logo

అన్నదాతపై ప్రకృతి ప్రకోపం

యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది.

Published : 18 May 2024 05:55 IST

కేంద్రాల్లో తూకం వేయాల్సినవి 50 వేల మెట్రిక్‌ టన్నులు
ఆన్‌లైన్‌ నమోదులోనూ జాప్యం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల

చంద్రంపేటలో తడిసిన ధాన్యం ఆరబెడుతున్న మహిళ

యాసంగి వరి పంట చేతికొచ్చినప్పటి నుంచి అన్నదాతపై ప్రకృతి పగబట్టినట్లు ఉంది. అకాల వర్షాలతో వారం రోజులుగా కేంద్రాల్లో కొనుగోళ్లు మందకొడిగా సాగుతుంటే, పక్క జిల్లాకు కేటాయించిన ధాన్యం దింపుకోవడంలో రోజుల తరబడి జాప్యం నెలకొంటుంది. వెరసి కొనుగోళ్ల చివరి దశలోనూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కుప్పగా పోసిన ధాన్యంపై టార్పాలిన్లు కప్పుదామన్నా మార్కెటింగ్‌శాఖ తూకం వేసి బస్తాలకే ఇస్తున్నారు. తూకం వేయని వాటికి ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. అధికార యంత్రాంగం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెబుతున్నా సరైన వసతులు లేక ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం సేకరణ పూర్తయితే ఈనెల 25 నుంచి రోహిణి కార్తె మొదలవుతుంది. వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతుంది. వచ్చే సీజన్‌కు దుక్కులు దున్ని, తిరిగి నారుమళ్లు సిద్ధం చేసుకునేందుకు సిద్ధం కావాలి.

జిల్లాలో యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు 259 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు 55 కేంద్రాల్లో తూకాలు పూర్తయ్యాయి. 1.97 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. ఇంకా కేంద్రాల్లో 50 వేల మెట్రిక్‌ టన్నుల మేరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 29,262 మంది రైతులకు రూ.321.30 కోట్ల చెల్లింపులు జరిగాయి. తూకాలు పూర్తయిన వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ప్రతి రైతు నుంచి ఈసారి కొత్తగా ఐరిస్‌  నమోదు చేసేందుకు పరికరాలను పంపిణీ చేశారు. కానీ ఈ ప్రక్రియను చాలా కేంద్రాల్లో పక్కన పెట్టారు. చాలా చోట్ల ట్యాబ్‌లో నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఒక్కో లారీలో ఇద్దరు ముగ్గురు అంతకన్నా ఎక్కువ రైతులకు చెందిన ధాన్యం ఉండటంతో వారందరి ఐరిస్‌ తీసుకునే క్రమంలో ఏ ఒక్కరిది నమోదు కాకున్నా తిరిగి మొదటి నుంచి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా పలు ఇబ్బందులతో నిర్వాహకులు ఓటీపీ పద్ధతికే మొగ్గు చూపుతున్నారు.

ట్యాబ్‌లో రైతుల వివరాలు నమోదు

మిల్లుల్లో పేరుకుపోయిన నిల్వలు

జిల్లాలోని మిల్లుల సామర్థ్యం 2 లక్షల మెట్రిక్‌ టన్నులు. ఇదీకాక మొన్నటి వానాకాలం సీజన్‌లో సేకరించిన ధాన్యం సీఎంఆర్‌ పదిశాతం కూడా పూర్తవలేదు. అలాగే యాసంగి ధాన్యం వేలంలో సగానికిపైగా అలానే ఉన్నాయి. ఈ యాసంగి సీజన్‌కు ఇప్పటికే 1.97 లక్షల మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. మిల్లుల్లో ధాన్యం నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోయాయి. ఉన్నవాటిని భద్రపరిచేందుకే చాలా మిల్లుల్లో స్థలం సరిపోవడం లేదు. జిల్లాలోని ధాన్యాన్ని కరీంనగర్‌లోని మిల్లులకు 40 వేల మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. అక్కడికి పంపిన లారీల్లో ధాన్యం దింపుకోవడంలో రోజుల తరబడి ఆలస్యమవుతోంది. దీని ప్రభావం జిల్లాలోని కేంద్రాల్లో తూకం, తరలింపులపైన చూపుతోంది. కరీంనగర్‌లో జాప్యం జరుగుతుండటంతో జిల్లా అధికారులు అదనపు కేటాయింపులకు సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని మిల్లులకు కేటాయించాలని రాష్ట్ర అధికారులను కోరుతూ లేఖలు పంపారు.


చివరి దశలో కొనుగోళ్ల ప్రక్రియ

- జితేంద్రప్రసాద్, పౌర సరఫరాలశాఖ మేనేజర్‌

జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశలో ఉంది. పక్క జిల్లా మిల్లులకు కేటాయించిన ధాన్యం దిగుమతిలో కాస్త జాప్యం జరుగుతోంది. దీనిని నివారించి జిల్లా రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం. ఆన్‌లైన్‌ నమోదులోనూ సాంకేతిక లోపాలు సవరించుకుంటూ ముందుకెళ్తున్నాం. చెల్లింపులు కూడా త్వరగానే జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని