logo

పోరుగడ్డపై కేసీఆర్‌

భారాస అధినేత కేసీఆర్‌ రోడ్‌ షో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కరీంనగర్‌ తెలంగాణ చౌక్‌ ప్రాంతం కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోగా కేసీఆర్‌ తన ప్రసంగంతో వారిలో ఉత్తేజం నింపారు..

Published : 10 May 2024 06:48 IST

కరీంనగర్‌ రోడ్‌ షోకు భారీ స్పందన
ఉమ్మడి జిల్లాతో అనుబంధం గుర్తు చేసుకున్న భారాస అధినేత

తెలంగాణ చౌక్‌లో మాట్లాడుతున్న కేసీఆర్‌, పక్కన అభ్యర్థి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌.

కరీంనగర్‌ (ఈనాడు), రాంపూర్‌ (న్యూస్‌టుడే) : భారాస అధినేత కేసీఆర్‌ రోడ్‌ షో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కరీంనగర్‌ తెలంగాణ చౌక్‌ ప్రాంతం కార్యకర్తలు, నాయకులతో కిక్కిరిసిపోగా కేసీఆర్‌ తన ప్రసంగంతో వారిలో ఉత్తేజం నింపారు.. తన వద్ద ఉన్న సర్వేల నివేదిక ఆధారంగా 8 శాతం ఆధిక్యతలో ఇక్కడి భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ ఉన్నారని చెప్పడంతోపాటు ఇక్కడి భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శిస్తూ గులాబీ నాయకులు ఈ ఎన్నికల్లో మరింత ఆత్మవిశ్వాసంతో పని చేయాలని సూచించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడక్కడా నిర్లక్ష్యంతో ఇబ్బంది జరిగిందని.. ఈ ఎన్నికల్లో అలా జరగనివ్వొద్దని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. భారాస ప్రభుత్వ హయాంలోనే కరీంనగర్‌ అన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానంలో ఉందని.. అందుకనే ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్‌కు ఓటు వెయ్యవద్దని కేసీఆర్‌ కోరారు. ఒకవేళ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇక్కడ భాజపా గెలిచే ప్రమాదముంటుందని.. భారాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నంత సేపు నాయకులు, కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఒగ్గు కళాకారులు, డప్పు కళాకారుల ఆటపాటలు అలరించాయి.

ఉద్యమ ప్రస్థానం వివరిస్తూ..

కరీంనగర్‌ అంటే తనకు గౌరవమని.. ఇక్కడి పోరాట గడ్డ నుంచే తాను ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రాన్ని సాధించానని కేసీఆర్‌ కొనియాడారు. తాను తెలంగాణ గులాబీ జెండా ఎత్తినప్పుడు ఎస్సారార్‌ కళాశాల నుంచి నినాదం ఇచ్చానని.. ఆ జెండాను ఆకాశమంత ఎదిగే విధంగా కరీంనగర్‌ ప్రజలు దీవెనలు అందించారన్నారు. చైతన్యమున్న గడ్డ అని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. కాంగ్రెస్‌ వాళ్లు అవమానిస్తే తాను రాజీనామా చేసినప్పుడు రెండున్నర లక్షల మెజారిటీని అందించి ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని గుర్తు చేశారు. అందుకనే కరీంనగర్‌ పాత్రను మరిచిపోనన్నారు. తనకు సెంటిమెంట్‌ జిల్లా అని కొనియాడారు. ఎగువ మానేరు నుంచి దిగువ మానేరు వరకు గోదావరి నుంచి వరద కాలువల వరకు నాలుగు అమృతధారలతో ఉమ్మడి కరీంనగర్‌ జలకళతో కనిపించేదని.. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. చొప్పదండిలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న ఓ రైతు ఎండవేడితో అక్కడే చనిపోయిన తీరు బాధాకరమన్నారు. రోడ్‌ షోలో భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయ, మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపారాణి, మాజీ ఎమ్మెల్యేలు రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌, సతీష్‌బాబు, పార్టీ జిల్లాధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నాయకులు రవీందర్‌ సింగ్‌, హరిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రోడ్‌షోకు హాజరైన జనం


సైడ్‌లైట్స్‌ ఇలా..

  • రోడ్‌షోలో ఆటపాటలు అలరించాయి. గులాబీ కండువాను చేతిలో తిప్పుతూ శ్రేణులు సందడి చేశారు.
  • సాయంత్రం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు జనాలు గీతాభవన్‌ చౌరస్తా కిటకిటలాడింది.
  • బైపాస్‌ రోడ్డు.. టెలిఫోన్‌ క్వార్టర్స్‌.. రాంనగర్‌ నుంచి తెలంగాణ చౌక్‌కు కేసీఆర్‌ బస్సు చేరుకుంది.
  • మహిళలు మంగళ హారతులిచ్చి.. బస్సు ముందు కొబ్బరి, గుమ్మడి కాయలు కొట్టి స్వాగతించారు.
  • కరీంనగర్‌ ఎమ్మెల్యేను భీముడు అని, పాడి కౌశిక్‌రెడ్డిని హుజూరాబాద్‌ టైగర్‌ అని కేసీఆర్‌ పొగిడారు.
  • మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తన ఆటాపాటలతో అలరించారు. నగరం గులాబీ మయమైంది.
  • సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో ట్రాఫిక్‌ను పోలీసులు దారిమళ్లించారు.
  • బస్సు యాత్ర ముగిసిన తరువాత కేసీఆర్‌ తీగలగుట్టపల్లిలోని ఆయన స్వగృహానికి వెళ్లి బస చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు