. పోలింగ్‌ కేంద్రాల బయట ప్రాంతంలో సీసీ కెమెరాలు బిగించనున్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈవీఎంలు సురక్షితంగా స్ట్రాంగ్‌ రూంకు చేరే వరకు భద్రత చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు