logo

కరీంనగర్‌ జిల్లాలో రూ.16.92 లక్షల పట్టివేత

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్‌ కమిషనరేట్ వ్యాప్తంగా గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మొత్తం రూ.16,92,300 నగదును స్వాధీనం చేసుకున్నారు.

Published : 10 May 2024 01:18 IST

వెండి సామగ్రి చూపుతున్న పోలీసులు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్‌ కమిషనరేట్ వ్యాప్తంగా గురువారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో మొత్తం రూ.16,92,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌ ఒకటో ఠాణా పరిధిలోని రాజీవ్‌చౌక్‌ వద్ద జరిగిన వాహన తనిఖీల్లో అశోక్‌నగర్‌కు చెందిన నార్ల నరేష్‌ ఎలాంటి పత్రాలు లేకుండా రూ.1.60 లక్ష నగదును ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా పట్టుకున్నారు. కమాన్‌ ప్రాంతానికి చెందిన విజయ్‌ రాఘవన్‌ విబిన్‌ వద్ద లభించిన రూ.2.40 లక్షల నగదుకు ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో వాటిని సీజ్‌ చేసినట్లు సీఐ సరిలాల్‌ తెలిపారు. కరీంనగర్‌ మూడో ఠాణా పరిధిలోని కావువాడ చౌరస్తా వద్ద బహదూర్‌ఖాన్‌ పేటకు చెందిన టి.సంజీవ్‌ వద్ద రూ.3,76,300 స్వాధీనం చేసుకున్నారు. నాఖాచౌరస్తా వద్ద కిసాన్‌నగర్‌కు చెందిన జె.రమేష్‌ వద్ద రూ.2,05,000 పట్టుకున్నారు. కోర్టుచౌరస్తా వద్ద నిర్వహించిన తనిఖీల్లో విద్యానగర్‌కు చెందిన పౌలోజు నందం వద్ద రూ.1.75 లక్షలు, వావిలాలపల్లి చెందిన జె.శ్రీనివాస్‌ వద్ద రూ.లక్ష నగదు పట్టుకున్నట్లు సీఐ జాన్‌రెడ్డి తెలిపారు. పట్టుబడిన నగదును ఎన్నికల పర్యవేక్షణ త్రిమెన్‌ కమిటీకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్‌ కోర్టు చౌరస్తా వద్ద తనిఖీల్లో గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన కట్ట శ్రీనివాసచారి వద్ద రూ.4,36,300 నగదును పట్టుకున్నట్లు సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. ఆధారాలు చూపకపోవడంతో ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. 

రూ.3 లక్షల వెండి భరిణెలు...

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసులు 132 వెండి కుంకుమ భరిణెలను పట్టుకున్నారు. రెండో ఠాణా సీఐ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. కరీంనగర్‌ రెండో ఠాణా పోలీసులు రాజీవ్‌చౌక్‌ సమీపంలో గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నెలపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల గొప్పరాజు రెండు చేతి సంచులను పట్టుకొని అనుమానాస్పదంగా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో పోలీసులు విచారించారు. సంచుల్లో రూ.3 లక్షల విలువగల 132 కుంకుమ భరిణెలను గుర్తించారు. కరీంనగర్‌కు చెందిన ఓ పార్టీ అభ్యర్థి తరఫున వీటిని కొనుగోలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. బహుమతులను ఎన్నికల పర్యవేక్షణ అధికారులకు పోలీసులు అప్పగించారు.

రూ.1.14 లక్షల విలువైన వస్త్రాలు..

కరీంనగర్‌ రాజీవ్‌చౌక్‌ వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో ఆటోలో తరలిస్తున్న రూ.1.14 లక్ష విలువైన వస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఒకటో ఠాణా సీఐ సరిలాల్‌ తెలిపారు. వాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఎన్నికల పర్యవేక్షణ అధికారులకు అప్పగించామన్నారు.


ట్రాక్టర్‌ బోల్తా.. డ్రైవర్‌ దుర్మరణం

ప్రశాంత్‌

జూలపల్లి, న్యూస్‌టుడే : సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌ శివారులో ఈ నెల 5న ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృతిచెందారు. 7న జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ముత్యంపేటలో ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటనలు మరువక ముందే జూలపల్లిలో మరో విషాదం నెలకొంది. జూలపల్లి ఎస్సై శ్రీధర్‌ కథనం మేరకు.. కాచాపూర్‌ గ్రామానికి చెందిన పుట్ట ప్రశాంత్‌ (32) ట్రాక్టర్‌ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజూలాగే గురువారం కూడా వరి కోస్తున్న హార్వెస్టర్‌ వద్దకు ధాన్యం నింపుకోవడానికి వెళ్లే క్రమంలో ఊర చెరువు వద్ద చిన్న కల్వర్టుపై అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తాపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శ్రీలత, ఇద్దరు చిన్నారులు రేవంత్‌, మణికంఠలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


చేపల వేటకు వెళ్లి విద్యుదాఘాతంతో మృత్యువాత

ఎల్లారెడ్డిపేట, న్యూస్‌టుడే: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ముత్యాల బాలకృష్ణ (35) గురువారం మానేరువాగులో చేపల వేటకు వెళ్లి, విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. బాలకృష్ణ కూలీ పని చేసుకుంటూ జీవించేవాడు. అదే గ్రామానికి చెందిన బొమ్మిడి శంకర్‌, పూటకుల్ల సుధీర్‌లతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. కరెంటు కనెక్షన్‌ తీసుకొని చేపలు పడుతున్న సమయంలో తీగను పట్టుకున్న బాలకృష్ణ విద్యుదాఘాతంతో వాగులోనే చనిపోయాడు. మృతుడి భార్య కావ్య ఫిర్యాదు మేరకు బొమ్మిడి శంకర్‌, పూటకుల్ల సుధీర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్‌ పేర్కొన్నారు. మృతుడికి భార్య కావ్య, పిల్లలు సహస్ర, లాస్య, అఖిల్‌తేజ్‌ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.


ఆరుగురు వాహనదారులకు జైలు శిక్ష

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనంతో పట్టుబడిన ఆరుగురికి కరీంనగర్‌ కోర్టు జైలు శిక్ష విధించినట్లు గురువారం ట్రాఫిక్‌ సీఐ కరీంఉల్లాఖాన్‌ తెలిపారు. ఒకరికి పది రోజులు, మరొకరికి ఏడు రోజులు, ఇంకొకరికి అయిదు రోజులు, ముగ్గురికి మూడు రోజుల జైలు శిక్ష, 12,500 జరిమానా, మరో 19 మందికి రూ.32 వేల జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు