logo

వలసజీవి సంక్షేమానికి బాటలేయండి

గల్ఫ్‌ ఏజెంటు మోసం చేశాడని ఇటీవల జగిత్యాలలో వందలాది మంది యువకులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు.

Published : 10 May 2024 01:27 IST

మెరుగైన ప్రవాసీ విధానంతోనే ప్రయోజనం
ప్రభుత్వ చర్యలతోనే గల్ఫ్‌ బాధితులకు ఊరట

గల్ఫ్‌ బయల్దేరిన వ్యక్తికి వీడ్కోలు  పలుకుతున్న కుటుంబ సభ్యులు

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు: గల్ఫ్‌ ఏజెంటు మోసం చేశాడని ఇటీవల జగిత్యాలలో వందలాది మంది యువకులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. మరోవైపు జిల్లాకు చెందిన 50 మంది విదేశాలకు వెళ్లి వీసా సరిగ్గా లేక అక్కడి విమానాశ్రయం నుంచే తిరిగొచ్చారు.
ఉపాధి కోసం కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి విదేశాల బాట పట్టే పేదల బతుకులు దుర్భరంగా మారాయి. ఏజెంట్ల చేతిలో మోసాలకు గురి కావడం పరిపాటిగా మారింది. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏటా వేలాది మంది గల్ఫ్‌ బాట పడుతున్న నేపథ్యంలో వారి సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

కేరళ విధానాలు అనుసరణీయం

కొన్ని దేశాల్లో మూడు నాలుగేళ్లకోసారి క్షమాభిక్ష(ఆమ్నెస్టీ) ప్రకటిస్తారు. ఈ నిబంధన ప్రకారం గల్ఫ్‌ దేశాల్లో అక్రమంగా నివాసం ఉన్నవారు దేశం విడిచి వెళ్లాలి. కష్టపడితే గాని పూట గడవని పేదలు ఆమ్నెస్టీ సమయంలో ఇంటికి ఎలా రావాలో తెలియక సతమతమవుతున్నారు. కేరళ ప్రభుత్వం ఆమ్నెస్టీ సమయంలో వలసజీవులకు తగిన సాయం చేస్తుండగా తెలంగాణ సర్కారు కొంతవరకే అందిస్తోంది.

ఆ దేశాల్లో 3 లక్షల మంది

జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలతో పాటు వేములవాడ, చొప్పదండి సెగ్మెంట్ల పరిధిలోని పలు మండలాలు, ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో గల్ఫ్‌కు వెళ్తున్నారు. యూఏఈ, బెహరాన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతర్‌, సౌదీ అరేబియా తదితర దేశాలతో పాటు సింగపూర్‌, మలేషియా, ఆఫ్ఘనిస్థాన్‌, ఇజ్రాయెల్‌, ఇరాక్‌ తదితర దేశాల్లో దాదాపు 3 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.

వీసా మోసాలను అరికట్టాలి

స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక యువత గల్ఫ్‌ బాట పడుతున్నారు. వీరి అవసరాలే అదనుగా ఏజెంట్లు మోసానికి పాల్పడుతున్నారు. గతంలో ఒకరి పాస్‌పోర్టుపై మరొకరిని పంపించేవారు. కొన్నేళ్లుగా సందర్శక వీసాలపై పంపిస్తున్నారు. అలా వెళ్లిన వారికి అక్కడ పని లభించక పోలీసులకు పట్టుబడి జైలులో మగ్గాల్సి వస్తోంది. కంపెనీ వీసాలపై వెళ్లిన వారు కూడా తక్కువ వేతనంతో అప్పులు తీరే మార్గం లేక కంపెనీల నుంచి బయటకు వెళ్లి(కల్లివెల్లి) చిన్న చిన్న పనులతో కాలం వెళ్లదీస్తున్నారు. వీసాలకు డబ్బులను ఎక్కువగా చెల్లించడం, కంపెనీలు తక్కువ వేతనం ఇవ్వడం, ప్రమాద బీమా లేకపోవడం తదితర కారణాలతో చాలా మంది అప్పులతోనే జీవనం వెళ్లదీస్తున్నారు. విదేశాలకు వెళ్తున్న వారిలో దాదాపు 30 శాతం మంది మాత్రమే సఫలమవుతున్నారు.

చివరి చూపునకూ కష్టమే

విదేశాల్లో వివిధ కారణాలతో చనిపోతున్నవారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. గుండెనొప్పి, ఇతర అనారోగ్యాలతో ఏటా 100 మంది వరకు మృతి చెందుతుండగా పలువురు మానసిక వేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మృతదేహాలను స్వదేశానికి తెప్పించడానికి అయినవారికి అష్టకష్టాలు తప్పడం లేదు. కంపెనీల్లో పని చేస్తుండగా మరణించినా, గాయపడినా ఖర్చులు యాజమాన్యమే భరిస్తుండగా, కల్లివెల్లిపై పని చేసేవారు, వీసా సరిగ్గా లేనివారు చనిపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రూ.2 లక్షల వరకు ఖర్చవుతుండగా అసలే అప్పుల బాధతో ఉన్న కుటుంబ సభ్యులు చివరి చూపు కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడం ఇబ్బందిగా మారింది. మృతదేహాలను స్వదేశాలకు పంపేందుకు తోటి వలసజీవులే విరాళాలు జమ చేస్తుండటం బాధాకరమైన అంశం.


ప్రభుత్వ సాయమే కీలకం

  • విదేశాలకు వెళ్లే వారికి నిబంధనలపై అవగాహన కల్పించేందుకు, నకిలీ ఏజెంట్ల బెడద అరికట్టేందుకు గతంలో కేంద్రం ఓవర్సీర్‌ మ్యాన్‌పవర్‌ రిక్రూట్‌మెంట్‌ సంస్థను ఏర్పాటు చేసింది. సంస్థ పనితీరు సరిగ్గా లేక కార్మికులకు సరైన సమాచారం దొరకలేదు. ఇప్పటికైనా సంస్థ సేవలను విస్తృతం చేయాలి.
  • విదేశీ కంపెనీలతో కేంద్రం మధ్యవర్తిత్వం నెరిపి యువతను విదేశాలకు పంపించేలా చొరవ చూపితేనే మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.
  • రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టామ్‌కామ్‌ సంస్థ సేవలను విస్తృతం చేసి యువతను కంపెనీల్లోకి నేరుగా పంపించేలా సర్కారు మధ్యవర్తిత్వం చేపట్టాలి.
  • యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించిన తర్వాతే విదేశాలకు పంపిస్తే గిట్టుబాటు వేతనం అందుతుంది.
  • నకిలీ ఏజెంట్ల కార్యకలాపాలను ప్రభుత్వం పూర్తిగా అరికట్టాలి.
  • గాయపడ్డవారికి చికిత్స అందేలా, మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలి. కంపెనీల ద్వారా కుటుంబాలకు పరిహారం వచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలి.
  • ఇమిగ్రేషన్‌ విధానాన్ని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలి.
  • విదేశాల్లో సంక్షోభం ఏర్పడినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ప్రతినిధుల బృందం వెళ్లేలా చర్యలు చేపట్టాలి.
  • ఎన్నారై పాలసీపై అన్ని పార్టీలు స్పష్టమైన విధి విధానాలను ప్రకటించి అమలు చేయాలి.
  • గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారంతో పాటు పథకాల ద్వారా ఆసరా కల్పించాలి.
  • అక్కడి జైళ్లలో మగ్గుతున్న వారికి ప్రభుత్వం న్యాయ సహాయం అందించాలి.
  • కేరళ ప్రభుత్వ విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని కేటాయించాలి.
  • విదేశాలకు వెళ్లేవారు, అక్కడ నివసించేవారి వివరాలన్నీ ప్రభుత్వం సేకరించాలి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వారికి సాయం అందించే వీలుంటుంది.
  • అర్ధంతరంగా తిరిగొచ్చిన కార్మికులకు పరిహారం, ఉద్యోగాల కల్పన తదితర ఉపశమన చర్యలు చేపట్టాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు