logo

మతోన్మాద ప్రభుత్వాన్ని గద్దె దించాలి : సీపీఐ

మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించి లౌకికవాదాన్ని కాపాడే దిశగా ప్రజలు ముందుకు రావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

Published : 10 May 2024 06:46 IST

మాట్లాడుతున్న సీపీఐ నేత వెంకట్రెడ్డి

గన్నేరువరం, న్యూస్‌టుడే: మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించి లౌకికవాదాన్ని కాపాడే దిశగా ప్రజలు ముందుకు రావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం గన్నేరువరంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతాంగాన్ని కార్పొరేట్ చేసేందుకు కుట్ర పన్ని.. కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ.. కార్మిక రంగాన్ని అణగదొక్కే ధోరణి అవలంబించి.. 400 ఎంపీ సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కలలు కంటున్న భాజపాకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని కోరారు. రాష్ట్రంలో గత కేసీఆర్‌ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెందారని.. రుణమాఫీ, తదితర హామీల అమలులో విఫలమయ్యారని వివరించారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంజిరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

భగత్‌నగర్‌, న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును గెలిపించాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీల నాయకులు వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ట్రాన్స్‌పోర్ట్‌ హమాలీ యూనియన్‌ ఏరియా, కృష్ణానగర్‌, హౌసింగ్‌బోర్డులో ఇంటింటికి కరపత్రాలు పంచారు. 10వ డివిజన్‌లో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు పైడిపల్లి రాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ నగర ఉపాధ్యక్షుడు బత్తిని చంద్రయ్యగౌడ్‌, తదితరులు ఉన్నారు. సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఆధ్వర్యంలో వెంకటేశ్వర దేవాలయం, కూరగాయల మార్కెట్‌, ప్రకాశంగంజ్‌, లేబర్‌ అడ్డా, టవర్‌ సర్కిల్‌లో ప్రచారం చేశారు.

శంకరపట్నం: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో కేశవపట్నం గ్రామంలో నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కనకం సాగర్‌, నాయకులు సదానందం, రవి, రామస్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు